కంచుకోట ‘ఇండియా’

Kanchkota 'India'– ఎస్పీ, ఆప్‌తో కాంగ్రెస్‌ సయోధ్య
– బీహార్‌లో పుంజుకుంటున్న ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ కూటమి
– యూపీలో తగ్గుతున్న బీజేపీ హవా
– ఇతర హిందీ రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి
– దక్షిణాదిన ఎన్డీయే బలం నామమాత్రమే
సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రతిపక్ష ఇండియా కూటమి చేతులెత్తేసిందని, అది ఇప్పటికే చీలికలు పేలికలైపోయిందని ప్రభుత్వ అనుకూల మీడియా విష ప్రచారం సాగిస్తోంది. కానీ రాష్ట్రాల వారీగా వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే ఈ కథనాల్లో ఏ మాత్రం పస లేదని తేలిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో కాషాయ పార్టీకి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థి. కాంగ్రెస్‌తో ముగిసాయి అనుకున్న చర్చలు తిరిగి మొదలయ్యాయి. కాంగ్రెస్‌తో పొత్తుకు తృణమూల్‌ స్వస్తి చెప్పినప్పటికీ అక్కడ ప్రతిపక్ష శిబిరానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఇక పొరుగున ఉన్న బీహార్‌ విషయానికి వస్తే నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ ఎన్డీఏతో జట్టు కట్టినా లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వి యదవ్‌ల నాయకత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష కూటమి దానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.
న్యూఢిల్లీ : బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. తేజస్వి యాదవ్‌ చొరవ కారణంగానే తామంతా ఉద్యోగులమయ్యా మని వారు బలంగా నమ్ముతున్నారు. వారి కుటుంబాలన్నీ ఇప్పుడు ఆర్జేడీకి బాసటగా నిలుస్తున్నాయి. వచ్చే నెల 3న మహాకూటమి ఆధ్వర్యంలో ఓ భారీ ర్యాలీ జరగబోతోంది. దీనికి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర వామపక్ష నేతలతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా హాజరవుతారు. నితీష్‌ చేరికతో బీహార్‌లో ఎన్డీఏ బలం పెరగడం మాట అటుంచి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
యూపీలో పట్టు కోల్పోతున్న బీజేపీ
ఉత్తరప్రదేశ్‌ నుండి వస్తున్న వార్తలు ఇండియా కూటమిలో ఆనందాన్ని నింపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ రాష్ట్రంలోని మైనారిటీ ముస్లిం ఓట్లన్నీ ఈసారి గంపగుత్తగా సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌ కూటమి ఖాతాలోనే పడబోతున్నాయి. రాష్ట్రంలోని ముస్లిం వర్గాలకు చేరువ అయ్యేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతు న్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ముస్లింలకు పెద్దగా ఒరిగిందేమీ లేకపోయినా ఇప్పుడున్నంత ఘోరమైన పరిస్థితులు అప్పుడు లేవు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తమ వర్గానికే చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పదవికి ఎసరు వస్తుందని క్షత్రియ హిందువులు అనుమానిస్తున్నారు. 1988లో వీరభద్ర సింగ్‌ పాలన ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఠాకూర్ల ప్రాబల్యం తగ్గిపోయింది. 2000-2002 మధ్య రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన ఠాకూర్లకు ఒరగబెట్టిందేమీ లేదు. రాష్ట్ర జనాభాలో రాకూర్లు 8శాతం వరకూ ఉన్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు వారంతా ఎంతో సంతోషపడ్డారు. అయితే ఇప్పుడు యోగిని తప్పిస్తారన్న వార్తలు వస్తుండడంతో ఠాకూర్లు బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. యోగి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని బ్రాహ్మణులు కూడా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు వీరిలో ఓ గణనీయమైన భాగం తిరిగి కాంగ్రెస్‌ వైపుకు వెళ్లే అవకాశం ఉంది. కుర్మీ కులానికి చెందిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఇప్పుడు ఎన్డీఏలో ఉండడంతో యూపీలోని వారి ఓట్లన్నీ తనకే వస్తాయని బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న కుర్మీలపై నితీష్‌ ప్రభావం చూపే అవకాశం ఏ మాత్రం లేదు. పైగా కుర్మీలకు, బీజేపీలోని అత్యంత వెనుకబడిన కులాల వారికి మధ్య ఒప్పందాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు.
ఈ రాష్ట్రాలో మెరుగుపడితే…
ఈశాన్య రాష్ట్రాల్లోని 25 స్థానాలతో పాటు జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో బీజేపీకి గతంలో కంటే సంఖ్యాబలం పెరిగే అవకాశాలేవీ లేవు. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో బీజేపీకి సంతృప్తికర స్థాయిలో సీట్లు ఉన్నాయి. ఒడిసాలో బిజూ జనతాదళ్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడ బీజేపీ బలం పెరిగే సూచనలేవీ కన్పించడం లేదు.
ఇండియా కూటమి రాబోయే రోజుల్లో జమ్మూకాశ్మీర్‌, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోగలిగితే ఎన్డీఏను 240 స్థానాలకు పరిమితం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు 200కు పైగా స్థానాల్లో ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ తన పనితీరును మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే బీజేపీని మెజారిటీకి దూరం చేయగలుగుతుంది. అయోధ్యలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, బాలరాముడి ప్రాణప్రతిష్ట చేసినప్పటికీ దానివల్ల హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగే అవకాశాలేవీ లేవు. పైగా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని మోడీ అంతా తానై వ్యవహరించడాన్ని కొందరు హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, మత-జాతి విద్వేషాలు, అవినీతి, వ్యవసాయ సంక్షోభం…వంటి సమస్యలు ఎన్డీఏను మరింత బలహీనపరుస్తున్నాయి.
ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తుతో…
ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయంటూ మోడీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలకు తాజాగా బ్రేక్‌ పడింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీల మధ్య ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌, గోవా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సంబంధించి అవగాహన కుదిరింది. పంజాబ్‌లో మాత్రం విడివిడిగానే బరిలోకి దిగాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఇక హర్యానా నుండి అందుతున్న వార్తలు ఎన్డీఏలో కలవరం రేపుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశాలు ఆ కూటమికి ఏ కోశానా కన్పించడం లేదు.
దక్షిణాదిన ఎన్డీఏ పరిస్థితి దయనీయం
ఇక కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో భారీ ఆధిక్యత కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా బీజేపీకి ఏకంగా 25 సీట్లు లభించాయి. కాంగ్రెస్‌కు ఒకటి, జేడీఎస్‌కు ఒకటి, స్వతంత్రులకు ఒకటి దక్కాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి బాగా మెరుగుపడింది. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని ఆ పార్టీ తహతహలాడు తోంది. కమలదళానికి ఈసారి భంగపాటు తప్పేలా లేదు. ఇక ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం అందరికీ తెలిసిందే. కేవలం తెలంగాణలో మాత్రమే ఆ పార్టీకి కొద్దిగా బలం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆ పార్టీ బలం నామమాత్రమే.

Spread the love