– ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే
– కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-భువనగిరి
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల తరపున పోరాడేది, ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసేది, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేసేది మాత్రం కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రామాల్లో సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో అధికారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రజా సమస్యలపై పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోరాటాలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను అనేక రకాల ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వ పథకాల అమలు విషయంలో శ్రద్ధ పెట్టకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కానీ వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన బీఆర్‌ఎస్ చరిత్రను ప్రజలు గమనించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పగడ్బందీగా అమలు చేస్తే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉంటారని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తే మళ్లీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఐ(ఎం) నాయకత్వం, కార్యకర్తలు, ప్రజలకు ఎల్లప్పుడూ చేరువలో ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, పైళ్ల ఆశయ్య, రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్, ఆనగంటి వెంకటేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.