1910లో డీజిల్ జనరేటర్లతో ప్రస్థానం షురూ
దేశంలోనే మొదటి థర్మల్ స్టేషన్‌గా హుస్సేన్ సాగర్
నేడు..1.30 కోట్ల గృహ, 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు
18వేల మెగావాట్ల పీక్ డిమాండ్‌ను తట్టుకుంటున్న గ్రిడ్లు
విద్యుత్ రంగ చరిత్రను కండ్లకు కడుతున్న పవర్ ఎగ్జిబిషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ విద్యుత్ రంగం 120 ఏండ్ల క్రితం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఆధ్వర్యంలో పురుడు పోసుకుంది. హైదరాబాద్ సంస్థానం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు 12 దశాబ్దాల ప్రస్థానంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. స్వరాష్ర్టం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ విద్యుత్ రంగం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. 18 వేల మెగావాట్ల పీక్ డిమాండ్‌ను సైతం తట్టుకుంటూ నేడు దేశ మౌళిక వసతుల రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. నిజాం కాలంలోని తొలి విద్యుత్ జనరేటర్ల నుంచి నేటి స్మార్ట్ గ్రిడ్, డిజిటల్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ వరకు సాగిన ఈ ప్రయాణం విద్యుత్ రంగంలో జరిగిన సాంకేతిక, సంస్థాగత పరివర్తనకు ప్రతీకగా నిలిచింది.
తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ద్వారా 1910లో డీజిల్ జనరేటర్లతో విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. హైదరాబాద్‌తో పాటు నల్లగొండ, జహీరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ సహ పలు పట్టణాలకు అప్పట్లోనే వీటి ద్వారా రాత్రి పూట విద్యుత్‌ను అందించేవారు. అనంతరం నగరంలోని మింట్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో విద్యుదీకరణ చేపట్టడంతో పాటు సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పదేండ్లకు 1920లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మింట్ కాంపౌండ్‌లో హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ పారిశ్రామికాభివృద్ధికి ఎంతో దోహదపడింది.
తెలంగాణ విద్యుత్ రంగానికి ఆద్యుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అయితే, దేశంలోనే మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్‌ను నెలకొల్పిన ఘనత ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు దక్కుతుంది. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావడంతో విద్యుత్ వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోని పరిపాలనా వ్యవస్థలో భాగమైంది. గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. హైదరాబాద్ రాష్ర్టం1959లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిన తర్వాత ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) ఏర్పాటైంది. ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ బాధ్యతలను ఒకే సంస్థ నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి.
1998లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం అమల్లోకి రావడంతో విద్యుత్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీఎస్‌ఈబీని విభజించి ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ సంస్థలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోతో పాటు వివిధ డిస్కమ్‌లు ఏర్పడ్డాయి. తెలంగాణకు హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో కొత్త డిస్కంలు ఏర్పాటయ్యాయి. అయితే సాంకేతిక నష్టాలు, విద్యుత్ చోరీ, ఆర్థిక సవాళ్లు ఈ దశలో బాగా పెరిగాయి. తెలంగాణ విద్యుత్ రంగం ఈ కాలంలో తీవ్ర వివక్ష, నిర్లక్ష్యానికి గురైందనే ఆరోపణలూ ఉన్నాయి.
తెలంగాణలో….
2014 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ విద్యుత్ రంగం వృద్ధి దశకు చిరునామాగా నిలిచింది. టీజీజెన్కో, టీజీట్రాన్స్‌కోలతో పాటు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ 15 జిల్లాలకు, వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉతర పంపిణీ విద్యుత్ సంస్థ ఎన్పీడీసీఎల్ 18జిల్లాలకు విద్యుత్ సేవలను అందిస్తున్నాయి. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, అంతరాయాల తగ్గింపు, విద్యుత్ నష్టాల నియంత్రణ, సౌర విద్యుత్ ప్రోత్సాహం, స్మార్ట్ మీటరింగ్, డిజిటల్ సేవలు, 2 వ్యవసాయ ఫీడర్ల విభజన వంటి ఆధునిక కార్యక్రమాలను సంస్థ విజయవంతంగా అమలు చేస్తోంది.
పవర్ ఎగ్జిబిషన్….
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన పవర్ ‘ఎగ్జిబిషన్-2026’ తెలంగాణ120 ఏండ్ల విద్యుత్ ప్రస్థానాన్ని పరిచయం చేసింది. నిజాం పాలనలో ప్రారంభమైన విద్యుత్ సేవల నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను… చిత్రాలు, నమూనాలు, చారిత్రక పత్రాలు సమాచార ప్రదర్శనల రూపంలో ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోగ విధానాలు, భద్రతా ప్రమాణాలు, పొదుపు మార్గాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థలు, ఆధునిక విద్యుత్ పంపిణీ సాంకేతికతలు, విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న మార్పులు వంటి అంశాలను ఎగ్జిబిషన్ కండ్లకు కట్డింది.
టీజీ విద్యుత్ రంగం వృద్ధి 2014కు ముందు….. 2026లో …
1). ఉత్పత్తి సామర్థ్యం 7,700 మెగావాట్లు 2,4000 మెగావాట్లు
2). డిమాండ్ 9,000 మెగావాట్లు 18,000 మెగావాట్లు
3). తలసరి వినియోగం 1,196 యూనిట్లు 2,300 యూనిట్లు
4). ట్రాన్స్ ఫార్మర్లు 4.60 లక్షలు 9 లక్షలు
5). 400 కేవీ సబ్ స్టేషన్లు 6 30
6). 220 కేవీ సబ్ స్టేషన్లు 51 103
7). 132 కేవీ సబ్ స్టేషన్లు 176 251
120 వసంతాల తెలంగాణ విద్యుత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



