విపక్ష సభ్యుల విశ్వాసం పొందుతారా?

Confidence of opposition members do you get– వరుసగా రెండోసారి స్పీకర్‌గా ఓం బిర్లా
– గత లోక్‌సభలో ఆయన తీరుపై ప్రతిపక్షాల అసంతృప్తి
– ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు
– బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపకుండానే ఆమోదించారన్న అపవాదు
– ఈసారి అప్రమత్తత అవసరమంటున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి పదవిని చేపట్టారు. స్పీకర్‌ ఎంపిక విషయంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటంతో దేశ చరిత్రలో ఎన్నిక అనివార్యమైంది. అధికార బలంతో చివరకు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లానే లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఓం బిర్లా మరో మారు ఎన్నికైనందును ప్రతిపక్షాలు ఆయన హయాంలో లోక్‌సభలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేస్తున్నాయి. ఈ సభలో కూడా అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని అంటున్నాయి. అయితే, ఆయన ఈ సారి విపక్ష సభ్యుల విశ్వాసాన్ని పొందుతారా? సభను సక్రమంగా నడుపుతారా? పాలక, ప్రతిపక్షాలకు సమానావకాశాలు కల్పించి, సభను ప్రశాంతంగా ఉంచ గలరా? అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
మణిపూర్‌ ఎంపీలకు నో ఛాన్స్‌
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా తన మొదటి పదవీకాలంలో 17వ లోక్‌సభలో వ్యవహరించిన విధానాన్ని అప్పటి ప్రతిపక్ష ఎంపీలు తప్పుబట్టారు. అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు సమర్థవంతమైన సభ్యులుగా పనిచేయటం కష్టంగా ఉండటమే కాకుండా మొత్తం దేశాన్ని ఆందోళనకు గురిచేసే అంశాలపై మాట్లాడేందుకు అధికార పార్టీ సభ్యులను కూడా అనుమతించ లేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు.. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, మణిపూర్‌ హింసపై కష్టాలను చర్చించినప్పుడు, ఇద్దరు ఎంపీలు మోడీ క్యాబినెట్‌లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన బీజేపీకి చెందిన ఆర్‌.కె రంజన్‌ సింగ్‌, మోడీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ లోర్హో ఎస్‌. ఫోజ్‌లకు బీజేపీ అగ్ర నాయకత్వం కొన్ని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం తరఫున కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతున్నందున.. సంబంధిత అంశంపై చర్చించొద్దని ఆ ఇద్దరు ఎంపీలకు చెప్పటం గమనార్హం. హింసను ఎదుర్కొంటున్న మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన ఎంపీలకు ఆ అవకాశం నిరాకరించటంతో వారు లోక్‌సభలో తమ బాధలను ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేకపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను వారు సభలో పూర్తిగా వివరించలేకపోయారు.
స్పీకర్‌గా ఓం బిర్లా తన విధులను సక్రమంగా నిర్వహించటంలో విఫలమయ్యారని ప్రతిపక్ష నాయకులు చెప్పారు. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించి, అందరికీ అవకాశమిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఆయన.. అధికార పక్షం కనుసన్నల్లో నడిచారని ఆరోపించారు. ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ కొత్త క్రిమినల్‌ చట్టాలను ఆమోదించుకున్న సందర్భమూ గర్హనీయమని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి ట్రాక్‌ రికార్డున్న ఓం బిర్లా.. కొత్తగా ఎన్నికైన లోక్‌సభకు రెండోసారి స్పీకర్‌ కావటం ప్రతిపక్ష ఎంపీలకు నిరాశను కలిగిస్తున్నదని అంటున్నాయి.
సంప్రదింపులు లేకుండానే వ్యవసాయ చట్టాలు ఆమోదం
ఓం బిర్లా హయాంలో లోక్‌సభలో ఆమోదించిన వివాదాస్ప వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు చేసిన ఉద్యమాన్ని దేశం మరచిపోలేదు. అయితే, సాగు చట్టాల విషయంలో ఎలాంటి ఫలవంతమైన చర్చలు, వాటాదారులతో సంప్రదింపులు లేకుండా ఆమోదించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కాగా, చివరకు రైతుల ఉద్యమాల కారణంగా ఆ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విదితమే.
బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపలేదు
కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలోనూ ఓం బిర్లా స్పీకర్‌గా తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని విమర్శకులు చెప్తున్నారు. బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపని సందర్భాలు అనేకం ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ లోక్‌సభ నియమాలను పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఆయన విధానం కనిపించిందని చెప్తున్నారు. 17వ లోక్‌సభలో బిల్లులపై ఎటువంటి చర్చ జరగలేదనీ, శాసనపరమైన ఉద్దేశం లేకుండానే వాటికి తుది రూపం ఇవ్వకుండా ఆమోదం పొందాయని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. 2014కి ముందు, అనేక ప్రభుత్వ శాఖలు రూపొందించిన బిల్లులను స్పీకర్‌ పరిశీలనల కోసం అనేక శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలకు పంపేవారు. అయితే, ఓం బిర్లా పదవీకాలంలో సాధారణంగా ద్వైపాక్షిక ప్రాతిపదికన పనిచేసే కమిటీలకు చాలా తక్కువ బిల్లులు సూచించబడటం గమనార్హం.
పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ డేటా ప్రకారం.. స్పీకర్‌ ఓం బిర్లా 17వ లోక్‌సభను కవర్‌ చేసిన తన మొదటి పదవీ కాలంలో కేవలం 16 శాతం బిల్లులనే సంబంధిత కమిటీలకు పంపారు. ద్వైపాక్షిక ప్రాతిపదికన బిల్లుల పరిశీలన ఆధారంగా పటిష్టమైన చట్టాన్ని రూపొందించే ప్రక్రియకు ఇది మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. బిల్లులను కమిటీలు పరిశీలించిన తర్వాత కూడా లోక్‌సభలో వాటిపై చర్చ జరగలేదని అంటున్నారు. పాలక, ప్రతిపక్ష సభ్యులతో కూడిన బిల్లులపై చర్చ జరిగినప్పుడు బిల్లులను చక్కదిద్దే శాసనపరమైన ఉద్దేశం సాధ్యమవుతుందని చెప్తున్నారు.
విపక్ష సభ్యులే టార్గెట్‌గా పార్లమెంట్‌లో చర్యలు
అదానీ అంశంపై విపక్ష నేతల పలు వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తొలగించటంతో చర్చా వేదికగా పార్లమెంటు పాత్ర క్షీణించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అటువంటి ట్రాక్‌ రికార్డ్‌తో.. ఓం బిర్లా తన రెండో టర్మ్‌లో, కొత్తగా ఎన్నికైన 18వ లోక్‌సభకు చెందిన ఎంపీలలో విశ్వాసం కలిగించగలరా? నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సభా నియమాలను నిక్కచ్చిగా పాటిస్తారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ, రాజ్యసభ నుంచి 140 మందికి పైగా విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయటంతో స్పీకర్‌, చైర్మెన్లు ప్రతిపక్షాలను శిక్షించాలనే ఉద్దేశం బయటపడిందని అంటున్నాయి.

Spread the love