మీ విచారణలో నిష్పాక్షికత లేదు

మీ విచారణలో నిష్పాక్షికత లేదు– ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన వారందరినీ విచారించండి
– అప్పుడే సమగ్ర దర్యాప్తు జరిపినట్టు…
– కరెంటు కొనుగోళ్లు, ప్రాజెక్టుల విషయంలో మేం ఎలాంటి తప్పులు చేయలేదు :జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”మా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో మీరు ఏకీభవిస్తున్నట్టు మీ మాటల్లో స్పష్టమైంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు” ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణంపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్‌కు మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి రాసిన లేఖలోని సారాంశం ఇది. విచారణ పూర్తికాకముందే విలేకరుల సమావేశం నిర్వహించడం సంప్రదాయాలకు విరుద్ధం అంటూ ఆ లేఖలో కమిషన్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వచ్చిన అంశాలకు వివరణ ఇవ్వాలని రెండోసారి కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి ఆయన శనివారం 8 పేజీల సుదీర్ఘ వివరణను కమిషన్‌కు పంపారు. గతంలో కేసీఆర్‌ కమిషన్‌కు రాసిన అంశాలు, అభ్యంతరాలనే మాజీ మంత్రి కూడా లేఖలో ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిందనీ, విచారణ కమిషన్‌ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో పాటు అక్కడి అధికారుల్ని కూడా విచారించాలని లేఖలో కోరారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర సంస్థల ఉన్నతాధికారుల్ని కూడా విచారణ జరపాలనీ, అప్పుడు సమగ్ర విచారణ జరిగనట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏదో నష్టంజరిగిపోయింది… ఇక లెక్కగట్టడమే తరువాయి అన్నట్టు ఉన్న కమిషన్‌ వ్యాఖ్యలతో పత్రికల్లో రూ.6 వేల కోట్ల నష్టం అంటూ వార్తలు రావడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర విభజన, ఆనాటి విద్యుత్‌రంగ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్‌తో కరెంటు పంచాయతీ, కరెంటు కోతలు, రైతుల ఇక్కట్లు, పారిశ్రామికవేత్తల అవస్థలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నామని ఆ లేఖలో వివరణ ఇచ్చారు. తామెక్కడా ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి తప్పులు చేయలేదనీ, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేశామన్నారు. కమిషన్‌ ఎదుట ఇప్పుడు ఎవరైతే అభ్యంతరాలు లేవనెత్తారో…వారంతా విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు కూడా ఇవే అభ్యంతరాలు లేవనెత్తారనీ, అసెంబ్లీలోనూ ఇవే అంశాలను ప్రస్తావిస్తే, వాటికి అక్కడే పూర్తిస్థాయి వివరణలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఇదే తరహాలో మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా కమిషన్‌ రెండోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు సోమవారం వెల్లడికానుంది.

Spread the love