ఆయకట్టుకు నీళ్లివ్వకపోవడానికి బీఆర్ఎస్సే కారణం : మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల వద్ద రిజర్వాయర్ ఎందుకు నిర్మించ లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత సర్కార్ చేసిన నిర్వాకం వల్లే వర్షాభావ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీళ్లివ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరద లేని పరిస్థితుల్లో గేట్లు ఎత్తితే తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. ‘విద్యుత్ ఉత్పత్తి ద్వారా మాత్రమే కొంత నీటిని సాగర్‌కు వదిలారు.జూరాలలో 3 టీఎంసీల వరకు పూడిక ఉంది, మరో 2 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం నిల్వ చేస్తున్నారు. గతంలో 20 టీఎంసీల గట్టు రిజర్వాయర్‌ను తీసుకువస్తామని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం నీళ్లను ఎర్రవల్లికి తీసుకువచ్చారు కానీ గట్టు రిజర్వాయర్‌ను మాత్రం నిర్మించలేదు.
పాలమూరు జిల్లాను ఎండబెట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నీటిలో తెలంగాణ వాటా 30 శాతానికి మించలేదు. మా ప్రభుత్వంలో ఈ వాటా 43 శాతం వరకు ఉంది. నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ సర్కారు రాజీపడదు. 15 టీఎంసీలతో గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు ఇచ్చాం. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ఇంకా నీళ్లు వస్తాయని భావిస్తున్నాం. ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను సరైన పద్ధతిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే సీజన్‌కు నీటి ఎద్దడి లేకుండా చేస్తాం’’ అని జూపల్లి అన్నారు. పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు, రాయలసీమ ఎత్తిపోతల, ముచ్చుమర్రి, సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలోనే ఆంధ్రా ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టులపై అవగాహణ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
గతంలో కరెంట్ పుష్కలంగా ఉన్నా ఆరేడు గంటలు మాత్రమే ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లు కాగా, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 19,543 మెగావాట్లకు పెరిగినా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కేంద్రం తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఎందుకివ్వలేదో రాష్ర్ట బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు నేపథ్యంలో అదనంగా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. బీజేపీ నాయలు పోవాల్సింది జూరాలకు కాదు, ప్రధాని దగ్గరకని హితవు పలికారు. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
మీరెందుకు జారాల వద్ద రిజర్వాయర్ కట్టలేదు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



