విశ్వవిఖ్యాత గాయని

World famous singerలతా మంగేష్కర్‌ ను వరించిన అవార్డులు
1947 సంవత్సరంలో ‘మజ్‌ బూర్‌’ సినిమాతో గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన లతా మంగేష్కర్‌ అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించింది. అలా 26 వేలకు పైగా 20 భారతీయ భాషల్లో పాటలు పాడిన లతా మంగేష్కర్‌ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు గాన కోకిలగా పేరు దక్కించుకున్న లతా మంగేష్కర్‌ భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు 2001 లో భారత అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ అవార్డుతో సత్కరించింది. అలాగే 1969 లో ‘పద్మ భూషణ్‌’, 1999 లో ‘పద్మ విభూషణ్‌’, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుతో పాటు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, 15 బెంగాల్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ బెస్ట్‌ ఫిమేల్‌ ప్లేబ్యాక్‌ అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్‌ స్పెషల్‌ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మీ తర్వాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు. 1989లో సంగీత నాటక అకాడమీ, ఖైరాఘర్‌లోని ఇందిరా కళా సంగీత విశ్వవిద్యాలయం, కొల్హాపూర్‌లోని శివాజీ విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌లను సైతం అందుకున్నారు. ఏడు దశాబ్దాల కెరీర్‌లో భారతీయ సంగీత పరిశ్రమకు ఆమె చేసిన సహకారం నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా, వాయిస్‌ ఆఫ్‌ ది మిలీనియం, క్వీన్‌ ఆఫ్‌ మెలోడీ వంటి గౌరవ బిరుదులను పొందింది. 1990లో ఎన్‌.టి.ఆర్‌. జాతీయ అవార్డు, 2009 లో ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డుతో పాటు, 2009లో మంగేష్కర్‌కు ఫ్రెంచ్‌ లెజియన్‌ ఆఫ్‌ హానర్‌, ఫ్రాన్స్‌ అత్యున్నత స్థాయి అధికారి బిరుదు లభించింది. 2012లో ఔట్‌లుక్‌ ఇండియా గ్రేటెస్ట్‌ ఇండియన్‌ పోల్‌లో మంగేష్కర్‌ పదవ స్థానంలో నిలిచారు. 1984లో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమె గౌరవార్థం లతా మంగేష్కర్‌ అవార్డును నెలకొల్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 1992లో లతా మంగేష్కర్‌ పేరిట అవార్డును ఏర్పాటు చేసింది.
సినీ నేపధ్య గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన లతా మంగేష్కర్‌ పేరు తెలియని సంగీతాభిమానులుండరు. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించిన మెలొడీ క్వీన్‌ లతా మంగేష్కర్‌ గాత్రం అమతంలా ఉంటుంది. స్వర రాగ గంగాప్రవాహం ఆమెది. ఆమె గాత్రానికి మురిసిపోని మది లేదు. ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోసి, సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపిస్తూ తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ‘ఇండియన్‌ నైటింగెల్‌ లతా మంగేష్కర్‌’ నర్గీస్‌ నుండి ప్రీతి జింటా వరకు అనేకమంది నటిమణులకు పాటలు పాడింది. అది యుగళ గీతమైనా… జానపదమైనా… గజల్‌ గానమైనా.. ఖవ్వాలి రాగమైనా…. భక్తి గీతమైనా ఆమె గొంతులో అలవోకగా జాలువారాయి… ఎలాంటి సాహిత్యానికైనా తన స్వరంతో పట్టంకట్టిన అపురూప గాన గీతిక లతా మంగేష్కర్‌ 1948 నుంచి 1978 వరకు 50వేలకు పైగా పాటలు పాడిన ఏకైక గాయనిగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ లో పేరు సంపాదించుకుని, గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వంచే 1969లో పద్మభూషణ్‌, 1999లో పద్మవిభూషణ్‌, 2001లో భారతరత్న వంటి అత్యున్నత పురాస్కారాలు అందుకున్న లతా మంగేష్కర్‌ వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. సెప్టెంబరు 28న లతా మంగేష్కర్‌ పుట్టిన రోజు సందర్భంగా సోపతి పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
లతా మంగేష్కర్‌ 1929 సెప్టెంబరు 28న సుప్రసిద్ధ సంగీతకారుడు ‘దీనానాథ్‌ మంగేష్కర్‌’ కు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. లతా మంగేష్కర్‌ కు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్‌ అనే నలుగురు తోబుట్టువులు. ఆశా భోంస్లే కూడా ప్రముఖ నేపధ్య గాయని. లత తండ్రి దీనానాథ్‌ మంచి క్లాసికల్‌ సింగర్‌. దీంతో లతా చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లతా, ఆ తర్వాత ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్‌ అలీ ఖాన్‌ వద్ద శిష్యరికం చేసింది.. లతా కుటుంబమంతా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో అందరూ సంగీతంలోనే స్థిరపడ్డారు. లతా మంగేష్కర్‌ పుట్టిన సమయంలో పెట్టిన పేరు హేమ.. అయితే తండ్రి నటిస్తున్న ”భవ బంధన్‌” నాటకంలో లతిక అనే పాత్రలో నటించగా, అప్పటి నుంచి హేమ పేరు లతా గా మారిపోయి, లతా మంగేష్కర్‌ గా ప్రఖ్యాతి గాంచింది. లతా తన ఐదేళ్ల వయసు నుంచే నాటకాల్లో నటించడం.. పాటలు పాడడం మొదలు పెట్టారు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో జన్మించిన లతా అక్కడ 16 ఏళ్లు ఉన్నా, మిగతా కాలమంత ముంబైలోనే గడిపింది.
1942లో లతా 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచే కుటుంబ పోషణ భారం లతాపై పడింది. ఆ సమయంలో నవయుగ్‌ చిత్రపత్‌ సినిమా కంపెనీ అధినేత మాస్టర్‌ వినాయక్‌ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నాడు. గాయనిగా, నటిగా లత కెరీర్‌ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మొదటి సారిగా మరాఠి చిత్రం ”కిటి హసల్‌”లో ”నాచు య గడే, ఖేలు సారీ మనీ హౌస్‌ భారీ..” అనే పాటను పాడింది లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావ్‌ నవరేకర్‌ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ఆమె పాటను తొలగించారు. లతా కెరియర్‌ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. 1942లో మరాఠీ చిత్రం ‘పహలీ మంగళా-గౌర్‌’ సినిమాలో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత 1943లో ‘చిముక్లా సుసార్‌’, 1944లో ‘గజబాహు’, 1946లో ‘జీవన్‌ యాత్ర’, 1948లో ‘మందిర్‌’ వంటి చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్‌, నూర్జహాన్‌, సురయాలు గాయనీలుగా వెలుగుతున్నారు.
అదే సమయంలో గులాం హైదర్‌ ప్రోత్సహంతో లతా 1947లో ‘మజ్‌ బూర్‌’ చిత్రంలో ‘దిల్‌ మేరా తోడా’ పాట పాడింది. అయితే ఈ పాట విన్న వారంతా లతాను విమర్శించారు. ఆ విమర్శలను చాలెంజ్‌గా తీసుకున్న లతా ఉర్దూలో సంగీత శిక్షణ తీసుకుంది. దేశ విభజన వల్ల ‘ఖుర్షీద్‌, నూర్జహాన్‌లు’ పాకిస్థాన్‌ వెళ్లడం, ఆ సమయంలో నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడంతో లతా గాయనిగా ఉన్నత శిఖరాల్ని అందుకోవడానికి దోహద పడింది. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్‌ గాయనిగా అవకాశం కల్పించగా, ప్రముఖ సంగీత దర్శకుడు సి.రామచంద్ర లతా పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. సినీ నేపథ్య గానంలో శిఖరాగ్రాన చేరిన లతాకి ‘మహాల్‌’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ”ఆయేగా ఆయేగా..” పాటతో లతా దశ తిరిగింది. ‘మహాల్‌’ సినిమా హిట్‌ కావడంతో లతా వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ‘ఆగ్‌’, ‘శ్రీ 420’, ‘చోరి చోరి’, ‘హైవే నెంబర్‌ 44’, ‘దేవదాస్‌’ వంటి చిత్రాలు లతాని బాలీవుడ్‌లో తిరుగులేని గాయనిగా నిలబెట్టాయి. 1960లో నౌషాద్‌ అలీ సంగీతంలో వచ్చిన ‘మొఘల్‌-ఏ-ఆజమ్‌’ సినిమాలో పాడిన ”ప్యార్‌ కియాతో డర్నా క్యా” పాట లతా మంగేష్కర్‌ ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చింది. సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన లతా 1990లో సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించింది. ఈ సంస్థ గుల్జార్‌ దర్శకత్వంలో ‘లేఖిని’ సినిమాను రూపొందించగా, ఈ సినిమాలో లతా పాడిన పాట నేషనల్‌ అవార్డు గెల్చుకుంది. రాజశ్రీ ప్రొడక్షన్‌ లో లత పాడిన పాటలు బాలీవుడ్‌ లో ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ గా నిలిచాయి. ”మైనే ప్యార్‌ కియా, హమ్‌ ఆప్కే హై కౌన్‌” సినిమాల్లో.. లతా పాడిన పాటలను హమ్‌ చేయని సంగీతాభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. నవతరం హీరోయిన్స్‌ కు సరిపోయే గళం ఆమె సొంతం. తరాలు మారినా.. చెక్కు చెదరని ఆ స్వరానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మణిరత్నం, షారూఖ్‌, రెహ్మన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్‌ సే’ సినిమాలో ‘జియా జిలే’ పాట లతా స్వరం అందించిన సర్వ కళల్లో ఒక్కటి.
ఎన్నో అద్భుత గీతాలకు తన స్వరంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన లతా మంగేష్కర్‌ 2009లో వచ్చిన ‘జైల్‌’ సినిమాలోని ‘డాటా సున్‌ లే’ అనే పాటతో తన కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. ఆ తర్వాత అన్నీ గజల్స్‌, భక్తి పాటలే పాడిన లతా 2010 నుంచి వచ్చిన పాటల్లో సాహిత్యం బాగోలేదని, పైగా బూతు పాటలు ఎక్కువవుతున్నాయని ఎన్నోసార్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను సినిమాలకు పాటలు పాడటం ఆపేశానని పలు సందర్భాలలో పేర్కొంది.
నిర్మాతగా, దర్శకురాలిగా..
లతా మంగేష్కర్‌ గాయనిగా, నటిగానే కాకుండా సినీ నిర్మాతగా నాలుగు సినిమాలు నిర్మించింది. 1953లో మరాఠీలో ‘వాదల్‌’, 1953 లో హిందీలో ‘జహాంగీర్‌’, 1954లో ‘కాంచన్‌ గంగా’, 1990 లో ‘లేకిన్‌’ చిత్రాలను నిర్మించింది. సంగీత దర్శకురాలిగా ‘రాంరాంపహునా’, ‘మొహిత్యాంచి మంజుల’, ‘మరాఠా టిటుకమేల్‌ వాలా’, ‘స్వాథూ మాన్‌ సే’ వంటి కొన్ని చిత్రాలకు పనిచేసింది.

