Sunday, July 12, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీనైపుణ్యాలలో మనమెక్కడ..?

నైపుణ్యాలలో మనమెక్కడ..?

- Advertisement -

మానవ మేధస్సు సృష్టించిన అద్భుతమైన నైపుణ్యాలు ఒకవైపు వైద్యం, విద్య, సమాచార సాంకేతికత, అంతరిక్ష విజ్ఞానం వంటి రంగాల్లో అపూర్వ విజయాలను సాధిస్తున్నాయి. మరోవైపు అవే నైపుణ్యాలు అత్యాధునిక ఆయుధాల రూపంలో యుద్ధాలకు, విధ్వంసాలకు, ఇతర దేశాలపై దాడులకు, మానవ సమాజాల అస్థిరతకు కారణమవుతున్నాయి. ఇలాంటి కాలంలో మనం ఈ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.

మానవ మేధస్సుతో ఆవిష్కతమైన ఏ నైపుణ్యమైనా సర్వమానవ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. అంతేగానీ, మానవ సమాజాల విధ్వంసానికి, వ్యవస్థల దుర్వినియోగానికి ఆయుధంగా మారకూడదు. శాస్త్ర విజ్ఞానం మనిషి చేతిలో ఆయుధంగా కాకుండా, ఆశయంగా మారాలి. మానవ సమాజం అభిమృద్ధి చెందిన ప్రతి దశ వెనుక ఒక గొప్ప శక్తి పనిచేసింది. ఆ శక్తి పేరు నైపుణ్యం. రాతియుగంలో రాళ్లను ఆయుధాలుగా మలచడం నుంచి, నేటి కత్రిమ మేధస్సు (AI) ఆధారిత ప్రపంచాన్ని నిర్మించడం వరకు మానవ సమాజాన్ని ముందుకు నడిపించినది మానవ మేధో ఆర్జిత నైపుణ్యాలే. అందుకే ‘నైపుణ్యం లేని సమాజం నిలబడలేదు, నైపుణ్యాలను గౌరవించిన సమాజమే నాగరికతను నిర్మిస్తుంది’ అని చరిత్ర మనకు చెబుతుంది. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే, ప్రతి నాగరికత ఎదుగుదలకు ఆయా కాలమాన పరిస్థితులకి అణుగుణంగా మానవుడు సంపాదించుకున్న నైపుణ్యాలే కారణం. మనిషి అడవుల్లో సంచరించే జీవిగా ఉన్న దశ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే స్థాయికి ఎదగడానికి కారణం కేవలం జ్ఞానం కాదు, ఆ జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకువచ్చిన నైపుణ్యాలు. అందుకే నాగరికత చరిత్ర అనేది నైపుణ్యాల పరిణామ క్రమానికి అద్దం పట్టే చరిత్రగా చరిత్రకారులు భావిస్తారు. ప్రపంచ ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే, ఒక దేశ అభిమృద్ధిని నిర్ణయించేది కేవలం సహజ వనరులు కాదని స్పష్టమవుతుంది. ఆ వనరులను శాస్త్రీయంగా, సమర్థవంతంగా వినియోగించగల మానవ నైపుణ్యాలే ఆ దేశాల ప్రగతిని నిర్దేశిస్తాయని అర్ధమవుతుంది.

