పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలివ్వాలి

–  దరఖాస్తులను పున: పరిశీలించాలి
–  20న హైదరాబాద్‌లో ధర్నా: ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలివ్వాలి. గిరిజనుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను తిరిగి పరిశీలించాల’ని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని మార్స్క్‌ భవన్‌లో సమన్వయ కమిటీ కన్వీనర్లు వేముల పల్లి వెంట్రామయ్య, కెచ్చెల రంగయ్య, అంజయ్య నాయక్‌ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసే, అటవీ హక్కులను కాలరాసే ‘అటవీ సంరక్షణ నియమాలు- 2022’ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.. ఆ నియమాలను ఉపసంహరించాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొంటాయన్నారని తెలిపారు.. ఆదివాసులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములన్నింటికీ, ఈ నెల చివరినాటికి (11.5 లక్షల ఎకరాలకు) హక్కుపత్రాలు యిస్తామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేయటాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే గతంలో కూడా అనేకసార్లు ఈ విధంగా వాగ్దానాలు చేసి అమలు చేయలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రచారానికే పరిమితం కాకుండా హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అడవి బిడ్డలను ఆక్రమణదారులుగా పేర్కొనడం తగదని తెలిపారు. పోడు భూమిపై ఆదివాసులకు హక్కులేదని మాట్లాడటం సరికాదన్నారు. అటవీ హక్కుల చట్టం, 2006 ద్వారా 13.12.2005 వరకు పోడు భూములపై ఆదివాసులకు చట్టబద్ధ హక్కు లభించిందని గుర్తుచేశారు. గిరిజనుల హక్కుల్ని గుర్తించి, వారికి పట్టాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. చాలా చోట్ల ఆదివాసుల అర్జీలను తిరస్కరించారని తెలిపారు. కొన్ని చోట్ల సర్వేలు కూడా చేయలేదన్నారు. మరి కొన్ని చోట్ల అటవీ హక్కుల చట్టంలో లేని విధంగా, మంజూరు చేసిన అర్జీదారులకు సంబంధించిన (2005కు ముందు) ఆధార్‌ కార్డు చూపాలంటూ విషను షరతులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టంలో లేని సాక్ష్యాధారం – ఉపగ్రహఛాయా చిత్రాల పేరిట అనేక దరఖాస్తులు తిరస్కరించారని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా మైనర్లనీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉందనే పేరుతో అర్జీలను తిరస్కరించారనీ, గిరిజనేతరుల దరఖాస్తులన్నింటినీ చట్ట వ్యతిరేకంగా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో సమన్వయ కమిటీ నాయకులు మండల వెంకన్న, ప్రసాదన్న, మామిడాల భిక్షపతి, వి ప్రభాకర్‌, జక్కుల వెంకటయ్య కూడా మాట్లాడారు.

Spread the love