– ప్రభుత్వ కార్యక్రమాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
– సజావుగా గ్రామసభలు జరపాలి
– అలసత్వం వద్దు: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందించే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన కార్యక్రమం.. జిల్లాస్థాయి సమన్వయ సమావేశాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లే బాధ్యత అధికారులదేనన్నారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, వాటి ఆచరణ, అమలు చేసే పాత్రలో అధికారులే కీలకమన్నారు. చట్టానికి లోబడి రెవెన్యూ, పోలీస్ శాఖలు ఆరు గ్యారంటీలను ప్రజలకు అందేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను తాను ప్రస్తుతం వెలికి తీసే ఆలోచన లేదన్నారు. అలాంటి తప్పిదాలను తమ ప్రభుత్వం చేయబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, పరిపాలనకు అధికారగణం గుండె లాంటిందన్నారు. ప్రజలకు జవాబుదారీగా సేవలందించే ప్రభుత్వ పరిపాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గ్రామసభలు సజావుగా జరిగేలా అందరూ బాధ్యత వహించాలన్నారు. గ్రామ సభల్లో దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారుల బృందాలుగా ఏర్పాటు చేసి మహాలక్ష్మి, బృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రతి రోజూ ఉయదం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల్ని స్వీకరించాలని చెప్పారు. గ్రామపంచాయతీ స్థాయిలో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. అతనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అర్హులైన లబ్దిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు.. ఆరు గ్యారంటీలు అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్, చంద్రశేఖర్, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ సురేష్‌మోహన్, డీఆర్‌ఓ నగేష్, ఏఎస్పీ అశోక్ ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.