హంగూ అర్బాటo లేకుండా ప్రజల వ‌ద్ద‌కే అభ్యర్థులు

ప్రజా సమస్యలపై పోరాట విజయాలే సీపీఐ(ఎం) ఎన్నికల అజెండా అని, ఆ పోరాట వారసత్వం కలిగిన తమకు ఓటేసి గెలిపించాలని సీపీఐ(ఎం) అభ్యర్థులు– ఒక్కొక్క చోట ఒక్కో సమస్యను వివరిస్తూ…
– సీపీఐ(ఎం) కార్యకర్తల ఇంటింటి ప్రచారాలు
– పోరాడేవారికే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-విలేకరులు
ప్రజా సమస్యలపై పోరాట విజయాలే సీపీఐ(ఎం) ఎన్నికల అజెండా అని, ఆ పోరాట వారసత్వం కలిగిన తమకు ఓటేసి గెలిపించాలని సీపీఐ(ఎం) అభ్యర్థులు ప్రజలను కోరడం ఆకట్టుకుంటోంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలోని 19 చోట్ల సీపీఐ(ఎం) తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. అభ్యర్థులందరూ పోరాట చరిత్ర ఉన్నవారే. సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల మాదిరి హంగూ అర్బాటాలతో సభలు నిర్వహించలేకున్నా… ఇండ్లవద్దే ప్రజలను కలుస్తూ ఓట్లు అడగడం చర్చనీయాంశమవుతోంది.
ఇంటింటికి వెళ్లడంతో పాటు కూలీల అడ్డాలు, వ్యాపార కూడళ్లు వద్దకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. పీఎన్‌ఎం కళాకారులు కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారమార్గమేంటో కూడా చూపుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నా.. సీపీఐ(ఎం) అభ్యర్థులను మాత్రం ఆదరిస్తున్నారు. పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందని తమను కలిసిన సీపీఐ(ఎం) అభ్యర్థులకు చెబుతున్నారు. ప్రజలను ఆలోచింపచేసేలా ఏ పార్టీ అభ్యర్థి చరిత్ర ఏంటో.. ఏ పార్టీ విధానమేంటో గెలిచాక ఏమి చేయబోతుంది.. గెలిచిన వారు పార్టీలు మారిన విధానాన్ని వివరించుకుంటూ పోతున్నారు.
బుధవారం ఖమ్మం సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌ ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో త్రీ టౌన్‌ ప్రాంతంలోని గాంధీ చౌక్‌ చౌరస్తా వద్ద బిల్డింగ్‌ వర్కర్స్‌ కార్మికులను కలిసి మాట్లాడారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం, జిల్లా ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌, డీసీసీబీ బ్యాంకు నందు జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆలోచించి నిత్యం ప్రజల కోసం కార్మికుల, ప్రజల కోసం పనిచేస్తున్న సీపీఐ(ఎం)కు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం ప్రాంతంలో కారం పుల్లయ్యకు మద్దతుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో ప్రజలను, వ్యాపార వర్గాలను ఓట్లు అభ్యర్థించారు. అసమర్ధ కాంగ్రెస్‌, అవకాశవాద బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వస్తే అ పార్టీలో చేరి సొంత ప్రయోజనలకే పరిమితమౌతారని అదే వైరాలో సీపీఐ(ఎం) నుంచి పోటీ చేస్తున్న భూక్య వీరభద్రంని గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు చేయిస్తాడని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. కొణిజర్ల మండలం బస్వాపురంలో ఆయన పాల్గొన్నారు. మధిర నియోజవర్గంలో ఆగిన అభివృద్ధి తన గెలుపుతో ముందుకుపోతుందని మధిర సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు. ఎర్రుపాలెంలోని పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ప్రచార రథం వెంట బైకులతో ర్యాలీ నిర్వహించారు. డప్పు దరువులతో పూల మాలలతో హారతులతో ఘన స్వాగతం పలికారు.
డబ్బు సంచులతో వచ్చే వాళ్లకు, దందాలు చేసే వాళ్లకు, అసెంబ్లీలో మాట్లాడలేని వారికి ఓటు వేయొద్దని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలంలోని అన్నపరెడ్డిగూడెం, వేములపల్లి, బుగ్గ బావి గూడెం, సల్కునూరు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనని గెలిపిస్తే ముందు బెంచీలో కూర్చుని ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.

Spread the love