కోమట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

–   ఇటుకుల పహాడ్‌లో ఇరు పార్టీల కార్యకర్తల తోపులాట
–   చెప్పులు, కర్రలు విసురుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు
నవతెలంగాణ -నకిరేకల్‌
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో గురువారం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగి ఎంపీ కోమటిరెడ్డి పర్యటన ఉద్రిక్తంగా మారింది. గురువారం శాలిగౌరారం మండలంలోని ఇటుకుల పహాడ్‌లో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో సీసీ రోడ్డు సక్రమంగా లేవని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అనడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఒక్కసారిగా మైకు కనెక్షన్లను ఊడదీసి తోపులాటకు దిగారు. ఆలయ ప్రాంగణంలోకి చెప్పులు విసిరేశారు. దాంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. కర్రలు, చెప్పులు విసురుకున్నారు. వెంటనే పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను వారించి ఎంపీ కోమటిరెడ్డిని అక్కడినుంచి పంపించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

Spread the love