ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు..

– కారెక్కేందుక  ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెడీ
– వ్యతిరేకిస్తున్న చింతా ప్రభాకర్‌
– నచ్చజెపుతున్న మంత్రి హరీశ్‌
– హస్తం గూటికి రేఖానాయక్‌ రేవంత్‌తో చర్చలు
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో సిట్టింగుల విచిత్ర పరిస్థితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పలు పార్టీల్లో జంప్‌ జిలానీలు ఎక్కువవుతున్నారు. ప్రస్తుతమున్న పార్టీలో సీటు దక్కితే ఓకే.. లేదంటే తమ దారి తాము చూసుకునేందుకు వారు సిద్ధమవుతున్నారు. దాంతోపాటు ఈసారి గెలుపోటములు, ఎన్నికల్లో ఖర్చు, ఆర్థిక అవసరాల రీత్యా కూడా ఎటు వీలైతే అటు గోడ దూకేందుకు రెడీ అయిపోతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను సైతం ఈ సమస్య ఇరకాటంలో పడేస్తోంది. తాజాగా హస్తం పార్టీలో ముఖ్యుడు, సీనియర్‌ ఎమ్మెల్యే అయిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి)… సొంత పార్టీని వీడి కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ఆయన శనివారమే గులాబీ తీర్థం పుచ్చుకోవాల్సి ఉంది. కానీ వర్షాల నేపథ్యంలో మెదక్‌లో సీఎం సభ రద్దు కావటంతో ఆయన చేరిక కాస్త ఆలస్యమవుతోంది. 23న కేసీఆర్‌ మెదక్‌ పర్యటన సమయంలో ఆయన సమక్షంలో జగ్గారెడ్డి పార్టీ మారతారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. తనకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల నేపథ్యంలోనే ఆయన అధికార పార్టీలోకి వెళుతున్నారని సమాచారం. ‘మీ పార్టీలోకి వస్తా.. నా అప్పులన్నీ తీర్చి.. నన్ను ఒడ్డున పడేయండి…’ అంటూ జగ్గన్న గతంలోనే సీఎంకు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. ఇందుకు గులాబీ అధినేత కూడా అంగీకరించినట్టు సమాచారం. కానీ సంగారెడ్డికే చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చింతా ప్రభాకర్‌ (ప్రస్తుతం టెస్కో చైర్మెన్‌గా ఉన్నారు) జగ్గారెడ్డి చేరికను అంగీకరించటం లేదు. వాస్తవానికి అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ప్రభాకర్‌కే దక్కే అవకాశాలున్నాయి. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి చేరితే తన సీటుకు ఎసరొస్తుందనే భయంతోనే ఆయన ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌… ఆయన్ను బుజ్జగించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఈ క్రమంలో ప్రగతి భవన్‌ పక్కనున్న టూరిజం ప్లాజాలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా హరీశ్‌రావు…ప్రభాకర్‌తో చర్చలు జరిపారు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తామంటూ మంత్రి ఈ సందర్భంగా ప్రభాకర్‌కు హామీనిచ్చినట్టు తెలిసింది. మరోవైపు బీఆర్‌ఎస్‌లో జగ్గారెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ సంగారెడ్డిలో ప్రభాకర్‌ వర్గానికి చెందిన వారు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో.. మంత్రి హరీశ్‌రావు మరోసారి ప్రభాకర్‌తో చర్చించనున్నారు. ఆయన్ను శాంతపరిచిన తర్వాతే జగ్గారెడ్డి కారెక్కేందుకు ముహూర్తం ఖరారవుతుందని ఓ సీనియర్‌ నేత చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో అధికార పార్టీకి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌… త్వరలో హస్తం గూటికి చేరబోతున్నారు. కేసీఆర్‌ నిర్వహించిన సర్వేల్లో ఆమె ఈసారి గెలిచే అవకాశాల్లేవని తేలింది. అందువల్ల రేఖా నాయక్‌కు కాకుండా మరొకరికి టిక్కెట్‌ ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి… రేఖా నాయక్‌ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన భర్త శ్యామ్‌ నాయక్‌తో కలిసి ఆమె ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌తో భేటీ అయినట్టు తెలిసింది. ఈ క్రమంలో తనకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే లేదా ఆదిలాబాద్‌ ఎంపీ సీటును కేటాయించాలని రేవంత్‌ను కోరారు. ఈ విషయమై ఏఐసీసీతో సంప్రదించి, నిర్ణయం చెబుతానంటూ పీసీసీ చీఫ్‌ వారికి హామీనిచ్చినట్టు తెలిసింది.

Spread the love