బీజేపీ, కాంగ్రెస్‌ విధానాల వల్లే దేశంలో ఈ దుస్థితి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగానే దేశం ఈ దుస్థితిలో ఉందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. గత యూపీఏ కన్నా ప్రస్తుత ఎన్డీఏ పాలనలో దేశం అనేక రంగాల్లో మరింత వెనుకబడిందని గణంకాలతో వివరించారు. ఆదివారం శాసనసమండలిలో మంత్రి ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్‌ కార్పొరేట్లకు అప్పగించిందని విమర్శించారు., రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఒక రకంగా లంచం ఎరగా చూపిస్తున్నదని తెలిపారు. ప్రజల ధనం రూ.10 లక్షల కోట్లు రాత్రికి రాత్రే ఆవిరైతే కేంద్రం ప్రజలకు భరోసా కల్పించలేదనీ, ప్రధానమంత్రి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి విశ్వాసం సన్నగిల్లకుండా చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రూ.30 వేల కోట్లను బహుమానంగా రాష్ట్రానికి ఇస్తామన్నప్పటికీ ప్రజా, రైతు వ్యతిరేక విద్యుత్‌ సంస్కరణలను అమలు చేసేది లేదని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు రాజకీయాల కన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవడమే ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ద్వారా ప్రజలు గెలిచారన్నారు. జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించిన నిధుల కన్నా ఎక్కువ ఖర్చు చేశామని తెలిపారు.
మీ పార్టీ వారికి చెప్పండి…
ప్రగతిభవన్‌ పేలుస్తామనీ, సచివాలయం కూలుస్తామంటూ మాట్లాడే నాయకుల పార్టీలకు ఇప్పుడున్న ఓట్లు కూడా రావని మంత్రి హరీశ్‌ రావు హెచ్చరించారు. కాంగ్రెస్‌ సభ్యులు జీవన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, ” మీరు నిర్మాణాలను కోరుకుంటున్నారు. మీ పార్టీలో ఉన్న వారు కూలుస్తామంటున్నారు. అలా మాట్లాడే వారితో మీరు విబేధిస్తారని భావిస్తున్నాను. వారికి చెప్పండి. అలా మాట్లాడితే ఇప్పుడొచ్చే ఓట్లు కూడా రావు… ” అంటూ మంత్రి హరీశ్‌ రావు సూచించారు.

Spread the love