కళ మానసిక ఆనందాన్నిస్తుంది

అభిరుచి వుంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు. ఇంటి గుమ్మంలో ఆహ్వానిస్తూ నిలువెత్తు బొజ్జ గణపయ్య. ఇల్లంతా రకరకాల కళాత్మకమైన బొమ్మలు. అందంగా తీర్చి దిద్దిన ఇల్లు. నవ్వుతూ ఆహ్వానించే మోము. ఆమె పాలపర్తి శ్యామలా శర్మ.
అవకాశం దొరికితే చాలు మనసులోని ఆలోచనలకు రూపం కల్పిస్తారు. ఆసక్తి, శ్రద్ధ వుంటే చాలు, చిన్ననాటి అభిరుచులు సాకారం రూపు దాల్చుతాయి. శ్యామల చదువుకునే రోజుల్లోనే డ్రాయింగ్‌ కళ పట్ల ఆకర్షితురాలై అటువేపు అడుగులు వేశారు. పుట్టింది గుంటూరు. తల్లి తాడేపల్లి శకుంతల, తండ్రి నరసింహ మూర్తి. శ్యామల చదువంతా గుంటూరులోనే సాగింది. బి.ఎ. గుంటూరు ఉమెన్స్‌ కాలేజీలో చదివారు. ఫైన్‌ ఆర్ట్స్‌ అంటే ఎంతో ఆసక్తి వున్న వీరు చదువుకునే రోజుల్లోనే బొమ్మలు వేయటం మొదలు పెట్టారు.
డ్రాయింగ్‌లో తర్ఫీదు
ఎం.ఏ. చదువుతుండగా ఇంజనీరైన పాలపర్తి శివరామ కృష్ణతో వివాహం జరిగింది. అనంతరం భర్త ఉద్యోగ రీత్యా ముంబాయి, మస్కట్‌, అబూదాబీ నగరాల్లో వున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి వందన కలకత్తాలోనూ, అబ్బాయి వరుణ్‌ యు.ఎస్‌. లోనూ స్థిరపడ్డారు. మరి ఈ ఆర్ట్‌ కోసం ఎక్కడైనా తర్ఫీదు పొందారా అని అడిగినపుడు ”మా బాబు చదువు కోసం నేను కొన్నాళ్ళు హైదరాబాదులో ఉన్నాను. అప్పుడు ఒక నెల రోజులు డ్రాయింగ్‌లో తర్ఫీదు పొంది మరిన్ని మెళుకువలు నేర్చుకున్నాను. ఖాళీ సమయంలో పెయింటింగ్‌ చేస్తూ ఉంటాను. ఎన్నో చిత్రాలు గీసి ఎందరికో బహుమతిగా కూడా ఇచ్చాను” అని అన్నారు.
అందంగా మలచొచ్చు
ఫైన్‌ ఆర్ట్స్‌లో ఎన్నో వున్నాయి. అంటే సంగీతం, నృత్యం ఇలా ఎన్నో కళలు. మీకు చిత్రాలు గీయాలని ఎందుకు అనిపించింది అని అడిగితె… ”నాకు చిన్నప్పటి నుంచీ వున్న ఆసక్తి అంతే! ఎప్పుడూ బొమ్మలు వేస్తుండేదాన్ని. అసలు పెయింటింగ్‌ వేయాలంటేనే చాలా రకాలు వున్నాయి. వాటర్‌ కలర్స్‌ నుంచి ఆయిల్‌ పెయింట్స్‌, కాన్వాస్‌ పెయింటింగ్స్‌, గ్లాస్‌ పెయింటింగ్స్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్స్‌ ఇలా ఎన్నో రకాలుంటాయి. చిత్రించే మనసుండాలి కానీ దేన్నయినా అందంగా మలచవచ్చు. నా మనసుకి నచ్చిన ఆలోచనలు బొమ్మలుగా రూపుదిద్దుకునేవి” అంటారు ఆమె.
ఆయిల్‌ పెయింట్స్‌ ఇష్టం
ఆమె గీసిన చిత్రాల వివరాలు గురించి అడిగితే ”పల్లె పడుచు చిత్రం, వినాయకుని చిత్రం కానీ దాదాపు అన్నింటినీ మా పెండ్లి అయ్యాక గీసినవే. ఇందుకు మా వారి ప్రోత్సాహం ఎంతో వుంది. ఇందులో ఉన్న అమ్మాయి బొమ్మని చెక్క మీద ఆయిల్‌ పెయింట్స్‌తో గీసాను. గ్రాస్‌ లిల్లీస్‌గా పిలుచుకునే ఈ పూలు సిల్క్‌ బట్ట మీద వేసాను. వినాయకుడు కాన్వాస్‌ మీద ఆయిల్‌ పెయింట్స్‌తో గీశాను. కాన్వాస్‌ మీద కాకుండా చీరలు, సిల్క్‌ క్లాత్‌ మీద బొమ్మలు వేస్తుండే దాన్ని. ఇవిగో ఈ బొమ్మలు అలా వేసినవే! అన్నిటిలోకి కాన్వాస్‌ మీద ఆయిల్‌ పెయింట్స్‌ వేయటం ఇష్టం. నేను ఇప్పుడు చెప్పిన అన్ని ప్రక్రియల్లోనూ వేసాను” అని సమాధానం చెప్పారు.
