ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

నవతెలంగాణ – ఢిల్లీ
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘంలో నియామకాలను ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజార్టీతో ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.
సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.ఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతమున్న వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు  తెలిపింది. వీరి నియామకాల కోసం పార్లమెంట్‌ కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ సీఈసీల తొలగింపు వలే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Spread the love