యాసంగికి సాగునీరందించాలి

యాసంగికి సాగునీరందించాలి– రైతులను తక్షణమే ఆదుకోవాలి : మంత్రి ఉత్తమ్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి హరీశ్‌ రావు
నవ తెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా వెంటనే సాగు నీరందించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు లేఖ రాశారు. సిద్దిపేట పట్టణంలో ఆదివారం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న యాసంగి పంటలు చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని కోరారు. గడిచిన నాలుగేండ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్టుగా అర్థమవుతుం దన్నారు. సాగునీరు లేక తమ కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కాపాడుకోలేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్‌, అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్‌లోకి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని కోరారు. రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలఫై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు తగిన పరిష్కారం చూపించకుంటే రైతులకు అండగా త్వరలోనే పోరాటాలకు సైతం సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

Spread the love