విప్లవంతోనే మార్పు
‘స్కిల్‌ ఈజ్‌ ది న్యూ వెల్త్‌’ అనే భావన నేడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన అభిమృద్ధి సూత్రం. ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప మార్పు ఒక విప్లవంతో ప్రారంభమైంది. వ్యవసాయ విప్లవం మానవుడికి స్థిర జీవనాన్ని అందించింది. పారిశ్రామిక విప్లవం ఉత్పత్తి శక్తిని పెంచింది. సమాచార విప్లవం ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చింది. ఇప్పుడు ప్రపంచం కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్‌ సాంకేతికత, జీవసాంకేతిక విజ్ఞానం ఆధారంగా మరో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఈ యుగంలో దేశాల భవిష్యత్తును నిర్ణయించేది ‘నైపుణ్య విప్లవం’. ఈ రోజు ప్రపంచంలో పోటీ సహజ వనరుల మధ్య లేదు. చమురు నిల్వలు, బంగారు గనులు, భూభాగం మాత్రమే దేశ శక్తిని నిర్ణయించడం లేదు. నైపుణ్యం కలిగిన మానవ వనరులే నిజమైన జాతీయ సంపద. విద్య, విజ్ఞానం, సాంకేతికతను సమర్థంగా వినియోగించే యువతే రేపటి ప్రపంచ నాయకులు. ఈ దిశగా ప్రపంచ దేశాల్లోని యువతని మరింత చైతన్యవంతం చేయటానికి ఏటా జూలై 15న ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2014లో ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రతి ఏడాది జూలై 15న యువతకు ఉపాధి, గౌరవప్రదమైన ఉద్యోగాలు, వ్యవస్థాపకత (Entrepreneurship), సుస్థిర అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు 2015 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

‘ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు’
2026 కి సంబంధించిన ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ‘ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు’ అనే నినాదంతో జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలని కోరింది. ఈ ఏడాది ఇతివృత్తం కేవలం సాంకేతిక నైపుణ్యాలకే పరిమితం కాకుండా, కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్‌ సాంకేతికత, గ్రీన్‌ నైపుణ్యాలు, సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలు, పౌర బాధ్యత, మానవీయ విలువలను సమన్వయం చేసే సమగ్ర నైపుణ్యాల అవసరాన్ని నొక్కి చెబుతోంది. వేగంగా మారుతున్న ఉద్యోగ ప్రపంచంలో యువత మార్పులకు అనుగుణంగా మాత్రమే కాకుండా, సమాజాన్ని ముందుకు నడిపించే నాయకులుగా ఎదగాలని ఈ దినోత్సవం పిలుపునిస్తోంది.

ప్రపంచం వేగంగా మారుతోంది
విజ్ఞానం, సాంకేతికత, కృత్రిమ మేధస్సు, ప్రపంచీకరణ వంటి పరిణామాలు మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో విద్య, డిగ్రీ, మార్కులు మాత్రమే విజయాన్ని నిర్ణయించే అంశాలు కావు. వ్యక్తిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టేది అతని నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం. ఈ రెండూ పరస్పర పూరకాలు. నైపుణ్యాలు అవకాశాలను కల్పిస్తే, వ్యక్తిత్వం ఆ అవకాశాలను విజయాలుగా మలుస్తుంది. ప్రతి మనిషిలో సహజంగా కొన్ని ప్రతిభలు ఉంటాయి. అయితే వాటిని గుర్తించి అభివద్ధి చేయడం ద్వారా మాత్రమే అవి నైపుణ్యాలుగా మారతాయి. కమ్యూనికేషన్‌, నాయకత్వం, సమస్య పరిష్కార సామర్థ్యం, సమయపాలన, సాంకేతిక పరిజ్ఞానం, నిర్ణయ సామర్థ్యం, బృందం సమన్వయం వంటి నైపుణ్యాలు నేటి ప్రపంచంలో అత్యంత విలువైనవిగా మారాయి. విద్యాసంస్థలు జ్ఞానాన్ని అందిస్తాయి. కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి సమాజానికి ఉపయోగపడేలా చేసే శక్తి నైపుణ్యాల ద్వారా వస్తుందన్న ఆంశాన్ని ఇప్పటికే గుర్తించిన ప్రపంచ దేశాలు ఆ దిశగా విద్యా రంగాలలో అనేక నూతన విధానాలకి శ్రీకారం చుట్టాయి.

