దేవాలయం వద్ద మూత్ర విసర్జన..పదో తరగతి బాలుడి హత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలో ఇటీవల జరిగిన ఓ పదో తరగతి బాలుడి హత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దేవాలయం వద్ద మూత్ర విసర్జన చేస్తే అడ్డుపడ్డాడన్న కోపంతో ఓ వ్యక్తి తన దూరపు బంధువైన బాలుడిని హత్య చేసుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరువనంతపురం జిల్లా పువాచల్ ప్రాంతంలో ఆగస్టు 30న శేఖర్ అనే బాలుడు తన స్నేహితుడితో సైకిల్‌పై వెళ్లేందుకు బయటకు వచ్చాడు. అదే సమయంలో వెనుక నుంచి కదిలిన ఓ కారు అతడి మీదుగా వెళ్లడంతో శేఖర్ అక్కడికక్కడే మరణించాడు. తొలుత పోలీసులు దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే, బంధువుల ఫిర్యాదుతో స్థానిక సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. శేఖర్ దూరపు బంధువైన ప్రియరంజన్ కుట్ర పన్ని మరీ ఈ దారుణానికి పాల్పడ్డట్టు వెలుగులోకి వచ్చింది. అంతకు కొన్ని రోజుల ముందు ప్రియరంజన్ స్థానిక ఆలయం సమీపంలో మూత్ర విసర్జన చేశాడు. దీన్ని తప్పుపట్టిన శేఖర్ అతడిని నిలదీశాడు. ఈ క్రమంలో బాలుడి హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Spread the love