Sunday, June 28, 2026
E-PAPER
Homeఆటలులెక్క సమం చేస్తారా?

లెక్క సమం చేస్తారా?

- Advertisement -

విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్‌
ఐర్లాండ్‌తో రెండో టీ20 నేడు
సాయంత్రం 6 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

సొంతగడ్డపై 12 ఏండ్లుగా టెస్టు సిరీస్‌ ఓటమి ఎరుగని టీమ్‌ ఇండియా.. గౌతం గంభీర్‌ చీఫ్‌ కోచ్‌గా ఏకంగా వైట్‌వాష్‌ ఓటమి చవిచూసింది. టీ20 ఫార్మాట్‌లో వరుసగా 12 సిరీస్‌ల్లో విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా ఇప్పుడు ఆ రికార్డును సైతం ప్రమాదంలో పడేసుకుంది. కనీసం సిరీస్‌ను కోల్పోకుండా చూసుకునే అవకాశం అయ్యర్‌సేనకు ఉంది. దీంతో టీమ్‌ ఇండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు చారిత్రక సిరీస్‌ విజయంపై ఐర్లాండ్‌ కన్నేసింది. భారత్‌, ఐర్లాండ్‌ రెండో టీ20 పోరు నేడు.

నవతెలంగాణ-బెల్‌ఫాస్ట్‌
ఎవరూ ఊహించని విధంగా ఆరంభమైన భారత్‌, ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌.. ముగింపు సైతం ఊహకందని రీతిలో ఉండబోతుందా? లేదంటే ప్రపంచ చాంపియన్‌ తనదైన శైలిలో పుంజుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. పిచ్‌ నుంచి అదనపు బౌన్స్‌ లభించగా భారత టాప్‌ ఆర్డర్‌ రెండు ఓవర్ల వ్యవధిలో ప్రత్యర్థికి అవకాశం కల్పించింది. నేడు రెండో టీ20 సైతం అక్కడే జరుగుతుండగా ఆతిథ్య ఐర్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. రెండు మ్యాచ్‌లకు విరామం ఒక్కరోజే అయినా, చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ స్పెషల్‌ నెట్‌ సెషన్స్‌తో సాధనకు సై అన్నాడు. పసికూన ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ప్రపంచ చాంపియన్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన వేళ నేడు బెల్‌ఫాస్ట్‌లో రెండో టీ20 మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది.

మార్పులు ఉంటాయా?
భారత తుది జట్టులో మార్పులు చేర్పులు ఉంటాయా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ జట్టులోకి వచ్చినా.. అతడి అరంగేట్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వైభవ్‌ సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే టాప్‌ ఆర్డర్‌లో అందరూ ఒక్కో స్థానం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. వాషింగ్టన్‌ సుందర్‌ నం.4 బ్యాటర్‌గా ఐపీఎల్‌లో రాణించాడు. కానీ అతడిని తుది జట్టు నుంచి తీసేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. సూర్యాన్షు షెడ్జె సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. వైభవ్‌ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించి.. మిగత బ్యాటర్ల పొజిషన్లను మార్పు చేస్తారా? లేదంటే షెడ్జెకు మిడిల్‌ ఆర్డర్‌లో చాన్స్‌ ఇస్తారా అనేది చూడాలి. సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లలో ఇద్దరు నిలబడినా తొలి టీ20లో ఫలితం భిన్నంగా ఉండేది. ఈ ముగ్గురు బ్యాటర్లు నేడు మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంది. అభిషేక్‌ శర్మ తొలి మ్యాచ్‌లో రాణించినా.. నేడు అతడికి విశ్రాంతి ఇచ్చి జట్టు కాంబినేషన్స్‌లో మార్పు చేసే ఆలోచన కొట్టిపారేయలేం. బౌలింగ్‌ లైనప్‌లో ప్రసిద్‌ కృష్ణ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. యువ పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ను తీసుకుని ప్రసిద్‌ను బెంచ్‌కు పరిమితం చేయవచ్చు. హర్షిత్‌ రానాతో కలిసి అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను తీసుకోనున్నాడు.

అద్భుతంపై ఆశలతో..
భారత్‌పై చారిత్రక సిరీస్‌ విజయంపై ఐర్లాండ్‌ కన్నేసింది. 2022లో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ విజయంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఐర్లాండ్‌… ఇప్పుడు అదే ప్రదర్శన భారత్‌పై పునరావృతం చేయాలని ఎదురుచూస్తుంది. కెప్టెన్ లోర్కాన్‌ టక్కర్‌ సారథ్య బాధ్యతలు దక్కినప్పుడల్లా బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. టక్కర్‌తో పాటు టాప్‌ ఆర్డర్‌లో ఒకరిద్దరు బ్యాటర్లు రాణిస్తే ఆ జట్టు మంచి స్కోరు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బెల్‌ఫాస్ట్‌లో పరిస్థితులపై ఐర్లాండ్‌ బౌలర్లకు మంచి అవగాహన ఉంది. ఇక్కడ పిచ్‌ నుంచి అదనపు బౌన్స్‌ లభించటంతో పేసర్లు బ్యాటర్లను సులువుగా ఇరకాటంలో పడేస్తున్నారు. మాట్‌ హోలార్డ్, జై మూండ్ర, లియాం మెక్‌కార్టీ, మాథ్యూ హాంప్రేస్‌లు ఉత్సాహం గా కనిపిస్తున్నారు. గరెత్‌ డెలానీ, జార్జ్‌ డాక్‌రెల్‌, బెన్‌ కాలిట్జ్‌లు రాణిస్తే ఐర్లాండ్‌ అద్బుతం చేసే అవకాశాలు ఎక్కువే!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -