”ఏది సత్యం? ఏదసత్యం? ఓ మహాత్మా!, ఓ మహర్షి!” అంటూ ప్రశ్నలతోనే పాట కట్టాడు శ్రీశ్రీ. అవును మరి ఏది సత్యమో తెలుసుకోవాల్సిన పోలీసు శాఖ తమ ఊహాత్మక అభిప్రాయాన్ని వాస్తవంగా చిత్రిస్తూ…ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన 60 పేజీల రిపోర్టులో 40 పేజీలు రోహిత్ వేములను దళితుడు కాదని నిరూపించేందుకే కేటాయించారంటే… దాని వేనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అదుపాజ్ఞలు లేవని కొట్టిపారేయలేము. ఎందుకంటే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆ కమల దళాలే కనుక.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు దర్యాప్తును ముగిస్తున్నట్టు తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. ఏబీవీపీ, బీజేపీ చేసిన ప్రచారానికి పోలీసులు వంతపాడినట్టే కనబడుతోంది. రోహిత్ ఆత్మహత్యకు, ఆయన కులానికి సంబంధం ఏమిటో అర్థం కాని రీతిలో పోలీసులు నివేదిక ఉంది. తన కుల ధ్రువీకరణ పత్రం సరైనది కాదనే విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావనతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని, వారి కులం సర్టిఫికెట్లు అన్నీ నకిలీవని, ఎటువంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును మూసివేస్తున్నామని తేలికగా చెప్పేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాటి సికింద్రా బాద్ ఎంపీ, నేటి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, నాటి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, హైదరాబాద్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు ఏబీవీపీ నాయకులకు పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు.
‘చావు లాంచనాల గురించి రాయడం మర్చిపోయాను. ఎవరూ నా ఆత్మహత్యకు బాధ్యులు కాదు. వారి చర్యల ద్వారా గానీ, మాటల ద్వారా గానీ నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఇది పూర్తిగా నా స్వనిర్ణయం. నా చావుకు నేనే బాధ్యుడిని. నా స్నేహితులను గానీ, నా శత్రువులను గానీ నా ఆత్మహత్య కారణంగా వేధించకూడదు’ రోహిత్ వేముల సూసైడ్ నోట్ సారాంశం ఇది. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడితో గొడవపడిన ఏబీవీపీకి, వారికి కొమ్ముకాసిన పెద్దలకు ఈ సూసైడ్ నోట్ రక్షణ కవచంలా ఉపయోగపడొచ్చు. బోలెడంత భవిష్యత్తుకు తిలోదకాలిచ్చి అర్ధాంతరంగా తనువు చాలించిన రోహిత్ మరణంలో దాగున్న వేదన, వాస్తవ పరిస్థితులు ఎనిమిదేండ్లుగా ఈ సమజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
‘నా పుట్టుక అనేది.. నా ప్రాణాంతక ప్రమాదం. ఓ దళితుడిగా వేముల రోహిత్ చనిపోదల్చుకోలేదు. నేనెప్పుడూ కూడా రచయితను కావాలని అనుకున్నాను. కార్ల్ సాగన్ వంటి సైన్స్ రచయితగా అవ్వాలనుకున్నాను. చివరికీ.. నేను ఈ ఉత్తరం మాత్రమే రాస్తున్నాను.” అని తన సూసైడ్ నోట్‌లో రాశాడు. ఈ కేసు ఇప్పుడు మూసేయడంలోనే అసలు ట్విస్ట్ ఉంది. గతేడాది నవంబర్‌లోనే నివేదిక సిద్ధమైనా… దాన్ని ఎన్నికల వేళ మార్చి 21న క్లోజర్ రిపోర్టను హైకోర్టుకు ఇస్తే.. ఇప్పుడు నిందితులు తమపై కేసులు రద్దు చేయాలని పిటీషన్ వేయటం వెనుక పరమార్థం ఏమిటి? ఈ ఎన్నికల్లో బీజేపీకి దళిత వ్యతిరేకుల ఓటు బ్యాంకును పెంచుకోవటం, దళితుల్లో రోహిత్‌పై వ్యతిరేకత పెంచటమే ధ్యేయంగా ఈ కుట్ర జరిగిందన్న విద్యార్థి సంఘాలు ఆరోపణలకు ఈ చర్యలు మరింత ఊతాన్నిస్తున్నాయి.
కానీ, రాష్ట్ర సర్కార్ ఈ కేసును రీఓపెన్ చేస్తామని, రోహిత్ కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసానివ్వడం కొంత ఊరటనిచ్చే అంశం. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్టు విద్యాసంస్థల్లో కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకునే ‘రోహిత్ వేముల యాక్ట్’ గురించి కూడా ఈ సర్కార్ ఆలోచించాలి.
ఈ ప్రపంచంలో ఒంటరినని, తానొక శూన్యమని వేముల రోహిత్ ఎందుకు భావించాడు? ఇది ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఆర్థిక అంతరాలు, సామాజిక అంతరాలు పెరుగుతున్నంత కాలం ఈ ఖాళీలు పెరుగుతూనే ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, రిజర్వేషన్ల రద్దు వంటి ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ విద్వేషాలకు, అంతరాలకు చరమగీతం పాడాల్సిన తరుణం ఇది. ఆలోచనాపరులంతా ఆలోచించాల్సిన సమయమిది.