తాజా పరిమళం కోసం…

ఇంటిలోని ప్రతి గదిని తాజాగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇన్‌ఫెక్షన్‌లు పెరిగి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సువాసన కోసం మార్కెట్‌లో అనేక రకాల ఫ్రెషనర్స్‌ అందుబాటులో ఉంటాయి. కానీ మనం ఇంట్లోని వస్తువులతోనే తాజా పరిమళం వెదజల్లేలా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం…

– నేలను తుడుస్తున్నప్పుడు నీటిలో రెండు చుక్కలు నిమ్మగడ్డి నూనె వేయండి. ఈగలూ, దోమలూ వంటివి ముసరవు. చక్కని సువాసనా వస్తుంది. లేదంటే పావువంతు నీళ్లల్లో రెండు చెంచాల నిమ్మగడ్డి నూనె కలిపి మరిగించండి. చక్కని ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి సాంబ్రాణి పొగగా వేస్తే సరి. గదంతా పరిమళాలు వ్యాపిస్తాయి.
– అద్దాలూ, కిటికీలూ, ఇతర గాజు వస్తువులపై మురికి పేరుకుని, మరకలు పడ్డాయా.. వాడేసిన టీపొడినే మళ్లీ నీళ్లల్లో వేసి.. తీసుకోవాలి. దీన్ని వాటిపై చల్లి.. మెత్తని వస్త్రంతో తుడిస్తే.. మురికీ, మరకలు పోయి.. కొత్తవాటిలా మారతాయి. చామంతి రేకల్ని దానిలో వేసి గది మధ్యలో ఉంచండి. చక్కని సువాసనలతో పాటు కంటికింపుగానూ కనిపిస్తాయి.
– కమలాఫలం తొక్కల్ని సేకరించండి. వాటితోపాటూ దాల్చిన చెక్క ముక్కలూ, బిర్యానీ ఆకులూ కొన్ని తీసుకుని పూలదండలా తయారుచేసి గదిలో ఎక్కడయినా వేలాడదీసి చూడండి. ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
– ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.
– ఒక గాజు పాత్రలో నిమ్మ నూనెలో ముంచిన దూదిని ఉంచి దాన్ని స్నానాల గదిలో పెట్టండి. దుర్వాసన పోయి అక్కడ సువాసన వస్తుంది.
– పుల్లటి వాసనలకి ఎంతటి దుర్వాసనైనా తొలగించే శక్తి ఉంటుంది. అందుకే రెండు నిమ్మచెక్కల్ని నీళ్లల్లో పిండి గదిలో స్ప్రే చేయండి. అలానే నారింజ తొక్కలను నీటిలో వేసి ఉడికించినా సరే! సువాసనలు గదంతా వ్యాపిస్తాయి.
– ఇక తాజా పూల పరిమళాల సంగతి సరేసరి! చామంతి, మల్లెలను గదిలో వేలాడదీయండి. ఇవి చక్కటి సువాసనను మనసుకి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఓ రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో తాజా గులాబీలు ఉంచండి, చక్కటి సువాసనను ఆస్వాదించండి
– వెడల్పాటి గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని నాలుగైదు యాపిల్‌ ముక్కలూ, రెండు దాల్చిన చెక్క ముక్కలూ, నాలుగు లవంగాలు వేసి పొయ్యి మీద పెట్టండి. నీళ్లు కాస్త వేడయితే చాలు.. ఆ పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది.

Spread the love