ఈసారి దాటేస్తారా?

ఈసారి దాటేస్తారా?– ప్రతీకార విజయంపై రోహిత్‌సేన గురి
– ఇంగ్లాండ్‌తో భారత్‌ సెమీస్‌ పోరు నేడు
– రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-గయానా: భారత్‌, ఇంగ్లాండ్‌ మరో మెగా మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రిపీట్‌ పోరుకు ప్రొవిడెన్స్‌ వేదిక కానుంది. మాజీ చాంపియన్‌ టీమ్‌ ఇండియా నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌తో సెమీస్‌ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. భీకర ఫామ్‌లో ఉన్న భారత్‌.. రెండేండ్ల కిందట ఆడిలైడ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
భారత్‌ దూకుడు : అజేయ రికార్డుతో భారత్‌ సెమీస్‌కు చేరుకుంది. అన్ని రంగాల్లోనూ దీటుగా రాణిస్తుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసీస్‌పై విశ్వరూపం దాల్చి డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం మరింత తేలిక చేశాడు. విరాట్‌ కోహ్లి సైతం పరుగుల వేటలో మెరిస్తే నేడు ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు కనిపించటం ఖాయమే. జీవం లేని పిచ్‌లపై ఆడిన అనుభవం భారత మిడిల్‌ ఆర్డర్‌ సొంతం. రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్‌ పిచ్‌పై ఇంగ్లాండ్‌ మాయగాళ్లపై శివం దూబె భారత్‌కు కీలకం కానున్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో అందరూ ఫామ్‌లో ఉండటం భారత్‌కు అదనపు బలం. దూకుడు మంత్ర పఠిస్తున్న టీమ్‌ ఇండియా నేడు భారీ స్కోరుపై గురి పెట్టనుంది. బుమ్రా, అర్షదీప్‌లు మరోసారి పేస్‌ బాధ్యతలు తీసుకోనుండగా.. కుల్దీప్‌ యాదవ్‌ మాయజాలం నేడు మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించనుంది. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండర్‌ నైపుణ్యాలు నేడు అవసరం రానున్నాయి!.
ఇంగ్లాండ్‌ ఏం చేసేనో! : ఇంగ్లాండ్‌ భీకర ఫామ్‌లో లేకపోయినా.. సెమీఫైనల్‌ స్ఫూర్తి ఆ జట్టును ముందుకు నడిపిస్తుంది. జోశ్‌ బట్లర్‌, ఫిల్‌ సాల్ట్‌ మినహా బ్యాటర్లలో ఎవరూ నిలకడగా రాణించటం లేదు. హ్యారీ బ్రూక్‌, జానీ బెయిర్‌స్టో ఒకట్రెండు ఇన్నింగ్స్‌ల మెరుపులకే పరిమితం అయ్యారు. భారత స్పిన్నర్లపై నేడు బ్యాటర్లు సమిష్టిగా మెరిస్తేనే ఇంగ్లాండ్‌ పోటీ ఇవ్వగలదు. స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, మోయిన్‌ అలీ నేడు ఇంగ్లీశ్‌ జట్టుకు కీలకం కానున్నారు.
స్పిన్‌ స్వర్గధామం! : ప్రొవిడెన్స్‌ పిచ్‌ స్పిన్‌కు సహకరించనుంది. పేసర్లకు బౌన్స్‌ లేకపోగా..స్పిన్నర్లకు మంచి టర్న్‌ లభించనుంది. నాణ్యమైన స్పిన్నర్లు కలిగిన టీమ్‌ ఇండియాకు ఇది అనుకూలతే. ఉదయం మ్యాచ్‌ కావటంతో మంచు ప్రభావం పూర్తిగా ఉండదు. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ నమోదైన సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 146 పరుగులు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.
వర్షం ముప్పు? : భారత్‌, ఇంగ్లాండ్‌ సెమీస్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్‌ సాగటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే సైతం లేదు. కానీ మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించేందుకు అదనంగా 250 నిమిషాల సమయాన్ని కేటాయించారు. సెమీస్‌ మ్యాచ్‌ ఫలితం తేల్చేందుకు కనీసం 10 ఓవర్ల మ్యాచ్‌ జరగాల్సి ఉంటుంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతికి సైతం ఇది వర్తిస్తుంది. వర్షంతో మ్యాచ్‌ సాగకుంటే.. సూపర్‌8 దశలో మెరుగైన ప్రదర్శనతో భారత్‌ నేరుగా ఫైనల్లోకి ప్రవేశించనుంది.

Spread the love