– 2028 ఒలింపిక్స్‌లో 31 స్పోర్ట్స్
లసానె (స్విట్జర్లాండ్): విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో లింగ సమానత్వం ప్రస్ఫుటించేలా స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తుది ఆమోదం తెలిపింది. 2028 ఒలింపిక్స్‌కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం ఆతిథ్యం ఇవ్వనుండగా కొత్తగా చేర్చిన ఐదు క్రీడాంశాలతో కలిపి ఓవరాల్‌గా 31 స్పోర్ట్స్‌లో పతక పోటీలు నిర్వహించనున్నారు. 351 పసిడి పతక ఈవెంట్లు లాస్ ఏంజిల్స్ నిర్వహించనుండగా.. 10500 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఇందులో 5333 మహిళా, 5167 పరుష అథ్లెట్లు పోటీలో నిలువనున్నారు. లాస్‌ఏంజిల్స్ నిర్వహణ కమిటీ ప్రతిపాదనలతో కొత్తగా మహిళా క్రీడాకారులకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఇక ఒలింపిక్స్‌లో దాదాపుగా అన్ని ఈవెంట్లలోనూ మెన్స్ జట్లతో సమానంగా ఉమెన్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఫుట్‌బాట్‌లో పురుషుల జట్లు 12 మాత్రమే ఆడనుండగా.. మహిళల విభాగంలో 16 జట్లు పోటీపడనున్నాయి.
క్రికెట్‌లో ఆరు జట్లు : లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్ ప్రవేశపెట్టగా.. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పోటీపడనున్నాయి. ఒలింపిక్స్‌లో పోటీపడే జట్ల అర్హత ప్రక్రియపై ఐసీసీ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఐసీసీ ర్యాంకింగ్స్ లేదా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టాప్-6లో నిలిచిన జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. బాక్సింగ్‌ను సైతం అధికారికంగా ఒలింపిక్ ప్రొగ్రామ్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.