ఇతర దేశాల అనుభవం
జర్మనీ ప్రపంచంలోనే అత్యుత్తమ వృత్తి విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. అక్కడ ద్వంద్వ విద్యా విధానం ద్వారా విద్యార్థులు ఒకవైపు తరగతి గదిలో విద్యను అభ్యసిస్తూనే, మరోవైపు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందుతారు. అందుకే జర్మనీలో నిరుద్యోగ సమస్య తక్కువగా ఉంటుంది. జపాన్‌లో నైపుణ్యం అంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానం కాదు. సమయపాలన, క్రమశిక్షణ, నాణ్యత, బాధ్యత, జట్టు భావన, నిరంతర మెరుగుదల వంటి అంశాలకి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఫలితంగా వారి ఉత్పాదకత ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. సింగపూర్‌ ప్రభుత్వం నైపుణ్య భవిష్యత్తు వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి పౌరుడు జీవితాంతం కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. ఉద్యోగం చేస్తున్నవారు కూడా మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పోటీలో ముందంజలో నిలుస్తోంది. దక్షిణ కొరియా విద్య, పరిశోధన, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసింది. ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్‌, సమాచార సాంకేతిక రంగాలలో యువతకు ప్రత్యేక శిక్షణ అందించడం వల్ల ప్రపంచస్థాయి కంపెనీలు అక్కడ

అభివృద్ధి చెందాయి. ఫిన్లాండ్‌ విద్యా విధానంలో మార్కుల కంటే అభ్యాసం,సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అమెరికాలో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, స్టార్టప్‌ సంస్థలు పరస్పరం అనుసంధానమై పనిచేస్తాయి. విద్యార్థులు పరిశోధన, స్టార్టప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, డిజిటల్‌ నైపుణ్యాల ద్వారా ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త ఆలోచనలను వ్యాపారాలుగా మార్చే వ్యవస్థ అక్కడ బలంగా ఉంది. చైనా రోబోటిక్స్‌,కృత్రిమ మేధస్సు, హైటెక్‌ పరిశ్రమలకు అనుగుణంగా లక్షలాది మంది యువతకు వృత్తి శిక్షణ అందిస్తోంది. ప్రభుత్వ ప్రణాళికలు, పరిశ్రమల భాగస్వామ్యం, సాంకేతిక విద్యలో పెట్టుబడులు చైనాను ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ కేంద్రంగా నిలిపాయి. ప్రపంచంలోని విజయవంతమైన దేశాలు యువతకి పెట్టుబడి అంటే దేశ భవిష్యత్తుకి పెట్టె పెట్టుబడి అన్న విషయాన్ని స్పష్టంగా నిరూపించాయి. నైపుణ్యాలు ఉన్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడరు, వారే కొత్త అవకాశాలను సృష్టిస్తారు. వారు కేవలం తమ జీవితాన్నే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని, విజ్ఞానాన్ని, మానవ నాగరికతను కూడా ముందుకు నడిపిస్తారు.

సమాజంలో సమగ్ర అభివృద్ధి
విద్యాసంస్థలు కేవలం పరీక్షల కోసం కాకుండా జీవితానికి అవసరమైన నైపుణ్యాలను బోధించాలి. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు కలిసికట్టుగా నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించాలి. గ్రామీణ యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమగ్ర అభివద్ధి సాధ్యమవుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే సరిపోవు. కమ్యూనికేషన్‌, నాయకత్వం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం,బృందం సమన్వయం, నైతిక బాధ్యత వంటి మానవీయ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ నైపుణ్యాలే ఒక ఉద్యోగిని నాయకుడిగా తీర్చిదిద్దుతాయి. ప్రపంచ యువతలో కనిపించే ముఖ్యమైన లక్షణం జీవితాంతం నేర్చుకోవడం. ఒక డిగ్రీతోనే కెరీర్‌ పూర్తవుతుందని వారు భావించరు. కొత్త సాంకేతికత వచ్చిన ప్రతిసారీ కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇదే భవిష్యత్తులో భారత యువత కూడా అలవర్చుకోవాల్సిన ముఖ్యమైన అలవాటు. భారతదేశం ఏటా లక్షలాది మంది యువత విద్య పూర్తి చేసి ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఒకవైపు యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, మరోవైపు అనేక పరిశ్రమలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం వెతుకుతున్నాయి. ఈ వైరుధ్యానికి ప్రతిభ లేకపోవడం కాదు, విద్య, నైపుణ్యాల మధ్య సమన్వయం లేకపోవటమే కారణం. దీనిని సరిచేయాలంటే మన విద్యా వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు సరిపోవు. నైపుణ్య విప్లవం అవసరం.

