– రసవత్తరంగా రాజకీయ మలుపులు..
– రోజురోజుకో పరిణామాలు..
– టికెట్ ప్రస్తుత ఎంపీకేనా లేదా, చైర్‌పర్సన్‌కేేనా?
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ప్రస్తుత ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు. రంజిత్‌రెడ్డితో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్‌కు కలిసివస్తుందా! చేవెళ్లలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుత ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సరిగ్గా ఐదేండ్ల క్రితం 2019 లోక్‌సభ ఎన్నికలు సమయంలోనే వరంగల్‌కు చెందిన వ్యాపారవేత అయిన గడ్డం రంజిత్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుని చేవెళ్ల ఎంపీగా అవకాశం కల్పించింది. అప్పటి వరకు ఈ ప్రాంత నాయకులు, ప్రజలు ఎవరికీ పరిచయం లేకపోయినా అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ అభ్యర్థిని నమ్మి ఓటు వేసి గెలిపించారు. అనతి కాలంలోనే ఆయన తన రాజకీయంలో రాణించి పేరు సంపాదించుకున్నారు. బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఎదిగారు. పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ జీవితం ఎంపీతోనే మొదలైంది. రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం ఎమ్మెల్యేలు, నాయకులంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో ఆయన ఆత్మరక్షణలో పడిపోయారు. అందరికంటే ముందే చేవెళ్ల అభ్యర్థిగా మరోసారి రంజిత్ రెడ్డి పేరు ప్రకటించినప్పటికీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పోటీకి వెనకంజ వేశారు. అప్పటినుంచి మౌనంగా పార్టీకి దూరంగా ఉంటూ , తెరవెనుక పావులు కలిపి చివరికి హస్తం గూటికి చేరారు.
రంజిత్‌రెడ్డితో కాంగ్రెస్‌కు కలిసి వచ్చేనా?
ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇన్నాళ్లు పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అని ఆమెను పార్టీలోకి తీసుకువచ్చి, పరిచయం చేశారు. అనూహ్య పరిణామాలతో ఆమెకు టికెట్ ప్రకటించలేదు. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కావడంతో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. రజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే, సునీతామహేందర్‌రెడ్డి పరిస్థితి ఏమిటని దానిపై చర్చ జరుగుతోంది. ఆమెకు మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం ఇస్తారని ప్రచారం కూడా సాగుతోంది. కానీ ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగితే పార్టీ నాయకులు ఏ మేరకు సహకరిస్తారని ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీ టికెట్ కోసం పార్టీ మారిన సునీతామహేందర్‌రెడ్డి వర్గం సపోర్ట్ చేస్తుందా. బీఆర్‌ఎస్ ఆయన వర్గం నాయకులు, కార్యకర్తలు, ఆయన వెంట నడుస్తారా, అనేది చర్చనీయంగా మారింది. ఇప్పటికే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బలమైన అభ్యర్థిగానే కాకుండా స్థానికుడిగా ఉన్న పేరు ఉన్నది. బీఆర్‌ఎస్ కాసానికి జ్ఞానేశ్వర్ అభ్యర్థిగా ప్రకటించింది. మరి కాంగ్రెస్ నుంచి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిదే.