జీవనరెడ్డి గుస్సా.. కాంగ్రెస్ ను వీడనున్నారా?

 

నవతెలంగాణ జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై తన అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. తనకు కనీస సమాచారం  కూడా లేకుండా ఆయన్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం. జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్‌, జీవన్‌రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నేతలు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్టు సమాచారం. 40 ఏండ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని.. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

Spread the love