నేడున్నది మతోన్మాద దేశభక్తి… హిందూత్వ జాతీయవాదం

ఫ్రంట్‌లైన్‌:– మీరు భారతదేశ వ్యవసాయరంగ సంక్షోభం గురించి కథనాలు నివేదించడం ప్రారంభించడానికి ముందు నుంచి అంటే మీరు విద్యార్థిగా, వృత్తిపరమైన బాధ్యతల్లో ఉన్నప్పటి నుండి కూడా భారత స్వాతంత్య్రోద్యమం పట్ల ఆసక్తిగా ఉంటున్నారు. ఈ పుస్తకాన్ని ప్రచురించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?
సాయినాథ్‌:- ”ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా”లో 1997లో ”ఫర్గాటెన్‌ ఫ్రీడమ్స్‌” పేరుతో వరుస కథనాలు చేసేనాటికే అది మొదలైంది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాట్లు జరిగిన ఐదు గ్రామాలను సందర్శించిన తరువాతే నేను ఆ వ్యాసాలు రాశాను. 2002లో ”ద హిందూ”లో వరుస కథనాల ద్వారా వ్యక్తుల వాస్తవ గాథలను రాయడం మొదలు పెట్టాను. ఇది, వాటిని గ్రంథస్తం చేయాలనే ఆలోచనకు దారి తీసింది. వ్యవసాయ సంక్షోభం స్వాతంత్య్ర సమరయోధులపై చేస్తున్న పనికి అడ్డుపడింది. కాబట్టి దానితోపాటే పరిశోధన చేశాను. కానీ వ్యవసాయ సంక్షోభం మరింత దారుణంగా పెరిగిపోతుంది కాబట్టి ఆ కథనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సివచ్చింది.
జైలు జీవితం గడిపిన ఇతర కుటుంబ సభ్యులు, మా తాతయ్య (మాజీ రాష్ట్రపతి వీ.వీ.గిరి) గురించి మా అమ్మతో పాటు అనేక మంది చెప్పిన కథల్ని వింటూ పెరిగాను. మా తాతయ్యను సందర్శించడానికి వచ్చే విభిన్న సామాజిక వర్గాలకు, నేపథ్యాలకు చెందిన ప్రజలను నేను గమనించేవాడ్ని. ఇలాంటి ప్రజలే మనకు స్వాతంత్య్రం సాధించిపెట్టారని (వారు వెళ్ళిపోయిన తరువాత) ఆయన నాకు చెప్పేవారు.
ఇంత అత్యవసరంగా 2022లోనే (నవంబర్‌ 30,2022లో పుస్తకావిష్కరణ జరిగింది) ఈ పుస్తకం తీసుకొని రావడంలో ఉన్న ఉద్దేశ్యమేమంటే, సెప్టెంబర్‌ 2021 నుండి ఈ పుస్తకంలో (పాత్రధారులు) ఉదహరిం చబడిన వ్యక్తులు ఏడుగురు మరణించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 2022లో ఈ పుస్తకం రావాలి. ఈ పుస్తకంలో ఉదహరించబడిన అనేకమంది వ్యక్తులు వారి వాస్తవ గాథల్ని చూసుకోవాలనుకున్నారు. వారి కోసం నేను ఆ పని చేయాలనే పట్టుదల నాలో ఏర్పడింది.
ఫ్రంట్‌లైన్‌:- మీరు వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి పని చేసినప్పుడు, వ్యవసాయసంక్షోభ గాథలు తీసుకొన్న ప్రాంతాలకు చెందిన, వ్యవసాయరంగానికి చెందిన, స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రజల కోసం మీరు చూశారా?
సాయినాథ్‌:-దేశంలో నాకు తెలిసిన ప్రధానమైన తిరుగుబాట్లు జరిగిన ప్రాంతాల్లో, స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములైన స్త్రీ పురుషుల కోసం నేను చూశాను. అంతేకాకుండా, అప్పటికే నేను దశాబ్ద కాలానికి పైగా ఒక గ్రామీణ రిపోర్టర్‌గా పని చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో నేను జర్నలిస్టులతో పాటు ఇతర సంబంధాలు కూడా కలిగి ఉన్నాను. ‘1857 తిరుగుబాటు’ వ్యవసాయ సంక్షోభం కారణంగానే ఉత్పన్నమైంది. ఒక చరిత్ర విద్యార్థిగా నాకున్న నేపథ్యం వల్ల మంచి దృష్టికోణాన్ని కలిగి ఉన్నాను. నాకు భూమి సంబంధాలు, భూస్వాములు, రైతుల మధ్య ఉండే సంబంధాల గురించి కొంతవరకు తెలుసు. ఈ పుస్తకంలో ఉదహరించబడిన ప్రతీ ఒక్కరూ గ్రామాల్నుంచి వచ్చినవారే.
