– నిబంధనలు పాటిస్తూ మొక్కలు నాటాలి
– ఆయిల్ ఫెడ్ డీఓ శబావత్ శంకర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ సీజన్ ప్రారంభమవడంతో పామాయిల్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది.మొక్కల పంపిణీకి ఆయిల్ ఫెడ్ యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో పామాయిల్ సాగు విధానం,మొక్కల సేకరణ,శాస్త్రీయ పద్ధతిలో నాటే విధానాలపై ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి శబావత్ శంకర్ వివరాలు వెల్లడించారు.
మొక్కల కోసం దరఖాస్తు:
పామాయిల్ సాగు చేయాలనుకునే రైతులు తమ భూమి పట్టా పత్రాలతో పాటు సాగు విస్తీర్ణాన్ని పేర్కొంటూ సంబంధిత ఆయిల్ ఫెడ్ డివిజన్ కార్యాలయంలో మొక్కలు, బిందు సేద్య పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పామాయిల్ పూర్తిగా నీటిపై ఆధారపడే పంట కావడంతో ఏడాది పొడవునా తగినంత నీటి వసతి ఉండాలి. దరఖాస్తు అనంతరం క్షేత్రస్థాయి సిబ్బంది భూమి స్వభావం, నీటి లభ్యత, విద్యుత్ సౌకర్యం తదితర అంశాలను పరిశీలిస్తారు. పామాయిల్ సాగుకు అనువైన భూమిగా నిర్ధారించిన తర్వాతే మొక్కల మంజూరు జరుగుతుంది.
మొక్కల నాటే దూరం:
పామాయిల్ మాత్రమే సాగు చేస్తే త్రిభుజాకార పద్ధతిలో (9×9×9 మీటర్లు) ఎకరానికి 57 మొక్కలు. అంతర పంటలతో కలిపి సాగు చేస్తే చతురస్రాకార పద్ధతిలో (9×9 మీటర్లు) ఎకరానికి 50 మొక్కలు. రైతులు ఒక్కో మొక్కకు రూ.20 చెల్లించ గా, మిగతా రూ.193ను ఉద్యాన శాఖ రాయితీ గా అందిస్తుంది.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు:
పామాయిల్ సాగుకు ఎకరానికి సంవత్సరానికి రూ.2,100, అంతర పంటల సాగుకు మరో రూ.2,100 చొప్పున మొత్తం రూ.4,200ను నాలుగు సంవత్సరాల పాటు ఉద్యాన శాఖ అందిస్తుంది. ఐదో ఏడాది నుంచి పామాయిల్ గెలలు దిగుబడి ప్రారంభమవుతుంది.
గోతుల తయారీ:
భూమిని బాగా దున్ని, చెట్లు, పొదలు తొలగించి చదును చేయాలి. 18 నెలల వయస్సు గల మొక్కలకు: 2 అడుగుల లోతు, వెడల్పుతో గోతులు. రెండేళ్లకు పైబడిన మొక్కలకు: 75 సెం.మీ. లోతు, వెడల్పుతో గోతులు తీయాలి.
మొక్కల సంరక్షణ:
నర్సరీ నుంచి వచ్చిన మొక్కలను నీడ, నీటి సౌకర్యం ఉన్న ప్రదేశంలో దించాలి.రవాణా సమయంలో మొక్కలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండటంతో మూడు రోజుల పాటు తడులు ఇవ్వాలి.
రోగగ్రస్త మొక్కలను ,మంచి మొక్కలకు ఉన్న ఎండిన ఆకులను తొలగించి: లాంబ్డా కీటక నాశిని 1.5 మి.లీ.శాప్ శిలీంద్ర నాశిని 1.5 గ్రాములు. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కలకు 5–10 లీటర్ల వరకు నీరు ఇవ్వాలి. అయితే నాటే 24 గంటల ముందు నీరు పెట్టకూడదు.
మొక్కలు నాటే విధానం:
ప్రతి గోతిలో:
1 కిలో వేప పిండి
2 కిలోల వర్మీ కంపోస్ట్
అర కిలో డీఏపీ
50 గ్రాముల చెదల నివారణ గుళికలు వేయాలి.
పాలిథిన్ కవర్ ను జాగ్రత్తగా తొలగించి, మట్టి చెదరకుండా మొక్కను గోతిలో ఉంచాలి.మొక్క అడుగు భాగం సుమారు 6 అంగుళాల లోతులో ఉండేలా నాటాలి. ఎక్కువ లోతులో నాటితే ఎదుగుదల మందగించే ప్రమాదం ఉండగా, పైపైగా నాటితే గాలులు, వర్షాలకు మొక్క ఒరిగిపోయే అవకాశం ఉంటుంది.
రక్షణ చర్యలు:
అటవీ ప్రాంతాలకు సమీపంలోని పొలాల్లో అడవి పందులు, ముళ్లపందులు, ఎలుకల నుంచి రక్షణ కోసం జాలి లేదా రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలి. మొదటి మూడు నెలలు క్రమం తప్పకుండా నీరు అందించాలి.
మొక్కల పెరుగుదలను నిరంతరం గమనిస్తూ తొలి ఏడాదిన్నర కాలంలో వచ్చే మొగ్గి కళ్ళు, కొమ్ము పురుగు వంటి తెగుళ్ల నివారణకు ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు 15 – 20 రోజుల వ్యవధిలో తగిన మందులు పిచికారీ చేయాలని శబావత్ శంకర్ సూచించారు. “ఆయిల్ ఫామ్ అన్యదేశ పంట. మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులు పాటిస్తేనే మంచి దిగుబడులు సాధించవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.



