Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధించినప్పుడే అంబేడ్కర్ కు నిజమైన నివాళి

సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధించినప్పుడే అంబేడ్కర్ కు నిజమైన నివాళి

- Advertisement -

– ఎంఏ ఇక్బాల్, సీపీఐ (ఎం) జిల్లా నాయకులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధించినప్పుడే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆలేరు బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితంలో ఎన్నో అవమానాలు, అణచివేతలను ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా సమాజం కోసం పోరాడారని తెలిపారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.ప్రజలను మళ్లీ బానిసత్వ దిశగా నడిపించే విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో సామాజిక న్యాయం,సమానత్వం నిలబెట్టాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. కుల, మత భేదాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా నిలిచి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దళితులు,బీసీలు,మైనార్టీలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మతతత్వ శక్తులను ఖండించారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని,విభజన వాద శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలంటే సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు వడ్డేమాన్ బాలరాజు, తాళ్లపల్లి గణేష్, బొప్పిడి యాదగిరి, గణగాని మల్లేష్, కాసుల నరేష్, ఎండి మతిన్, ఎండి ఖలీల్, ఎండి అఖిల్, మద్దెల కుమార్యా, యాసారపు ప్రసాద్, ఘణగాని రాజు, బర్ల సిద్ధులు,రాచర్ల సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -