మెగా డీఎస్సీకి 2.79 లక్షల దరఖాస్తులు

https://schooledu.telangana.gov.in– ఎస్‌ఏకు 1.60 లక్షల మంది, ఎస్జీటీకి 85,916 మంది అప్లై
– లాంగ్వేజ్‌ పండిట్‌కు 18,211, పీఈటీలకు 11,992 దరఖాస్తులు
– స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులకు 3,551 మంది అప్లై
– ఉచితంగా 23,919 మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే గడువు గురువారంతో ముగిసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెగా డీఎస్సీకి 2,85,288 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. వారిలో 2,79,966 మంది దరఖాస్తులను సమర్పించారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 74,162 మంది అభ్యర్థులు దరఖాస్తులను సవరించారని పేర్కొన్నారు. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు 1,60,296 దరఖాస్తులొచ్చాయని తెలిపారు. 6,508 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) పోస్టులకు 85,916 మంది దరఖాస్తు చేశారని వివరించారు. 727 లాంగ్వేజ్‌ పండితులు (ఎల్పీ) పోస్టులకు 18,211 మంది, 182 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టులకు 11,992 మంది అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించారని పేర్కొన్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 220 ఎస్‌ఏ పోస్టులకు 1,455 మంది, 796 ఎస్జీటీ పోస్టులకు 2,096 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులకు 2,79,966 దరఖాస్తులొచ్చాయని వివరించారు. టెట్‌ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల దరఖాస్తు ఫీజును రూ.వెయ్యికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో టెట్‌ ఫలితాల తర్వాత అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 24,975 మంది సున్నా ఫీజు చెల్లించగా, వారిలో 23,919 మంది దరఖాస్తులను సమర్పించారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాతపరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. వచ్చేనెల 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థులు ఇతర వివరాలకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో అత్యధికం… మేడ్చల్‌లో అత్యల్పం
మెగా డీఎస్సీకి హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 27,027 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 15,610 మంది, నిజామాబాద్‌లో 13,166 మంది, ఖమ్మంలో 12,970 మంది, వికారాబాద్‌లో 12,856 మంది, సూర్యాపేటలో 11,907 మంది, సిద్దిపేటలో 11,021 మంది, నాగర్‌ కర్నూల్‌లో 10,651 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 10,219 మంది అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించారు. అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 2,265 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లిలో 2,828 మంది, ములుగులో 2,908 మంది, జనగామలో 3,096 మంది, యాదాద్రి భువనగిరిలో 4,398 మంది, పెద్దపల్లిలో 4,251 మంది అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించారు.

Spread the love