ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

నవతెలంగాణ-సిటీబ్యూరో
బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌తో అబద్దాలు చదివించారనీ, ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. గవర్నర్‌ ఆ ప్రసంగం చదవకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్తు ఎక్కడ వస్తుందో చూపించాలని డిమాండ్‌ చేశారు. అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో సంబంధిత డిపార్ట్‌మెంటుకు కూడా తెలియదన్నారు. దేశంలో పంటల బీమా పథకం అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అనీ, పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుండా చచ్చిపోతే బీమా ఇస్తా మంటున్నారనీ అన్నారు. రైతు కూలీలకూ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. దళితబంధు నెపంతో దళితులను మోసం చేస్తున్నారన్నారు. దళితుల సంక్షేమం కోసం వెచ్చించకుండా రూ.30 వేల కోట్లు మూలుగుతున్నాయని, వాటిని క్యారీ ఫార్వర్డ్‌ చేస్తున్నారని చెప్పారు. గవర్నర్‌ ప్రసంగంలో అసలు డబుల్‌ బెడ్‌ రూంల ప్రస్తావనే లేదన్నారు. గిరిజనుల రిజర్వేషన్‌ పెంపుపై ఇప్పటికైనా జ్ఞానం రావడం సంతోషమన్నారు. ఈ నాలుగేండ్లలో వారు కోల్పోయిన ఉద్యోగాలకు సూపర్‌ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసి వారికి జరిగిన నష్టం పూరించాలన్నారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ఒక్క యాక్షన్‌ ప్లాన్‌ కూడా లేదన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఏమైందని ప్రశ్నించారు.
సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలి : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
మియాపూర్‌ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో లైన్‌ను విస్తరించాలని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అడుగుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. యాదాద్రి వరకూ మెట్రో ట్రైన్‌ ఏర్పాటు గురించి అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తానని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఉన్న అర్హులైన పేదలకు ఉచితంగా ఇండ్లు, స్థలాలు ఇచ్చే జీవోను ఈ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. పేదలకు 100 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చే జీవోను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్‌ చేస్తానన్నారు. వీఆర్‌ఏ, అంగన్‌వాడీ, ఐకేపీల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు నిధుల్లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనాథ పిల్లలకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పినా.. ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలోని ఆర్‌ఎంపీలకు గుర్తింపు కార్డులు, శిక్షణ ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. రెండు నెలల యుద్ధం తర్వాత తప్పని పరిస్థితుల్లో గవర్నర్‌, ముఖ్యమంత్రి రాజీ పడ్డారనీ, బీఆర్‌ఎస్‌, బీజేపీకి, గవర్నర్‌ బీ టీమ్‌గా మారిపోయారని విమర్శించారు. ఇది ఎన్నికల ఏడాది అని, అసెంబ్లీలో మాట్లాడటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు.

Spread the love