‘బండి’ హామీల్లో సమాధానంలేని ప్రశ్నలెన్నో!?

‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.’ ప్రతి సమావేశంలోనూ బీజేపీ ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఇప్పటికే అధిష్టానం కింది స్థాయి క్యాడర్‌ను ఆదేశించింది. విద్య, వైద్యం ఉచితంగా అందితే ఒక కుటుంబానికి నెలకు ఏ స్థాయిలో డబ్బులు మిగులుతాయో కూడా వివరించాలని చెప్పింది. హామీ సరే… మరి దీనిని ఎలా అమలు చేస్తారో విడమరిచి చెప్పేందుకు పార్టీ సిద్ధం కావడం లేదు. ఎందుకంటే దానిపై ఆ పార్టీ దగ్గరే సరైన ప్రణాళిక లేనట్టు అర్థమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వాటన్నింటిలో విద్య ఉచితంగానే అందుతున్నది. ఆలస్యమవుతున్నా… ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ లాంటి స్కీమ్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు ఛాయిస్‌ ప్రకారమే ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. టీచర్ల కొరత, సౌకర్యాల లేమి అంశాలలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి పర్వాలేదు. దీనిని పరిగణనలోకి తీసుకోకుంటే ఉచిత విద్య కావాలనుకున్న వాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించుకునే వీలుంది. అయితే ఇప్పుడు బీజేపీ ఇస్తున్న ఉచిత విద్య హామీ అమలు ఎలా చేస్తారోననే సందేహం అందరిలో ఉన్నది. ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటారా? ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల సంఖ్యను పెంచేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తారా? లేకుంటే తల్లిదండ్రులకే ఛాయిస్‌ను విడిచిపెట్టి ప్రయివేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించిన వారికి ఫీజును పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కడుతుందా? ఇవన్నీ సమాధానంలేని ప్రశ్నలే.
ఆరోగ్యానికి ఆయుష్మానే మందా?
ఉచిత వైద్యాన్ని ఎలా అందిస్తారనేది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకుంటే 50 నుంచి 70శాతం బిల్లును ప్రభుత్వం సంబంధిత వ్యక్తులకు చెల్లిస్తున్నది. అయితే బీజేపీ ఇస్తామన్న ఉచిత వైద్యం ఎలాంటిదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ప్రయివేటు హాస్పిటల్స్‌ అని తమ ఆధీనంలోకి తీసుకొని, వాటిని ప్రభుత్వ ఆస్పత్రులుగా మార్చేస్తారా? లేకపోతే ఏదైనా ప్రత్యేక ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను ఉపయోగించి అందరికీ ఆరోగ్య బీమా చేయించి… రోగాలు వచ్చి ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటే వాటికి బిల్లులు చెల్లిస్తారా? లేకపోతే సర్వ రోగాలకు సవాలక్ష నిబంధనలున్న ఆయుష్మాన్‌ భారత్‌ను నివారిణిగా చూపిస్తారా? ఇవి కూడా బీజేపీ చెప్పడానికి ఇష్టపడని ప్రశ్నలు.
జీహెచ్‌ఎంసీ ‘కొత్త వాహనం’ హామీలాగేనా..!
జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ కంటే ముందు హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. వేలాది వాహనాలు ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బండి సంజరు ఒక హామీ ఇచ్చారు. బీజేపీ గెలిస్తే వరదల్లో కొట్టుకుపోయిన, దెబ్బతిన్న వాహనాలకు బదులు ఆ యజమానులకు కొత్త వాహనాలను కొనిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హామీపై విడమరిచి చెప్పి నవ్వుల పాలయ్యారు. వాహనాలకు ఉన్న ఇన్సూరెన్స్‌ను ఇప్పిస్తామని చెప్పారు. బండి సంజరు నోటి వెంట వచ్చిన ఉచిత విద్య, వైద్యం హామీ కూడా సేమ్‌ అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉచితాలకు వ్యతిరేకమని చెబుతూనే…
తెలంగాణలో అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నోటికొచ్చిన హామీలు ఇస్తున్నా… వాటిని ఎలా అమలు చేస్తామని మాత్రం ప్రజలకు వివరించలేకపోతున్నది. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అమలవుతున్నా హామీలను కొనసాగిస్తామని చెబుతున్నా… వాటికి బడ్జెట్‌ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేకపోతున్నది. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయానికి అందుతున్న ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తుందా లేదా అన్నది రాష్ట్ర యూనిట్‌ చెప్పలేకపోతున్నది. రుణమాఫీ గురించి అసలు మాట్లాడడానికే ఆ పార్టీ ఇష్టపడదు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ కేంద్ర నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు గడుస్తున్నా ఆ హామీ జోలికే వెళ్లడం లేదు.
ఊహాజనిత అధికారం!
అధికారంలోకి వస్తామని మభ్యపెడుతూ బీజేపీ రాష్ట్రనాయకత్వం కార్యకర్తలతో పని చేయించుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదని కేంద్ర నాయకత్వానికి తెలిసినా… ఇప్పటికి ఉన్న నాలుగు ఎంపీ సీట్ల సంఖ్య ఆరుకు పెరగొచ్చనే అంచనాతోనే రాష్ట్రంపై కాన్సెం ట్రేషన్‌ పెంచింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు సగానికి పైగా సెగ్‌మెంట్లలో బీజేపీకి అభ్యర్థులే లేరనే విషయం బహిరంగ రహస్యమే. బీజేపీకి ఎంపీలున్న నాలుగు పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలో 28 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో పార్టీ ఎన్ని గెలవచ్చో కచ్చితంగా చెప్పే వారు కూడా లేరు.
– ఫిరోజ్‌ ఖాన్‌
9640466464

Spread the love