సమస్యలను అధిగమించాలి
పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు ప్రయోగశాలలు, పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు, స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు కూడా విద్యలో అంతర్భాగం కావాలి. ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు కనీసం ఒక వత్తి నైపుణ్యం, ఒక డిజిటల్‌ నైపుణ్యం, ఒక జీవన నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణా సదుపాయాల కొరత, డిజిటల్‌ అసమానత, ఆచరణాత్మక విద్య లోపం వంటి సమస్యలను అధిగమించాల్సి ఉంది. కృత్రిమ మేధస్సు (AI) యుగంలో ప్రపంచ యువత (AI)ని ఉపయోగించడం నేర్చుకుంటోంది. (AI)తో పోటీ పడటం కాదు, (AI)తో కలిసి పనిచేయడం నేర్చుకుంటోంది. భారత యువత కూడా ఈ దిశగా వేగంగా ముందుకు సాగాలి. అదే సమయంలో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, పర్యావరణ చైతన్యాన్ని కూడా మరచిపోకూడదు. దేశాభివద్ధితో పాటు, సామాజిక ప్రగతికి సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో, మానవీయ నైపుణ్యాలు కూడా అంతే ముఖ్యం. కమ్యూనికేషన్‌, నాయకత్వం, సహానుభూతి, సహకారం, నైతిక విలువలు, సమయపాలన, బాధ్యత, ప్రజాసేవా దక్పథం వంటి లక్షణాలు సమాజాన్ని బలపరుస్తాయి. అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ మానవ విలువలు లేకపోతే సమాజం అసమానతలు, వివక్ష, ఘర్షణలు, అవినీతి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సామాజిక న్యాయాన్ని కూడా
ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధస్సు యుగంలోకి అడుగుపెడుతోంది. అనేక పనులను యంత్రాలు చేయగలుగు తున్నాయి. అయినప్పటికీ మానవుని సృజనాత్మకత, నైతిక నిర్ణయాలు, సామాజిక బాధ్యత, భావోద్వేగ అవగాహన, నాయకత్వం వంటి లక్షణాలను యాంత్రిక ప్రగతి ద్వారా భర్తీ చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. అందువల్ల భవిష్యత్తు సమాజానికి అవసరమైన నైపుణ్యాలు కేవలం సాంకేతికమైనవే కాకుండా మానవీయమైనవిగా కూడా ఉండాలి. నైపుణ్యాలు సమాజంలో ఆర్థికాభివద్ధిని మాత్రమే కాదు, సామాజిక న్యాయాన్ని కూడా బలోపేతం చెయ్యాలి. ఒక యువకుడు నైపుణ్యం సంపాదిస్తే అతనికి ఉపాధి లభిస్తుంది; ఒక కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది; ఒక గ్రామం అభివృద్ధి చెందుతుంది; చివరకు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. ఈ విధంగా వ్యక్తిగత నైపుణ్యం సామాజిక అభివృద్ధికి దారితీస్తుంది.

