లక్నోలో ఘోర అగ్నిప్రమాదం..
ప్రాణాలు తీస్తున్న కోచింగ్ సెంటర్లు
లక్నో : భవిష్యత్ గురించి కలలు కంటూ ఉద్యోగ కలలను సాకారం చేసుకోవటానికి కోచింగ్ సెంటర్లలో చేరితే…అవి ప్రాణాలు తోడెస్తున్నాయి. సరిగ్గా రెండేండ్ల కిందట ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్ లో జల సమాధి అయిన విషయం విదితమే. తాజాగా యూపీలోనూ ఓ కోచింగ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో అసువులు బాశారు.
ఏం జరిగింది..?
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నో లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లో అమాంతంగా మంటలు ఎగిసిపడ్డాయి. మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. రెప్పపాటులో మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని రెండో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్, సాఫ్ట్వేర్ ఆఫీసులను చుట్టుముట్టాయి. మంటల్లో చిక్కుకుని కోచింగ్ సెంటర్‌లోని పలువురు సజీవదహనం అయ్యారు. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో మొదట 8 మంది మృతి చెందగా, ఇప్పుడు ఆ సంఖ్య 15కు పెరిగింది. ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వారిని ఆస్ప త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మంటలు నుంచి తప్పించుకునేందుకు భవనంలోపల ఉన్న విద్యార్థులు కిందకు దూకేసిన దృశ్యాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏకంగా 14 ఫైర్ ఇంజిన్లు, ఒక హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనంతో మంటలను ఆర్పివేశారు. భవనం లోపల దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో భవనం గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.యూపీ ఉపముఖ్యమంత్రి బ్రిజేశ్ పాఠక్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొందరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెప్పారు. రెస్క్యూ సిబ్బంది ప్రతి గదిని, బాత్రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?
వాణిజ్య భవనంలో మొదట మూడో అంతస్తులో మంటలు అంటుకున్నాయి. అయితే చూస్తుండగానే అవి ఆఫీస్ మొత్తాన్ని చుట్టుముట్టాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో 20 నుంచి 30 మందికి పైగా ఉండొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట, గందరగోళం ఏర్పడింది. భవనంలో పనిచేస్తున్న వారు, ఇతరులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అటూఇటూ పరుగులు తీశారు. బయటకు రావడానికి ఎలాంటి దారులు కనిపించక పోవడంతో, పక్కనే వేలాడుతున్న ఒక వైర్ను పట్టుకొని కిందకు దూకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక యువతి సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు రూ.2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ. 50వేలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. భవనంలో ఎంతమంది చిక్కుకున్నారు? ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రమాదంపై విచారణకు యోగి ఆదేశం
మరోవైపు యూపీ రాజధానిలో అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే, సీఎం యోగి ఆదిత్యనాథ్ అలీగఢ్ పర్యటనను మధ్యలోనే ముగించుకొని లక్నోకు తెరిగి వచ్చారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకొని నివేదిక సమర్పించాలని డీజీపీ, హోంశాఖకు చెందిన అదనపు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
15 మంది సజీవదహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


