పనిలో భారం.. వేతనాల్లో కోతలు

Heavy work.. Cuts in wages– సుప్రీం కోర్టు తీర్పు అమలేది..!
– 2 ‘జీ’ నెట్‌వర్క్‌తో యాప్‌లు పనిచేసేదెట్లా..!
– సమస్యల పరిష్కారంకై పోరుకు సిద్ధమంటున్న అంగన్‌వాడీలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పని బారేడు.. వేతనం మూరెడు అన్న చందంగా అంగన్‌వాడీల పరిస్థితి నెలకొంది. అంగన్‌వాడీ బాధ్యతలతో పాటు ప్రభుత్వానికి అవసరమైన సర్వే రిపోర్టులు మొత్తం వారే చేయాలి. ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ రిపోర్టులు సిద్ధం చేయాలంటే అంగన్‌వాడీల అవస్థలు వర్ణనాతీతం. 2జీ నెట్‌వర్క్‌తో నానాతంటాలు పడుతున్నారు. ఇబ్బందులు ఏవైనా పొట్టకూటీ కోసం తపనపడుతున్న అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చే వేతనాలతో పూటగడవని పరిస్థితి. ఎన్నో ఏండ్లుగా ఇదే పనిని నమ్ముకున్న అంగన్‌వాడీలు ఉద్యోగాన్ని వదులుకోలేక.. చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నారు. ‘చావో రేవో’ ప్రభుత్వంతో తేల్చుకుంటామని ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు అంగన్‌వాడీలు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో 149 ప్రాజెక్టుల్లో 70 వేల మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 7 ప్రాజెక్టుల పరిధిలో 1600 సెంటర్లు ఉన్నాయి. ఇందులో సుమారు 3200 మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఉన్నారు. వీరంతా ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వం ఇచ్చే అత్తెసరు వేతనంతో జీవనం గడపుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని ఎన్నో పోరాటాలు చేశారు. ఇటీవల స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు అంగన్‌వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీల్లో కంటితుడుపుగా ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ. 50 వేలు నిర్ణయించింది. అసలు సమస్యలు పక్కన పెట్టి ఉద్యోగ విరమణ వయసు 65 ఏండ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో అంగన్‌వాడీలు మరో మారు పోరుకు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం అమలు, సుప్రీం కోర్టు తీర్పు, ఉద్యోగ భద్రత ఇలా పలు సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
పనికి తగ్గ వేతనం ఏదీ..?
అసలు పని కంటే.. అదనపు పనులు ఎక్కువగా చేయాల్సి వస్తోందని అంగన్‌వాడీలు ఆవేదన చెందుతున్నారు. అంగన్‌వాడీ విధుల్లో భాగంగా 18 రికార్డులు రాయాల్సి ఉంది. కానీ అదనంగా ఆన్‌లైన్‌ ఎంట్రీల పేరు యాప్‌లో అప్లోడ్‌ చేయాల్సి వస్తోంది.
బతుకమ్మ, దసర పండగలు వచ్చాయంటే ప్రభుత్వ స్కీమ్‌లు, చీరలు పంపిణీ చేయడంతో సరిపోతుందని అంగన్‌వాడీలు వాపోతున్నారు. ఇంత చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5జీ కాలంలో.. 2 జీతో వర్క్‌
అన్‌లైన్‌లో న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకర్‌ సిస్టమ్‌, పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ల ద్వారా మాతా, శిశుఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్‌ యాప్‌లను తీసుకొచ్చింది. 2018లో డాటాను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసేందుకు 2జీ మొబైల్స్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ఆ మొబైల్స్‌ పనిచేయకపోవడంతో అంగన్‌వాడీలు నానా అవస్థలు పడుతున్నారు. యాప్‌లో డేటా ఎంట్రీ చేయకపోతే జీతంలో కోత పెట్టడంతో అప్పులు చేసి మరి సొంతంగా మొబైల్స్‌ కొనుగోలు చేశామని అంగన్‌వాడీలు చెబుతున్నారు.
40 ఏండ్లుగా పనిచేస్తున్నా..
రూ.175 వేతనం ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నా. నా సర్వీస్‌ 40 ఏండ్లు పూర్తయింది. నేటికి నా జీతం రూ.13,650 మాత్రమే. ఇన్నాండ్లు కష్టపడినా ఫలితం లేదు. ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. అత్తెసరు వేతనంతో కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి. ప్రభుత్వ అవసరాలు తీర్చుతున్నా.. మా బతుకుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
– రాజ్యలక్ష్మి, యాచారం మండలం, మేడిపల్లి సెంటరర్‌
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాల్సిందే
ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారిస్తామని చర్చలకు పిలిచి, అసలు సమస్యలు పక్కన పెట్టి ఒకట్రెండు హామీలను అసంపూర్తిగా అమలు చేస్తామంటే ఊరుకునేది లేదు. కనీస వేతనం అమలు, సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆపేది లేదు.
జయలక్ష్మి, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Spread the love