నైపుణ్యాధారిత విద్యతోనే
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. అయినప్పటికీ పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయం, ఆరోగ్యరంగం, డిజిటల్‌ టెక్నాలజీ,కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, గ్రీన్‌ ఎనర్జీ వంటి రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. దీనికి కారణం డిగ్రీల కొరత కాదు, నైపుణ్యాల కొరత అనే వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేస్తోంది. వీటి లక్ష్యం యువతను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలను సష్టించే వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడం. భారతదేశం 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించాలంటే, విద్యా వ్యవస్థను డిగ్రీలకే పరిమితం చేయకుండా పరిశ్రమల అవసరాలకు అనుసంధానించిన నైపుణ్యాధారిత విద్యను విస్తతంగా అమలు చేయాలి. భారతదేశానికి ఇప్పుడు కావాలసింది రాజకీయ, పారిశ్రామిక విప్లవాలు మాత్రమే కాదు ఒక శక్తివంతమయిన నైపుణ్య విప్లవం కావాలి
.
రెండింటి సమతుల్యతే
చివరగా.. మనం ఒక అంశాన్ని విస్మరించకూడదు. ప్రపంచం నేడు మునుపెన్నడూ లేనంత వేగంగా సాంకేతిక ప్రగతిని సాధిస్తుంది.కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్‌, బయోటెక్నాలజీ, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ వంటి రంగాల్లో వేగవంతమైన అభివద్ధి మానవ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అయితే ఈ మార్పుల మధ్య ఒక ప్రాథమిక ప్రశ్న మన ముందు ఉత్పన్నమవుతుంది, యువతలో కేవలం నైపుణ్యాలు ఉంటే సరిపోతుందా? లేక వాటికి మానవత్వం కూడా తొడవ్వలా? అన్నదే మనముందు ఉన్న అతి పెద్ద సవాల్‌. మానవత్వం లేని నైపుణ్యం ప్రమాదకరం, నైపుణ్యం లేని మానవత్వం పరిమిత ప్రభావం మాత్రమే చూపగలదు. సమాజ పురోగతికి ఈ రెండూ సమానంగా అవసరం. అణుశక్తి విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు; అదే అణుశక్తి యుద్ధంలో వినాశనాన్ని కూడా సృష్టించగలదు. కృత్రిమ మేధస్సు వైద్య సేవలను మెరుగుపరచగలదు, అదే సాంకేతికత తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి మానవ నాగరికతను ముందుకు నడిపేది నైపుణ్యం, దాన్ని సురక్షితమైన, న్యాయమైన, సమానమైన దిశలో నడిపేది మానవత్వం అన్న అంశాన్ని గుర్తించాలి. ఈ రెండింటి సమతుల్యతే భవిష్యత్తు ప్రపంచానికి బలమైన పునాది. యువత తమ వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూనే మానవీయ విలువలను కూడా జీవితంలో ఆచరిస్తే, వారు విశ్వ మనవులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దానికి ఈ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం వేదికగా నిలుస్తుందని ఆశిద్దాం.

మన యువత ఎక్కడా..?
ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారతదేశానికి ఒక అపూర్వమైన అవకాశం లభించింది. నేటి యువతే రేపటి ఆర్థిక వ్యవస్థను, శాస్త్ర సాంకేతిక రంగాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దబోతున్నారు. అయితే ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్న ఈ కాలంలో ఒక ప్రశ్న మనల్ని చాలాకాలంగా వేధిస్తుంది. భారత యువత నైపుణ్యాల పరంగా ఇతర దేశాల యువతతో పోలిస్తే ఎక్కడ నిలుస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ‘ముందున్నారనిగాని’ లేదా ‘వెనుకబడ్డారనిగాని’ అనే నిర్ధిష్టంగా ఒక్క మాటతో చెప్పలేం. భారత యువతలో ప్రతిభకు కొదవ లేదు. ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థలు, పరిశోధనా సంస్థలు, వైద్య రంగం, అంతరిక్ష పరిశోధన, పారిశ్రామిక రంగాలలో భారతీయులు తమ ప్రతిభను నిరూపించారు. కానీ మొత్తం యువ జనాభాను పరిశీలిస్తే విద్యా వ్యవస్థ, ఉద్యోగ రంగం మధ్య ఉన్న ‘నైపుణ్యాల అంతరం’ అనేది దేశీయ యువతని ఇంకా కలవర పెడుతూనే ఉంది. కనుక భారతదేశ యువశక్తిని నైపుణ్యాలతో తీర్చిదిద్దడం దేశాభివద్ధికి అత్యంత అవసరం.

డా|| కె. శశిధర్‌, 94919 91918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -