12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

– వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
– 4.12 లక్షల మంది విద్యార్థుల హాజరు
– 933 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థులు ్‌రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశముందని పేర్కొన్నారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు కూడా కాలేజీ లాగిన్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు ఇవ్వొచ్చని సూచించారు. హాల్‌టికెట్లలో విద్యార్థుల ఫొటో, సంతకం, పేరు, మాధ్యమం, హాజరయ్యే సబ్జెక్టులు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని కోరారు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లలో ప్రిన్సిపాళ్ల సంతకం లేకున్నా పరీక్షలు రాయించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 2,70,583 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 1,41,742 మంది కలిపి మొత్తం 4,12,325 మంది హాజరవుతున్నారని వివరించారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Spread the love