పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ ధర్నాలు..

నవతెలంగాణ – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. కరీంనగర్‌ పట్టణం తెలంగాణ చౌక్ లో రోడ్లపైనే కట్టెల పొయ్యిలపై వంట వార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్ సునీల్ రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదే క్రమంలో  పెంచిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాలుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉన్నాయని అన్నారు. ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.  మహబూబాబాద్ పట్టణం నెహ్రూ సెంటర్ లో ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటవార్పు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలోని త్రిపురారం మండల కేంద్రంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ట్రైకర్ చైర్మన్ ఇస్లాత్ రామచంద్రనాయక్, మహిళలు పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ కేంద్రమైన సంగారెడ్డిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన తెలిపారు. టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Spread the love