తెలుగులో పాడింది మూడు పాటలే
ఏడు దశాబ్దాలకు పైగా ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడిన లతా మంగేష్కర్‌ కు తెలుగు సినీ పరిశ్రమతో మాత్రం అనుబంధం తక్కువ అనే చెప్పాలి. ఎందుకో మరి లతా తెలుగులో తక్కువగానే పాటలు పాడారు. ఇంకా చెప్పాలంటే కేవలం మూడు పాటలే. అయినా, అవి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1955లో ఏఎన్నార్‌, సావిత్రి నటించిన సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో వచ్చిన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ లతా పాడిన తొలి తెలుగు పాట. ఆ పాట ఇప్పటికీ నిత్య నూతనమే. ఆమె స్వరంలో పాట వింటుంటే నిద్ర వచ్చేస్తుందంతే. అంత మనోహరంగా ఆ పాటను ఆలపించింది లతా మంగేష్కర్‌. ఆ తర్వాత 1965లో ఎన్టీఆర్‌, జమున నటించగా సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో వచ్చిన ‘దొరికితే దొంగలు’ సినిమాలో ‘శ్రీ వేంకటేశా..’ అనే పాటను పాడింది. ఇక తెలుగులో చివరి సారిగా పాడిన పాట 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ”తెల్లచీరకు” పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడింది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.
ఈ మూడు పాటలు మినహా లతా తెలుగులో మరే పాటలు పాడలేదు. ఆమెతో పాడించాలని ప్రయత్నించినా కూడా కుదర్లేదు.
జీవితాంతం ఒంటరిగానే జీవించిన లతా
లతా మంగేష్కర్‌ లైఫ్‌స్టైల్‌ చాలా భిన్నమైనది. ఆమె తోబొట్టువులయిన మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్‌లు పెళ్లి చేసుకున్నా.. లతా మాత్రం పెళ్లికి దూరంగానే ఉండిపోయి జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉంది. లతా చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని, నలుగురు తోబుట్టువుల మంచి చెడ్డలను ఆమే చూసుకుంది. కెరీర్‌ తో పాటు, కుటుంబ బాధ్యతలతో లతా కు పెళ్లి గురించి ఆలోచించే సమయమే లేక, జీవితాంతం ఒంటరిగానే జీవించింది. ఇందుకు కారణం ఏమిటని చాలామంది ఆమెను ప్రశ్నించారు. కానీ, పెళ్లిపై ఆమె ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పలేదు. అయితే, ఆమె ఒంటరిగా ఉండిపోవడానికి కారణం.. బిజీ లైఫ్‌, కుటుంబ బాధ్యతలు మాత్రమే కాదని, ఓ ప్రముఖ క్రికెటర్‌తో ప్రేమే కారణమని ఒక కథ ప్రచారంలో ఉండగా, లతా గాయనిగా ఉన్నత శిఖరాలు అందుకోవడానికి దోహదపడిన ప్రముఖ సంగీత దర్శకుడు సి.రామచంద్ర తో ప్రేమకథ అసంపూర్ణంగా మిగిలిపోయి ద్వేషంగా మారడం వల్లేనన్న మరో కథనం కూడా ఉంది. వీటితో పాటు ప్రముఖ సంగీత విద్వాంసుడు భుపేన్‌ హజారికతో సంబంధం ఉందనే వార్తలు వెలువడ్డాయి. హజారిక మాజీ భార్య ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లతాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్లపై లతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హజారిక సన్నిహితురాలు, దర్శకురాలు కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఇలా హైప్రొఫైల్‌ వ్యక్తులతో ఆమెకు ప్రేమ కథలు ఉన్నట్టు ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. అయితే, ఏరోజు కూడా ఆమె వాటి గురించి మాట్లాడలేదు. రంగుల ప్రపంచంలో ప్రేమ, పెళ్లిళ్లు, స్పర్థలు, వివాదాలు సాధారణమే. చాలా మృదువైన స్వభావం ఉన్న లతా ముక్కుసూటి మనిషి కూడా. సౌమ్యంగా ఉండే ఆమె వివాదాలకు చాలా దూరంగా ఉండేది. దీంతో, ఆ వార్తలు తర్వాత కనుమరుగయ్యాయి. