యువతి ప్రాణాలు తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం

హైద‌రాబాద్: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి ప్రాణాలు తీసింది. తొలుత పరిచయం, ఆపై ప్రేమ, తర్వాత విభేదాలు.. వెరసి ఓ యువతి నిండుప్రాణం బలైంది. తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు యువతి చెప్పడమే ఆలస్యం.. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో ఆమె గొంతుకోసి హతమార్చాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగిందీ ఘటన. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వికి, అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది.  తపస్వి విజయవాడలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది.
జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో జ్ఞానేశ్వర్‌పై తపస్వి కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా, అతడి నుంచి వేధింపులు ఆగలేదు.ఈ క్రమంలో తక్కెళ్లపాడులో ఉంటున్నతన స్నేహితురాలికి విషయం చెప్పి తపస్వి బాధపడింది. అంతా విన్న ఆమె ఏం జరిగిందో తెలుసుకుని, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తన ఇంటికి రమ్మని ఇద్దరినీ పిలిచింది.
గత రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడు తీసి తపస్విపై దాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన స్నేహితురాలు కేకలు వేస్తూ కిందికి వచ్చి ఇంటి యజమానికి చెప్పి పైకి తీసుకెళ్లింది. అప్పటికే తలుపులు బిగించిన నిందితుడు బాధితురాలి గొంతు కోశాడు. తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లిన స్థానికులు నిందితుడిని బంధించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తపస్విని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన ప్రదేశానికి, ప్రేమికులకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. తపస్వి తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నట్టు చెప్పారు. మాటల మధ్యలో తపస్వి తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పడంతో నిందితుడు కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. అనంతరం బ్లేడుతో చేతిపై గాయం చేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love