యువత తాత్కాలిక సంతోషాలకు వెళ్లి డ్రగ్స్‌కు బానిస కావొద్దు: భట్టి

నవతెలంగాణ – హైదరాబాద్: అక్రమ సంపాదన కోసం కొంతమంది కావాలనే పిల్లలకు, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. యువత తాత్కాలిక సంతోషాల కోసం వెళ్లి డ్రగ్స్‌కు బానిస కావొద్దని సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… డ్రగ్స్ రవాణా, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మాదకద్రవ్యాలను నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని… ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధమన్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై, వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సంఘ విద్రోహ శక్తుల చేతిలో యువత జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి కాపాడుకునే బాధ్యత మనపై ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు బడ్జెట్ ఎంతైనా ఇస్తామన్నారు. అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు వేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.

Spread the love