ఫ్రంట్‌ లైన్‌:- ఈ పుస్తకం రచించడంలో మీ లక్ష్యం ఏమిటి?
సాయినాథ్‌:- దీనిలో ఉదాహరించిన ప్రజల కోసమే నేనీ పుస్తకాన్ని రచించాను.1947 తరువాత పుట్టిన మాలాంటి తరానికి మా జీవితాల్ని సరియైన రీతిలో రూపుదిద్దుకోవడానికి వారి గాథలు అవసరం. మేము ఎక్కడి నుండి వచ్చామో మాకు తెలియకపోతే, మేమెక్కడికి వెళ్తున్నామో కూడా మాకు తెలియదు. 17-25 సంవత్సరాల మధ్య వయస్సున్న వారే ఎక్కువగా చదువుతారనే విషయం ఇంతకు ముందు నా పుస్తకం ద్వారా పొందిన అనుభవం చెపుతుంది. నేను ”ద లాస్ట్‌ హీరోస్‌”ను వారివైపే గురి పెట్టాను.వారి చరిత్రను, వారి కథలను, స్వాతంత్య్రపోరాటంలో జరిగిన సంఘటనలు అన్నింటినీ దోచుకుంటున్నారు.
ఆజాదీ కా అమృత మహౌత్సవ్‌ అనే ఒక ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో ఒక్క ఫొటో గానీ, వీడియో గానీ, జీవించి ఉన్న ఒక్క స్వాతంత్య్ర సమరయోధుని గురించి ఎలాంటి సమాచారం ఉండక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానిలో నరేంద్ర మోడీ ఫొటోలు, వీడియోలు ఉంటాయి. మోడీని ఒక స్వాతంత్య్ర సమరయోధునిగా భావించుకుంటున్నందుకు ఒక టీనేజ్‌ పిల్లవాడ్ని క్షమిస్తాం కానీ, దీనిని విశ్వసించే ప్రజానీకం కూడా ఉన్నారు. బ్రిటిష్‌ వలసవాదం గురించి, అది మనకు ఏమి చేసిందనే విషయం గురించి ఒక్క పేరా కూడా లేకపోవడం నన్నెంతో బాధించింది.మీరిది తెలుసుకోకుంటే, స్వాతంత్య్రపోరాటం, స్వాతంత్య్రం గురించి ఏమి తెలుసుకుంటారు?
ఫ్రంట్‌లైన్‌:- డెభ్బైఐదు సంవత్సరాల తరువాత కూడా ఒక స్వతంత్ర దేశంలో ఇప్పటికీ పేదరికంలో ఉన్నాం. ”భూమి, భుక్తి, విముక్తి” పిలుపు ఇంకా తన ప్రాసంగితను కోల్పోలేదు. దీనిపై మీ ఆలోచనలు ఏంటి?
సాయినాథ్‌:- బ్రిటిష్‌ వలసవాదం 31కరువుల్ని తెచ్చిపెట్టిన కారణంగా అదనంగా 160-168 మిలియన్ల మరణాలు సంభవించాయన్న అంచనా ప్రజలకు తెలియదు. ఒకవేళ అదే ఒక యూరోపియన్‌ దేశంలో ఆ మరణాల్లో ఒకశాతం సంభవించినా, దానిని ”జాతి సంహారం” అని ఉండేవారు. రెండు వందల సంవత్సరాల బ్రిటిష్‌ వలసవాదం భారతదేశంలో 44.6 ట్రిలియన్‌ డాలర్లు లూటీ చేసిందని ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సాపట్నాయక్‌ అంచనా వేశారు.
మన దేశాభివృద్ధి సమస్యలు ఎక్కడి నుండి వస్తున్నాయో మీకు అర్థమై ఉండాలి. బ్రిటిష్‌ రాజ్యంలోని పెద్ద పెద్ద సమస్యల అనుకరణ కొనసాగుతున్నాయి. ఫోర్బ్స్‌ జాబితాలోని బిలియనీర్లలో భారతీయులు ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. 1920 నుంచి ఎన్నడూ చూడని విధంగా, నేడు మనం ఆశ్చర్యకరమైన అసమానతల స్థాయిని గమనిస్తున్నాం. గ్రామీణ పేదల సమస్యలు ఇంకా సమస్యలుగానే మిగిలి ఉన్నాయి. భయానకమైన వాతావరణ మార్పు కాలంలో అవి మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.
