నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యాంగ పరిరక్షణ కోసం యువత భాగస్వామ్యం అత్యంత అవసరమని డా. శిర్గమళ్ళ కిషోర్ అన్నారు. హబ్సిగూడ స్ట్రీట్ నం.1లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాలర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సీతాఫల్మండి హిస్టరీ లెక్చరర్ డా. శిర్గమళ్ళ కిషోర్ హాజరై మాట్లాడారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలను కల్పించే మహత్తర గ్రంథమని అన్నారు. ఈ విలువలను కాపాడటంలో యువత ముందుండి సమాజానికి దారితీయాలని, ప్రజాస్వామ్యాన్ని బలపర్చే బాధ్యతను స్వీకరించాలని ఆయన సూచించారు.
సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపన కోసం యువత చైతన్యంతో కృషి చేయాలని డా.యాదవల్లి సైదులు కోరారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా యువత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చి. లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మధు, బి. యాదగిరి, నాని తదితరులు పాల్గొన్నారు.




