అపాచీ, ఎం777 హోవిట్జర్ల నిర్వహణకు ఆమోదం
దీర్ఘకాలిక నిర్వహణ సేవలు అందించనున్న అమెరికా
మొత్తం 482.2 మిలియన్ డాలర్ల విలువైన సహాయ
ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్‌కు అధికారిక సమాచారం
న్యూఢిల్లీ : భారత్‌కు రక్షణ రంగంలో మరో కీలక సహకారాన్ని అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. భారత సైన్యం వినియోగిస్తున్న అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్లకు అవసరమైన నిర్వహణ, సాంకేతిక సహాయం, విడిభాగాల సరఫరా, శిక్షణ సేవలను అందించనుంది. అందుకోసం మొత్తం 482.2 మిలియన్ డాలర్ల విలువైన సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌కు అధికారిక సమాచారాన్ని అందించింది.
అమెరికా విదేశీ సైనిక విక్రయాల (ఎఫ్‌ఎంఎస్) కార్యక్రమాన్ని నిర్వహించే డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) జూన్ 17న ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల మే 18నే అమెరికా విదేశాంగ శాఖ భారతదేశానికి ఈ సేవలను అందించేందుకు కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో భారత్ అమ్ములపొదిలోని కీలక ఆయుధాల నిర్వహణ, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతిక సాయం వంటి వాటికి ఇబ్బంది ఉండదు.
ఎం777 హోవిట్జర్లకు 230 మిలియన్ డాలర్ల మద్దతు
ప్రస్తుతం భారత సైన్యం ఎం777ఏ2 అల్ట్రా- లైట్ హోవిట్జర్లను విస్తృతంగా వినియోగిస్తోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో వేగంగా మోహరించగల సామర్థ్యం ఉండటం వల్ల ఇవి వ్యూహాత్మకంగా కీలకంగా మారాయి. ఈ హోవిట్జర్లకు సంబంధించిన నిర్వహణ, విడిభాగాల, సరఫరా, మరమ్మతులు, సాంకేతిక సాయం, శిక్షణ, ఫీల్డ్ సర్వీస్ ప్రతినిధుల సేవలు, లాజిస్టిక్స్ మద్దతు వంటివి అందిచనుంది. వాటి కోసం సుమారు 230 మిలియన్ డాలర్ల విలువైన సహాయ ప్యాకేజీని అమెరికా ప్రతిపాదించింది. ఈ కార్యక్రమానికి బ్రిటన్లోని కుంబ్రియాలో ఉన్న బీఏఈ సిస్టమ్స్ ప్రధాన కాంట్రాక్టర్గా వ్యవహరించనుంది.
అపాచీ హెలికాప్టర్లకు 198.2 మిలియన్ డాలర్లు
ప్రస్తుతం భారత్ సైన్యం, వైమానిక దళం ఏహెచ్-64ఈ అపాటీ హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. ఇవి ప్రపంచంలోని అత్యాధునిక దాడి హెలికాప్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. లక్ష్యాలను కచ్చితంగా ధ్వంసం చేయడం, యుద్ధభూమిలో సైన్యానికి మద్దతు అందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఈ హెలికాప్టర్లకు అవసరమైన దీర్ఘకాలిక నిర్వహణ, ఇంజినీరింగ్ సేవలు, సాంకేతిక సాయం, లాజిస్టిక్స్ మద్దతు, సిబ్బందికి శిక్షణ, సాంకేతిక ప్రతాలు వంటి సేవల కోసం 198.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీని అమెరికా ప్రతిపాదించింది. ఈ ఒప్పందంలో అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్లుగా వ్యవహరించనున్నాయి.
భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం
ఈ ప్రతిపాదిత ఒప్పందం ద్వారా భారత్తో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇండో- పసిఫిక్ ప్రాంతం, దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక అభివృద్ధికి భారత్ కీలక భాగస్వామిగా కొనసాగుతోందని అమెరికా అభిప్రాయపడింది. భారత్ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఈ సహాయ ప్యాకేజీ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా తెలిపింది. ప్రస్తుతం, భవిష్యత్లో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదిత సేవలు ప్రాంతీయ సైనిక సమతుల్యతను మార్చవని అమెరికా స్పష్టం చేసింది. అలాగే అమెరికా రక్షణ సన్నద్ధతపై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. భారత సాయుధ దళాలు ఈ సేవలు, పరికరాలను సమర్థంగా వినియోగించగలవని అమెరికా విశ్వాసం వ్యక్తం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్-అమెరికా రక్షణ సంబంధాలు వేగంగా విస్తరించాయి. అధునాతన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఫిరంగులు, సముద్ర భద్రతా వ్యవస్థల కొనుగోళ్లతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త విన్యాసాలు, సమాచార భాగస్వామ్యంలోనూ ఇరు దేశాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయి.
భారత్‌కు అమెరికా మరో రక్షణ సహకారం
- Advertisement -
- Advertisement -