చీరలపై పెయింటింగ్‌
మీకు బొమ్మలు వేయటమేనా ఇంకేమైనా అభిరుచులు వున్నాయా అని అడిగితే ”చదువుకునే రోజుల్లోనే ఎన్నో బట్టల మీద రక రకాల ఎంబ్రాయిడరీ డిజైన్‌లు కుట్టేదాన్ని. అవన్నీ కూడా అందరి మెప్పూ పొందాయి. చాలా మందికి అవి బహుమతిగా కూడా కుట్టి ఇచ్చేదాన్ని. ఎంబ్రాయిడరీ వర్క్‌ సారీస్‌ అప్పట్లో ఫ్యాషన్‌. ఎంతో ఆసక్తితో చాలా చీరలపై కుట్టాను. వాటిల్ని అనాధ పిల్లలకి ఇచ్చేశాను. పెయింటింగ్‌పై ఆసక్తి పెరిగి చీరల మీద పెయింటింగ్‌ వేయటం మొదలు పెట్టాను. మచ్చుక్కి ఒకటి రెండు నా వద్ద వున్నాయి. ఇదిగో నాట్యం చేసే ఆమ్మాయిల బొమ్మలు చీర మీద వేసిన డిజైన్‌” అంటూ ఆ చీరని చూపించారు.
అవుట్‌ డోర్‌ ఆటలంటే ఆసక్తి
వీరు తన ఇంటిని ఎప్పుడూ అందంగా తీర్చి దిద్దుతారు. వంట చేయటమంటే తనకి ఇష్టమని. ఎన్నో వంటల పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నానని అంటారు. గత జ్ఞాపకాలు తలుచుకుంటూ.. ఇతర వ్యాపాకాల గురించి వివరిస్తూ ”చిన్నప్పటి నుంచి అవుట్‌ డోర్‌ ఆటలంటే ఆసక్తి. వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడేదాన్ని. బోల్డు సర్టిఫికెట్స్‌ కూడా వచ్చాయి. చాలా యాక్టివ్‌గా వుండేదాన్ని ఆరోజుల్లో. బడి చదువుతో పాటు హిందీ విశారద చదివాను. అంతే కాదు స్కూల్లో చదివేటప్పుడు నాటకాలు కూడా వేశాను. పల్నాటి వీర గాధలు వంటి నాటకాలు వేసేవాళ్ళం. బాగుండేవి ఆప్పటి రోజులు తలుచు కుంటుంటే!”.
ఆక్టివిటీ క్రియేట్‌ చేసుకోవాలి
ప్రస్తుత సమాజంలో కళలకున్న ప్రాధాన్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే ”ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆక్టివిటీ క్రియేట్‌ చేసుకోవాలి. ఈ పెయింటింగ్‌ ఆర్ట్స్‌ అయితే మానసిక ఆనందం ఇస్తుంది. ఎవరైనా సరే డిప్రెషన్‌లో వున్నపుడు, సమస్యలున్నపుడు, ఖాళీసమయాల్లో ఇటువంటి కళలపై దృష్టి పెడితే మనసు ప్రశాంతంగా వుంటుంది. ఈ కాలం యువత చదువుతో పాటు ఏదైనా మనసుకు నచ్చిన సంగీతమో, నృత్యమో, ఇలా ఫైన్‌ ఆర్ట్స్‌ వంటివి నేర్చుకుంటే మానసిక ఆనందం లభిస్తుంది. ఇంతకన్నా ఏమీ చెప్పలేను” అన్నారు.
అందంగా కొలువు తీరాయి
ఎప్పుడూ చిరునవ్వుతో గల గలా మాట్లాడుతూ, అందరూ ఆత్మీయులే అనుకుంటూ అందరితో స్నేహభావంతో ఉంటారు శ్యామల. భర్త పదవీ విరమణ అనంతరం హైదరాబాదులోని కొండాపూర్‌లో నివాస ముంటూ విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫైన్‌ ఆర్ట్స్‌లో చక్కటి కళాత్మక చిత్రాలు ఎంతో అందంగా వారి ఇంట్లో కొలువు తీరాయి. ఇది గృహిణిగా వుంటూ చేతి వేళ్ళు అలవోకగా వంపులు తిప్పుతూ, కుంచెలతో రంగులు అద్దుతూ, కాన్వాస్‌పై మంచి చిత్రాలు రూపుదిద్దుకున్న శ్యామల అంతరంగం.

–  మణి నాథ్‌ కోపల్లె,
9703044410

Spread the love