మూసవిధానానికి స్వస్తి చెప్పండి

          ఉద్యోగం ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది. గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఇన్ని లాభాలు చేకూర్చే ఉద్యోగంలో ఉన్న స్థితిలోనే ఉండిపోలేం కదా… మరింత ఉన్నతి సాధించాలంటే ఈ సూత్రాలు పాటించమంటున్నారు కెరియర్‌ నిపుణులు…
– తోటి ఉద్యోగులు మీలాగే ఉండాలని ఆశించొద్దు. ఒకరికి సలహాలివ్వాలని చూడొద్దు. మంచికి పోయినా పెడార్థాలు తీసేవారు ఉంటారని గుర్తుంచుకోండి. మీ వరకూ మీరు ఎంత నాణ్యమైన ఉత్పాదకతను ఇవ్వగలరో ఆలోచించి ప్రణాళికతో, నిబద్ధతతో పనిచేయండి.
– ఏ రంగంలోనయినా ప్రోత్సహించి సాయం అందించేవారితోపాటు నిరుత్సాహపరుస్తూ అవరోధాలు కలిగించేవారూ ఉంటారు. అలాంటివారి మీద కోపతాపాలు వద్దు. అప్రమత్తంగా ఉంటూ లక్ష్యం దిశగా సాగండి.
– ఉద్యోగం ఇష్టంగా కాకుండా భారంగా అనిపించిందంటే ఎదుగుదల మీద ధ్యాస తగ్గుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యమూ దెబ్బతినే ప్రమాదముంది. కనుక చేసే పనుల్లో ఎప్పటికప్పుడు సులువైన మార్గాలు కనిపెట్టండి.
– సహోద్యోగులు లేదా పై అధికారుల విషయంలో మీకేదైనా అసంతృప్తి ఉన్నా.. ఆ విషయాలు చర్చకు పెట్టొద్దు. అవి చిలవలు పలవలై మీమీద సదభిప్రాయాన్ని పోగొడతాయి.
– ఎంత సమర్థంగా చేస్తున్నా ఒక్కోసారి ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అడ్డంకులు ఎదురవ్వొచ్చు. మనం నడిచే దారిలో ముళ్లూ రాళ్లూ ఎదురైనంతలో డీలాపడి వెనక్కెళ్లం కదా… ఉద్యోగమైనా అంతే. తెలివిగా దాటుకుంటూ ముందుకెళ్లాలి.
– ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుంటే వాటిని ఎలా చేరాలో స్పష్టత వస్తుంది. సునాయాసంగా గమ్యం చేరిపోతామని ఊహల్లో తేలిపోవద్దు. ఏవైనా – ఆటంకాలూ ఎదురైనంతలో నిరాశచెందక పట్టుదలగా ప్రయత్నించాలి.
పనిలో మూసవిధానానికి స్వస్తి చెప్పండి. లేదంటే ఎదుగుదల ఉండదు. ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించండి.
– తోటి ఉద్యోగులతో విభేదాలు వస్తే ఆ విషయాన్ని వారితోనే చర్చించండి. విషయం తేటతెల్లమవుతుంది. అంతే తప్ప తొందరపడి ఉద్యోగం మానేయొద్దు, అశాంతిని కొనితెచ్చుకోవద్దు.

Spread the love