భారత్‌ నిశ్సబ్ధంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది

–  లండన్‌లో రాహుల్‌గాంధీ
లండన్‌ : భారత దేశం నిశ్సబ్ధంగా ఉండాలని బీజేపీ కోరుకుంటుందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. లండన్‌లో ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌(ఐజేఏ) నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ ఈ విమర్శలు చేశారు. ది మోడీ క్వశ్చన్‌ పేరుతో రూపొందించిన బీజేపీ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘భారత్‌ నిశ్సబ్ధంగా ఉండాలని అధికారంలో ఉన్న బిజెపి కోరుకుంటుంది. దేశంలో ప్రతీ చోటా స్వరం అణచివేయబడుతుంది. ఇందుకు ఉదాహరణ బిబిసి డాక్యుమెంటరీ’ అని రాహుల్‌ చెప్పారు. ‘ఇప్పుడు బీబీసీ అణచివేతను అనుభవిస్తుండటంతో ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ఇది వార్తయింది. అయితే భారత్‌లో ఇలాంటి మీడియా అణచివేతలు గత తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతున్నాయి’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు. ‘భారత్‌లో జర్నలిస్టులను బెదిరిస్తారు. వారిపై దాడి చేస్తారు. జర్నలిస్టులు ముప్పును ఎదుర్కొంటారు. ప్రభుత్వ పంథాకు అనుగుణంగా ఉన్న జర్నలిస్టులు రివార్డులు అందుకుంటారు’ అని రాహుల్‌ చెప్పారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నివేదికలు ఇవ్వడం ఆపిస్తే.. దానికి వ్యతిరేకంగా ఉన్న కేసులు అదృశ్యమవుతాయి’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల నుంచి ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీకి ఇది ఈ పర్యటనలో అక్కడి మీడియాతో తొలి ముఖాముఖీ కార్యక్రమం. ఐజేఏ అధ్యక్షులు దానిష్‌ ఖాన్‌ ఈ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తన భారత్‌ జోడో యాత్ర, చైనా-రష్యాలపై భారత విదేశాంగ విధానం, క్రోనీ క్యాపిటలిజం, 2024 సాధారణ ఎన్నికలు .. వంటి అంశాలపై ప్రశ్నలకు రాహుల్‌గాంధీ సమాధానం ఇచ్చారు. అలాగే అంతర్జాతీయ పర్యటనల్లో భారత ప్రభుత్వంపై విమర్శలతో దేశం పరువును తీసేస్తున్నారనే విమర్శలకు కూడా రాహుల్‌ గాంధీ సమాధానం ఇచ్చారు. విదేశీ పర్యటనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలను రాహుల్‌ గుర్తు చేశారు. ‘గత 60 ఏండ్లలో భారత్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు’, ‘భారతదేశంలో అపరిమితమైన అవినీతి’ అనే వ్యాఖ్యలను నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనల్లో చేశారని, ఇలాంటి వ్యాఖ్యలు భారదేశాన్ని విజయవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేసిన వారందరీని అవమానపర్చాయని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘కాబటి.. విదేశీ పర్యటనల్లో భారత్‌ పరువు తీసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోడీనే’ అని రాహుల్‌ చెప్పారు. తాను ఎప్పుడూ తన దేశాన్ని కించపరచలేదు.. తాను ఎప్పుడూ అలా చేయను అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. భారత్‌లో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే ఆరోపణలను కూడా రాహుల్‌ గాంధీ ఖండించారు.

Spread the love