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమెకు దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. మీ జీవితంలో ఉన్న ఆ లక్కీ వ్యక్తి ఎవరు? అని ఆమెను అడగ్గా… కొన్ని విషయాల గురించి కేవలం మన మనసుకు మాత్రమే తెలుసని… ఆ విషయాన్ని తనలోనే ఉంచుకోనివ్వాలని ఆమె చెప్పింది. పెళ్లి, పిల్లలు లేకుండా జీవితానికి సంపూర్ణత్వం ఉండదనే మరో ప్రశ్నకు సమాధానంగా… ప్రజలు ఎన్నో మాట్లాడుకుంటుంటారని… అలాంటి వాటిని పట్టించుకోకూడదని, వాటిని పట్టించుకుంటూ పోతే జీవితాన్ని సంతోషంగా గడపలేమని చెపుతూ, నెగెటివ్‌ ఎనర్జీలను మన దగ్గరకు రానివ్వకూడదని, తాను ఎప్పడూ ఇదే చేశానని చెప్పింది. మరో ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్‌ మాట్లాడుతూ, ‘పెళ్లి ఎందుకు చేసుకోలేదని అందరూ నన్ను అడుగుతుంటారు. దీనికి సమాధానంగా నేను ఏం చెపుతానంటే… దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పనితో నేను చాలా తృప్తిగా ఉన్నా. అందరి మాదిరిగానే నాక్కూడా కొన్ని బాధాకరమైన అనుభవాలు ఉన్నాయి. అయితే నా బాధలు తాత్కాలికమే. నేను భరించలేనిది ఏదైనా ఉందా అంటే… ఇతరులు బాధపడుతుంటే నేను చూడలేను. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం ద్వారా నేను ఆనందంగా ఉంటా’ అని చెప్పింది.
పట్టుదల, అహం, గెలవాలన్న మొండితనం లతా నైజం
లతాలో తెలిసిన మనిషి ఎంత ఉన్నదో.. తెలియని మనిషి అంతే ఉన్నది. పట్టుదల, గెలవాలన్న మొండితనం. తన సామర్థ్యం తనకు తెలుసు కనుక మిగిలిన వారు అక్కర్లేదన్నంత అహం. పొగడ్తలు ఆమెకే. విమర్శలూ ఆమెకే. లతా చిన్నా పెద్ద తగాదాలు పెట్టుకోని సంగీత దర్శకులు లేరు. సి.రామచంద్ర, ఎస్‌.డి.బర్మన్‌లను ఆమె కొన్నాళ్లు బారుకాట్‌ చేసింది. పాట పాడి రెమ్యూనరేషన్‌ తీసుకున్నాక ఇక దాని సంగతి పట్టించుకోవాల్సిన పని లేదు అని రఫీ అభిప్రాయం. కాని రికార్డులు అమ్ముడైనంత కాలం రాయల్టీ ఇవ్వాల్సిందే అని లతా వ్యాపారసూత్రం. తన మాటను పడనివ్వడం లేదని రఫీతో కొన్నాళ్లు పాడటం మానేసింది. ఆమె దగ్గర చాలా పదునైన వ్యంగ్యం ఉంది. శంకర్‌ జైకిషన్‌ లోని శంకర్‌ గాయని శారదతో పాటలు పాడించడం ఆమెకు ఇష్టం లేదు. శారద, శంకర్‌ సన్నిహితం అని ఆమెకు తెలుసు. ‘ప్రేమ గుడ్డిదని తెలుసుగాని చెవిటిదని మొదటిసారి తెలుసు కున్నాను’ అని కామెంట్‌ చేసింది. శారద అపస్వరాలను శంకర్‌ భరిస్తున్నాడు అనే అర్థంలో. తండ్రి మరణించి కుటుంబం నానా కష్టాల్లో ఉండగా చెల్లెలు ఆశా భోంస్లే తమ మేనేజర్‌ గణపత్‌ రావు భోంస్లేతో పెళ్లి పేరుతో వెళ్లి పోవడం లతా అసలు సహించలేదు. ఎన్నో ఏళ్లు ఆశాను దూరం పెట్టింది. భర్త ఇంటి నుంచి ఆశా పారిపోయి వచ్చినా కనికరించలేదు. వాళ్లిద్దరూ డ్యూయెట్స్‌ పాడాల్సి వచ్చినప్పుడు లతా, ఆశా ముఖం చూడకుండా డైరీ అడ్డు పెట్టుకుని పాడేది. క్యాబరే పాటలు చేస్తున్న నటి ‘హెలెన్‌’ తనకు లతా పాడదు కాబట్టి ఆశాను గాయనిగా నిలబెట్టింది.
