ఖమ్మం బరిలోకి ప్రియాంక దిగుతుందా?

Will Priyanka enter the Khammam ring?– రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానం చేసి ఏఐసీసీకి పంపిన సంగతి తెలిసిందే. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని సునాయాసంగా కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు అంచనా. సోనియగాంధీ పోటీ చేసేందుకు వీలుగా ఆ టికెట్‌ ఆశిస్తున్న రేణుకాచౌదరిని రాజ్యసభకు పంపించింది. అయితే అనూహ్యంగా సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయంగా ప్రియాంకగాంధీని రంగంలో దించాలని భావిస్తున్నది. అందుకోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో సోనియాగాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే… ప్రియాంకగాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని పార్టీ నేతలు మరో ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఆమె పోటీ చేయడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో లాభం ఉంటుందనేది కాంగ్రెస్‌ నేతల ఆలోచన. ప్రియాంకగాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల ఎత్తుగడ సరైందే అయినప్పటికీ అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె ఇక్కడి రావడం అంత ఈజీ కూడా కాకపోవచ్చనేది మరికొంత మంది నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జి జనరల్‌ సెక్రటరీగా కొనసాగుతున్నారు. అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈసారి తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచేందుకు కృషి చేయాల్సి కర్తవ్యం ఆమెపై ఉన్నది. అంతేకాకుండా యూపీలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే తెలుస్తోంది.ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆ రాష్ట్ర బాధ్యత ప్రియాంకపై పడింది. ఇప్పటివరకు అక్కడి నుంచి సోనియగాంధీ, రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో అమేధీ నుంచి రాహుల్‌గాంధీ ఓడిపోగా,రాయబరేలీ నుంచి సోనియాగాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంకగాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే, పార్టీకి ప్రయోజనం కంటే నష్టం జరిగే అవకాశమే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. ఓటమిని ముందుగా అంగీకరించిన ప్రియాంకగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారంటూ ఆ రాష్ట్రంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది బీజేపీకి మరో ఆయుధంగా మారబోతుందనే విషయం అధిష్టానం పెద్దల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రియాంక యూపీని వదిలి ఇక్కడి రావడం అంత సులువు కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రం నుంచి ఆమె పోటీ చేయడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభావం పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అందుకోసమే ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయించేలా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అయితే ప్రియాంకగాంధీని పోటీ చేయించి, లబ్ది పొందాలనే కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే..

Spread the love