రూ.10 వేలకోట్ల బాండ్లు

రూ.10 వేలకోట్ల బాండ్లు– సుప్రీం తీర్పునకు ముందు కూడా ముద్రణకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి మూడు రోజుల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.10,000 కోట్ల విలువైన బాండ్లను ముద్రించేందుకు ఆమోదం తెలిపింది. బాండ్ల పథకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పక్షం రోజుల తర్వాతే అంటే ఫిబ్రవరి 28న వాటి ముద్రణను ఆపేయాలని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌పీఎంసీఐఎల్‌)కు ఎస్‌బీఐ సమాచారం పంపింది. బాండ్ల ముద్రణను నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు వచ్చిన తర్వాతే ఎస్‌బీఐ ఈ సమాచారాన్ని చేరవేసింది. ‘ఎన్నికల బాండ్ల సెక్యూరిటీ పత్రాలు మాకు ఫిబ్రవరి 23న చేరాయి. నాలుగు పెట్టెల్లో మొత్తం 8,350 బాండ్లు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా మిగిలిన 1,650 బాండ్ల ముద్రణను ఆపేయాలని కోరుతున్నాం’ అని ఎస్‌పీఎంసీఐఎల్‌కి లావాదేవీల బ్యాకింగ్‌ విభాగానికి చెందిన ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఎస్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య నడిచిన ఈ-మెయిల్‌ సందేశాలను ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక సేకరించింది.
ఎస్‌పీఎంసీఐఎల్‌ అప్పటికే 8,350 బాండ్లను ముద్రించి ఎస్‌బీఐకి పంపిందని రికార్డుల ద్వారా ఆ పత్రిక తెలుసుకుంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రారంభించిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు 22,217 బాండ్లను నగదుగా మార్చుకున్నాయి. వీటి ద్వారా బీజేపీకి అత్యధికంగా రూ.8,451 కోట్లు లభించగా కాంగ్రెస్‌కు రూ.1,950 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.1,707.81 కోట్లు, బీఆర్‌ఎస్‌కు రూ.1,407.30 కోట్లు వచ్చాయి.

Spread the love