ముంబైలో కొత్త గాయనీలు వీరి ప్రాభవం వల్ల ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా లతాకు భయపడి ఇండిస్టీ కొత్త గాయనిలకు అవకాశం ఇచ్చేదీ కాదు. దీంతో ఆ రోజుల్లో ”సుమన్‌ కల్యాణ్‌పూర్‌, హేమలత, వాణి జయరామ్‌” దాదాపుగా ముంబై ఖాళీ చేశారు. గాయని ‘నాజియా హసన్‌’ ”ఆప్‌ జైసా కోయి మేరే జిందగీ మే ఆయే..” పాట పాడితే ఆ ఫ్రెష్‌నెస్‌కు నాజియా దుమారానికి లతా బెంబేలెత్తిందని అంటారు. లతా ‘అనురాధా పౌడ్వాల్‌’ కు అవకాశాలు రాకుండా చూసినా, టి సిరిస్‌ ‘గుల్షన్‌ కుమార్‌’ అండతో నెగ్గుకొని వచ్చింది. లతా కొంత దారి ఇచ్చింది ”అల్కా యాగ్నిక్‌, కవితా కష్ణమూర్తి”లకే. ఇప్పటి కాలంలో ”శ్రేయ ఘోషాల్‌, సునిధి చౌహాన్‌” ఇష్టం అని ఆమె చెప్పుకుంది. లతా తన పాటలు తాను వినదు… తప్పులు కనపడతాయని. ఎప్పుడైనా తానే పాడిన మీరా భజన్స్‌ మాత్రం వింటానని చెప్పుకుంది. లతా తన ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఫ్లై ఓవర్‌ వేయడానికి ఒప్పుకోలేదు… ట్రాఫిక్‌ అంతరాయం అని. ముంబై ఖాళీ చేస్తాను అనంటే ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇంత మొండితనం ఉన్న లతా అంతే మొండితనంతో తండ్రి పేరున ‘దీనానాథ్‌ మంగేష్కర్‌ హాస్పిటల్‌ను కట్టి ప్రజలకు అప్పజెప్పింది.
రాజ్యసభ సభ్యురాలిగా..
1999లో లతా రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ అయ్యింది. కానీ ఆమె ఎక్కువ రోజులు సభకు హాజరుకాలేదు. సహ సభ్యులు ప్రణబ్‌ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారి నుండి విమర్శలు ఎదుర్కొంది. అయితే లతా తాను అనారోగ్యం కారణంగానే సభకు రాలేదని చెప్పుకునేవారు. లతా రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన కాలానికి జీతభత్యాలు తీసుకోలేదు. దిల్లీలో ప్రభుత్వ వసతిగహం సైతం తీసుకోలేదు.
అందరికంటే అధిక రెమ్యునరేషన్‌
లతా మంగేష్కర్‌ 1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500 రూపాయల పారితోషికాన్ని అందుకునే వారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న నాటి గాయనీ, గాయకులకు సైతం 150 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాకి అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్‌ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా సంపాదన. వందల కోట్లకు చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు నగరాల్లో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. లతా చనిపోయే నాటికి ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 300 కోట్లకు పైగానే ఉందని సమాచారం.
ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచిన లతా
ఎవరి పేరు చేబితే పాట సైతం పరవశించిపోతుందో.. ఎవరి గొంతులో రాగం తుళ్లిపడుతుందో.. పల్లవి పరి తపిస్తుందో.. ఆ గొంతే మూగబోయింది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 6న సంగీతానికి చీకటి దినంగా మిగిల్చి, భారతీయ సినీ నేపథ్య సంగీతానికి చిరునామాగా మారిన గాన కోకిల లతా మంగేష్కర్‌ తుది శ్వాస విడిచారు.
– పొన్నం రవిచంద్ర 9440077499

Spread the love