నాణ్యమైన విద్యలో మనమెక్కడ?

75సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణాలు వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు వారికి అందించే విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్యకు మాత్రమే ఉంది అని నెల్సన్‌ మండేలా చెప్పిన మాటలు పాలకులు గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రఖ్యాత అమెరికా సంస్థ బిఎవి గ్రూప్‌, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ యూనివర్సిటీ తయారుచేసిన వార్షిక నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యను అందించడంలో అమెరికా, ఇంగ్లాండ్‌ మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారతదేశం 32వ స్థానంలో ఉంది. ఈ సర్వేను 78దేశాల్లో కొన్ని వేల మంది ప్రజలతో ఈ సంస్థ నిర్వహించింది. 26.5కోట్ల మంది విద్యార్థులు, 14.9లక్షల పాఠశాలలు, 95లక్షల మంది ఉపాధ్యాయులతో భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపుపొందింది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద విద్యావ్యవస్థలో ఉన్న మనం విద్యారంగంలో అనేక విద్యాసంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ కూడా దేశ ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో సఫలీకృతం కాలేకపోయాం.
నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌(ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) ప్రకారం భారతదేశంలో నాణ్యమైన విద్య అందించకపోవడానికి ప్రధాన కారణాలుగా విద్యారంగానికి సరైన బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం, దేశంలో 33శాతం టీచర్లు అర్హత కలిగిన వారు అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు టీచర్లు అందిపుచ్చు కోకపోవడం, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా వారిలో సృజనాత్మకతను పెంచేలా కరికులం లేకపోవడం, దేశంలోని మెజారిటీ బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం ప్రధానంగా మంచినీరు, పారిశుధ్య నిర్వహణ, విద్యుదీకరణ తరగతి గదులు చాలినంత అందుబాటులో లేకపోవడం. 21వ శతాబ్దంలో భారతీయ యువత ప్రపంచంతో పోటీపడాలని వారికి నాణ్యమైన విద్యను అందించాలని, వారిలో సృజనాత్మకతను పెంచాలని భారత ప్రభుత్వం జూలై 29న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి) 2020ని తీసుకొచ్చింది. ఈ విద్యా విధానం ప్రకారం భారతదేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం ఆరుశాతం నిధులను కేటాయించాలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.9శాతం నిధులు (రూ.1,12,899 కోట్లు) మాత్రమే కేటాయించింది. ప్రపంచంలో నాణ్యమైన విద్యను అందించే దేశాలు వాటి బడ్జెట్లో ఆరుశాతం కన్నా ఎక్కువ నిధులనే కేటాయిస్తున్నాయి. ఉదాహరణకి నార్వే, చీలి దేశాల్లో 6.6శాతం, ఇజ్రాయిల్‌, న్యూజిలాండ్‌లు 6.2శాతం, ఇంగ్లాండ్‌ 6.1శాతం, అమెరికా 6శాతం నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం నుండి ఉన్నత చదువులకు వివిధ దేశాలకు వెళ్తున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో 68శాతం పెరుగుదలతో 7,50,365 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు తరలివెళ్లారు. ఒక సర్వే ప్రకారం ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరం వరకు భారతదేశం నుండి 1.8మిలియన్ల విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం వేరే దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలలో చదివిన వారిలో మొదటి 10ర్యాంకర్లలో 9మంది, 100 ర్యాంకులోపు 62శాతం మంది, 1000 ర్యాంకులోపు 36శాతం మంది ఉన్నత చదువుల కోసం ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు. ఈ మేధోవలసలను నివారించాల్సిన అవసరం ఉంది. దేశంలోని బడుగు బలహీన వర్గాలకి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి విద్యకు అధికంగా నిధులు కేటాయించి ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తారని ఆశిద్దాం.
– పాకాల శంకర్‌గౌడ్‌
9848377734

Spread the love