సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

– మంత్రి సత్యవతి రాథోడ్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కోయపోచగూడ గ్రామ ఆదివాసీ నాయకపోడ్‌ పేదల సాగులో ఉన్నభూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) కోరింది. ఆదివారం ఈ మేరకు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశయ్య వినతిపత్రం సమర్పించారు. ‘మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం కోయ పోచగూడెంలో 52 నాయకపోడ్‌ ఆదివాసీ కుటుంబాలు మాకులపేట శివారు సర్వే నెంబర్‌ 25,26లోని 150 ఎకరాల విస్తీర్ణం గల భూమిని 2002 నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిని సాగు చేయకూడదని అటవీ అధికారులు పోలీసులతో కలిసి గ్రామంపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారు. అక్రమ కేసులు పెట్టారు. 12 మంది మహిళలను ఆదిలాబాద్‌ జైలులో ఉంచారు. జైలు నుంచి విడుదలై తిరిగి అదే భూమిని సాగు చేస్తున్నారు ….’ అని పేర్కొన్నారు.’ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సర్వే చేసి హక్కుపత్రాలు పంపిణీ చేస్తామని సర్వే పనులు ప్రారంభించింది. ఆ సర్వేలో ఈ గ్రామాన్ని చేర్చలేదు. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ, ఇక్కడే నివసిస్తున్న గిరిజనులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. మాకులపేట శివారు భూస్వాములు ఈ భూమిని గిరిజనులకు దక్కకుండా తాము స్వాధీనం చేసుకోవాలని ఇంతకాలం ఫారెస్ట్‌, రెవిన్యూ అధికారులను పక్కదారి పట్టించి అక్రమ కేసులు బనాయించారు….’ అని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ఈ భూమిని సర్వే జాబితాలో చేర్చి వాస్తవ సాగుదారులకు పట్టాలు ఇప్పించేందుకు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. పేదల సాగులో ఉన్న భూములను సర్వే చేయించి, పట్టాలిప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Spread the love