– ఎస్‌బీఐపై సుప్రీం ఆగ్రహం
– సోమవారం లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారని ఎస్‌బీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆదేశాలను ఎందుకు పూర్తిగా పాటించలేదని నిలదీసింది. దీనిపై తదుపరి విచారణ జరిగే సోమవారం నాటికల్లా కోర్టుకు ఎస్‌బీఐ వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎస్‌బీఐ దాచిపెట్టేందుకు యత్నిస్తోందంటూ వచ్చిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ జెబి పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్‌బీఐ, ఆ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన నెంబర్లను ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆదేశించింది. నెంబర్లు వెల్లడించకపోవడంతో, ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియలేదని ధర్మాసనం పేర్కొంది. విశిష్టమైన ఆల్ఫా న్యూమరిక్ నెంబరును వెల్లడిస్తే, ఆ నెంబర్‌తో ఆ విరాళాలు ఎక్కడికి వెళ్లాయో తెలుస్తాయన్నారు.
విచారణ ప్రారంభం కాగానే, ప్రధాన న్యాయమూర్తి జస్టిస డి వై చంద్రచూడ్, ”ఒక విషయం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఎవరు వాదనలు వినిపిస్తున్నారు? వారు బాండ్ నంబర్‌లను వెల్లడించలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని వెల్లడించాలి” అని స్పష్టం చేశారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకొని ”నేను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున వాదనలు వినిపించడం లేదు. మీరు ఎస్‌బిఐకి నోటీసు జారీ చేయవచ్చు. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఏదైనా చెప్పవలసింది వారే అని భావిస్తున్నాను” అని చెప్పారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించి ఎస్‌బిఐ తమ వద్ద అందుబాటులో ఉన్న అన్ని వివరాలను అందించేలా చూడాలని కోరారు. ”రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఇసికి అందించాలి. కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదారు పేరు సహా రిడీమ్ చేయబడాలి. కాకపోతే ఆ వివరాలను ఎస్‌బిఐ వెల్లడించలేదు. ఎలక్టోరల్ బాండ్ల ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను వెల్లడించాలి” అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం దరఖాస్తును ధర్మాసనం కొట్టివేసింది. ఇసిఐ సీల్డ్ కవర్‌లో గతంలో ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. అంతేకాదు.. ఇసిఐ సీల్డ్ కవర్‌లో ఇచ్చిన వివరాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో శనివారం సాయంత్రం 5 గంటల కల్లా ఉంచాలని స్పష్టం చేసింది.