ఫ్రంట్‌లైన్‌:- మహాత్మాగాంధీ, బి.ఆర్‌.అంబేద్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌లు మీ అనేక పాత్రధారుల జీవితాల్లో ప్రధానమైన వ్యక్తులు. వారు, వారి నాయకులను కలిసినప్పటి సంగతులు చెప్తారా?
సాయినాథ్‌:-ఈ పుస్తక రచన సాగినంత కాలం నేను గమనించింది ఏమంటే, పోరాట కాలంలో గాంధీ స్థానం చాలా ప్రత్యేకంగా ఉండేది. ఉదాహరణకు థేలూ, లోఖీ మహాతోలు గాంధీ, నేతాజీతో పాటు వారి స్థానిక ప్రాంతాలకు చెందిన చంబల్‌ బందిపోట్లకు వారు అంకితమయ్యారు. ఈ ముగ్గురిని ఆరాధించడంలో వారు ఎలాంటి వైరుధ్యాలను చూడలేదు.
గాంధీజీ మనుషుల్లో మంచిని మాత్రమే చూడాలని ప్రజలను కోరే మానవతా మూర్తి అనీ, థేలూ, లోఖీలు దానినే అనుసరించారు. అదే సమయంలో వారు పోలీస్‌ స్టేషన్లపై దాడికి పథకాలను కూడా రచించారు. ”నేను గాంధీ, అంబేద్కర్‌లలో ఒకర్ని ఎంపిక చేసుకోవాలా? గాంధీలో, అంబేద్కర్‌లలో నాకు ఇష్టమైతే దాన్నే అనుసరిస్తానని” శోభారామ్‌ తన కథలో చెప్పారు.
ఫ్రంట్‌లైన్‌:- స్వాతంత్య్రపోరాటంలో సహాయక పాత్ర పోషించిన సాలిహాన్‌ లేదా పురూలియాకు చెందిన భాబాని మహతో లాంటి మహిళల్ని తీసుకొనిరావడం ద్వారా ‘స్వాతంత్య్ర సమరయోధుని’ నిర్వచనాన్ని ప్రశ్నించారు గదా మీరు?
సాయినాథ్‌:- స్వాతంత్య్రసమరయోధుని గుర్తించడమెలా అనే భావనను ”ద లాస్ట్‌ హీరోస్‌” రచన సవాల్‌ చేస్తుంది. దానిలో వంట చేసేవారు, ఇంటిపనివారు, కొరియర్లు, రైతులు, కార్మికులు అందరు ఉంటారు. ఈ సాధారణ ప్రజలకు మనం గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోరాటాన్ని ముందుకు నడిపించిన వారిలో మహిళలు ఉన్నారనే విషయాన్ని మనం తెలియజేయాలి. పోరాటంలో భాగస్వామ్యానికి పనికిమాలిన నిర్వచనాలిచ్చి, మహిళల్ని దాని నుండి మినహాయించారు.
నిర్బంధంలో ఉన్న విప్లవకారులకు వార్తలను చేరవేయడానికి చెక్కపెట్టెనుపయోగించి అర్థరాత్రి నదిని దాటిన హౌసాబాయి గురించి ప్రజలు తెలుసుకోవాల్సి నవసరం ఉంది. ”ద స్వతంత్ర సైనిక్‌ సమ్మాన్‌ పెన్షన్‌ స్కీమ్‌”, ”వితంతువు” గురించి మాట్లాడుతుంది. స్వాతంత్య్రసమరయోధుడు అంటే ఎప్పటికీ పురుషుడే అని వారు భావిస్తున్నారు, కానీ ఆ యోధుల్లో మహిళలను చేర్చడం నాకు చాలా ముఖ్యం.
ఫ్రంట్‌లైన్‌:- స్వాతంత్య్రోద్యమ వాస్తవ కథనం మారుతుండడం మీరు చూస్తున్నారా?
సాయినాథ్‌:- నేడు మీరు చూస్తున్న జాతీయవాదం వాస్తవానికి హిందూ జాతీయవాదం. గాంధీ, మండేలాలు ఇలానే ఉన్నారా? ఇది మతోన్మాద దేశభక్తి, దురభిమాన పూరిత దేశభక్తి, హిందూత్వ జాతీయ వాదం. జాతీయవాదాన్ని నిర్వచిస్తూ, ప్రసంగాల్లో అధికారాన్ని ప్రదర్శిస్తున్న వారెవరూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్రను పోషించలేదు. వారు దేశాన్ని తిరోగమన దిశకు తీసుకొనిపోతున్నారు.
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)
అనువాదం బోడపట్ల రవీందర్‌,
9848412451

Spread the love