Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడీ పాలనలో పాఠశాల విద్య దయనీయం

మోడీ పాలనలో పాఠశాల విద్య దయనీయం

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లక్షకు పైగా బడులు మూసివేత
రాష్ట్రంలోనూ ప్రభుత్వ స్కూళ్లు మూసివేసేందుకు కుట్ర : ఎస్‌ఎ‌ఫ్‌ఐ రాష్ట్ర ‌ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
జనగామలో పాఠశాల 
విద్యార్థుల రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ-జనగామ

దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఎస్‌ఎ‌ఫ్‌ఐ రాష్ట్ర ‌ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజనీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన పాఠశాల విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. భారత ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కీలకమైన ప్రభుత్వ పాఠశాలలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. 2014-15లో దేశవ్యాప్తంగా 11,07,101 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 10,17,660కు పడిపోయిందన్నారు. ఈ పదేండ్లలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలయిన మధ్యప్రదేశ్‌లో 29,410, ఉత్తరప్రదేశ్‌లో 25,126 పాఠశాలలు తగ్గిపోయాయని అన్నారు. చిన్న పాఠశాలలను విలీనం చేయడం, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణాలతో పాఠశాలలను మూసివేయడం ద్వారా గ్రామీణ, పేద, కార్మిక, దళిత, ఆదివాసీ కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రయివేట్ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. 2014-15లో 2,88,164గా ఉన్న ప్రయివేట్ పాఠశాలల సంఖ్య 2023-24 నాటికి 3,31,108కు చేరాయన్నారు. జాతీయ విద్యా విధానం- 2020 పేరుతో చిన్న పాఠశాలలను పెద్ద పాఠశాలల్లో విలీనం చేయడం, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించడం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వ విద్యను క్రమంగా కుదించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాలలను మూసివేయడం పరిష్కారం కాదు
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పాఠశాలను మూసివేయడం పరిష్కారం కాదని, అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోకి ఆకర్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని నాగరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవనాలు, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ప్రయోగశాలలు, గ్రంథాల యాలు వంటి మౌలిక వసతుల కొరతతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలు కూడా తీవ్రంగా ఉన్నాయని అన్నారు. నిధులు కేటాయించి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులను అభివృద్ధి చేసి పాఠశాలల భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాల దూరం పెరగడం, రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో పాఠశాల విద్యను కాపాడేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, దామెర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, విఘ్నేష్ జనగామ జిల్లా అధ్యక్షులు పొదల లవకుమార్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -