25 వసంతాల సామాజికోద్యమ ప్రస్థానం ‘కేవీపీఎస్‌’

25 years of social movement 'KVPS'వేల సంవత్సరాలుగా దళితులు ఓవైపు సామాజిక అణిచివేత, మరోవైపు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. అట్టడుగు పొరల్లో జీవిస్తున్న వారి జీవితాల్లో నేటికీ ఆశించిన మార్పు రాలేదు. సమాజాభివద్ధికి తమ శ్రమను ధారపోస్తున్న వారికి ప్రకతి వనరుల్లో సహజ సమాన న్యాయాన్ని పొందలేకపోతున్నారు అవమానంతో పాటు ఆకలి, దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. ఈ కాలంలోనూ కులవివక్ష, అంటరానితనం పల్లెల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా నిరాటంకంగా కొనసాగుతోంది. భూమి, నీరు, గాలి, వెలుగు సమస్త ప్రజలకు సమాన హక్కుగా ఉండనంతకాలం ఈ అసమానతలు నీడలా వెంటాడుతూనే ఉంటాయి. కులవివక్ష దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు, కుల దురహంకార హత్యలు రాష్ట్రంలో ఏదో మూల ప్రతిరోజు దర్శనమిస్తున్నాయి. విద్యా, వైద్యం, ఉపాధి దళితులకు అందని ద్రాక్షలా మారాయి. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల వల్ల రిజర్వేషన్లు కోల్పోవడంతో ఉన్న కొద్దిపాటి అవకాశాలు చేజారుచున్నాయి. దళితులందరిని సంఘటితం చేయడం, విశాల ఐక్యత, పోరాడి సాధించడం అనే మౌలిక చారిత్రక అవసరంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం 1998 అక్టోబర్‌ 2న ఆవిర్భావించింది. కేవీపీఎస్‌ ఏర్పడే నాటికి దళితులు అనేక చీలికలు పేలికలై ఉపకులాల వారీగా సంఘాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ అనుకూల, వ్యతిరేక విషయాల చుట్టూ తిప్పుతూ కొన్ని పరిమిత లక్ష్యాల కోసం కృషి చేస్తున్నాయి. కానీ కేవీపీఎస్‌ మాత్రం ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన వంటి శాశ్వత లక్ష్యాలను నిర్దేశించుకుని 25 సంవత్సరాలుగా పోరాడుతూనేవుంది.
కుల వివక్షపై సమగ్ర అధ్యయనం చేయడానికి రాష్ట్రంలో సుమారు 11వేల గ్రామాల్లో వేలాదిమంది కార్యకర్తలతో సర్వే జరిగింది. ఈ క్రమంలో ‘హోటల్‌లో అందరం కలిసి తింటాము. సినిమా టాకీస్‌లో, ఆర్టీసీ బస్సులో అందరం కలిసి కూర్చుంటున్నాము. ఇంకా కులవివక,్ష అంటరానితనం ఎక్కడుంది? కులాల మధ్య కొత్త పంచాయితీ పెట్టడానికి కేవీపీఎస్‌ ఏర్పడిందా?’అని వాదించినవారున్నారు. ఇప్పుడు దాని అవసరం ఏంటని? కూడా కొందరు చర్చోపచర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేల్లో చాలా హృదయ విధారకర సంఘటనలు వెలుగు చూశాయి. దళితులను ఊరు ఉమ్మడి బావిలో నీళ్లు తోడుకోనివ్వరు. హోటల్‌ల రెండుగ్లాసుల పద్ధతి అవలంబించడం, క్షవరం చేయకపోవడం, బట్టలుతకపోవడం, రచ్చబండలపై కూర్చొనివ్వకపోవడం ఇవి వేళ్లూనుకున్న కులవివక్షకు రూపాలు. ఇంకా అగ్రకులాల వీధుల్లోకి రానియ్యరు. దొరలు ఎదురొస్తే తలవంచి నమస్కరించాలి. పండగలు, ఉత్సవాల్లోనూ వివక్షే ఉండేది. దసరా పండుగ రోజు జమ్మి ఆకు ముందు తీసుకుంటే భౌతిక దాడులు చేస్తారు. బోనాలు చివరికి చెల్లించాలి. బోనం బయటనే చెల్లించుకోవాలి. గుడిలోకి రానివ్వరు. ఎస్సీ డ్వాక్రా గ్రూపు మహిళలు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండితే పెత్తందారుల పిల్లలు తినరు. ఎస్సీలకు చివరికి కాష్టం దగ్గర వివక్ష ఉండేది. శ్మశాన స్థలం ఉండదు ఇతర కులాల వారిని పెట్టే చోట ఎస్సీల శవాలను పూడ్చుకొనివ్వరు. ఇటువంటి కులవివక్ష అంటరానితనంపై కేవీపీఎస్‌ దశలవారీ పోరాటాలు చేసింది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. కులవివక్ష రూపాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రత్యేక కమిషన్‌ వేయాలని పోరాడింది. నాడు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద వేలాదిమందితో భారీ ధర్నా నిర్వహించింది పోలీసులు లాఠీచార్జి, భాష్పవాయువుతో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. అసెంబ్లీలో నాటి సీపీఐ(ఎం) పక్ష నేత, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పాటూరి రామయ్య ఒత్తిడి చేయడం, బయట జరిగిన ప్రజా ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ రాష్ట్రమంతటా తిరిగి 62 కుల వివక్ష రూపాలను గుర్తించి ప్రభుత్వానికి 105 సిఫారసులు చేసింది. 17 రకాల జీవోలు సాధించబడి కమిషన్‌కు చైర్మెన్‌ సభ్యులను నియమించాలని, నిధులు కేటాయించాలని అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించింది.
అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేయడంతో పాటు పూలే, అంబేద్కర్‌ జయంతులు వర్ధంతుల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక చైతన్య యాత్రలు, అంబేద్కర్‌ పూలే జన జాతరలు, సామాజిక ఆర్థిక సమస్యలపై సెమినార్లు, చర్చాఘోష్టులు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ దళితుల్లో చైతన్యానికి కేవీపీఎస్‌ నిరంతరం శ్రమించింది. అంబేద్కర్‌ మహారాష్ట్రలోని మహర్‌ పట్టణంలో చౌదారి చెరువు మంచినీళ్లు పోరాట స్ఫూర్తితో, నాసిక్‌ కాలారం దేవాలయ ప్రవేశం కోసం సాగిన పోరాటాల వలె నాటి కెేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీల నాయకత్వంలో 2007లో రంగారెడ్డి జిల్లాలో సామాజిక చైతన్య సైకిల్‌ యాత్ర సాగింది. 20 మండలాలు 152 గ్రామాలు, 1200 కిలోమీటర్లు, మొత్తంగా14 రోజులు పాటు జరిగింది 69 గ్రామాల్లో అనేక రూపాల్లో కొనసాగుతున్న కులవివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటనలు జరిగాయి. హోటల్‌లో ఉన్న రెండు గ్లాసుల్ని ధ్వంసం చేసి ఒకే గ్లాసు పెట్టడం, ఊరుమ్మడి బావిలో నీళ్లు తోడుకోవడం, దేవాలయాల ప్రవేశాలు, క్షవరం చేయించడం వంటి అనేక ప్రతిఘటనా పోరాటాలు నిర్వహించింది. 2008లో భావసారుప్యత కలిగిన సంఘాలన్నింటినీ ఐక్యం చేసి రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించింది. సుమారు 78 సంఘాలు ప్రత్యక్షంగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ మండలాల్లో 813సంఘాలు రాష్ట్ర జాతాల్లో పాల్గొన్నాయి రాష్ట్రవ్యాప్తంగా 836 గ్రామాలు 50 వేల కిలోమీటర్లు ఈ జాతాలు పర్యటించాయి. 4420 కేంద్రాల్లో వివక్ష రూపాల పై ప్రతిఘటనలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం నేతత్యంలో సాగిన సైకిల్‌ యాత్ర 76 రోజులపాటు 2500 కిలోమీటర్లు 46 మండలాలు 521 గ్రామాల్లో సాగింది.
దళితులు చనిపోతే తమ శవాలను పూడ్చుకునే ఆరడుగుల స్థలం కూడా లేక నానా ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లోని ప్రతి దళితవాడకు శ్మశాన స్థలం ప్రభుత్వమే కేటాయించాలని కోరుతూ దశలవారీ పోరాటాలు నిర్వహించింది. మండల ధర్నాలు, కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహించింది. అగ్రకులాల శవాలను పూడ్చుకునే శ్మశాన స్థలాల్లో ఎస్సీల శవాలను సమాధి చేయనివ్వరు. కొన్ని గ్రామాలలో దళితులకు శ్మశాన స్థలాలు పెత్తందారులైన రియల్టర్లు కబ్జా చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దళితుల శవాలను తీసుకెళ్లి చెరువు కట్టలు, రైల్వే ట్రాకుల పక్కన సమాధులు చేయాల్సిన దుస్థితి. ఇది చాలా దుర్మార్గం. అందుకే ప్రతి దళితవాడకు రెండెకరాల శ్మశాన స్థలం కేటాయించాలని, ఇప్పటికే ఉన్న శ్మశాన స్థలాలకు రక్షణ కల్పించి, ఆక్రమించిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని కోరుతూ 2008 సెప్టెంబర్‌ 1న శవపేటికలతో చలో అసెంబ్లీ నిర్వహించింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో పోలీసుల అడ్డుకోగా అక్కడే బైటాయించడంతో ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన స్పీకర్‌, ఫ్లోర్‌ లీడర్‌ మాట తప్పారు. తిరిగి దీనిని కొనసాగింపుగా 2008 డిసెంబర్‌ 22న జిల్లా కలెక్టరేట్లను శవపేటికలతో ముట్టడించారు. జిల్లా కలెక్టరేట్ల ఎదుట శవాలతో కూడిన బొమ్మలను తగలబెట్టడం జరిగింది. దశలవారీ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వ భూమి ఉన్న అన్ని గ్రామాలలో తక్షణమే రెండెకరాల శ్మశాన స్థలం కేటాయిస్తామని, ప్రభుత్వభూమి లేని చోట కొనుగోలు చేసి శ్మశాన స్థలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం జీవో నెంబర్‌ 1235 విడుదల చేసింది. కానీ ఆ జీవో అమలు కాకపోవడంతో జీవో అమలు కోసం కూడా అనేక పోరాటాలు సాగాయి. ఇవేకాదు కేవీపీఎస్‌ 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎక్కడ దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినా బాధితుల పక్షాన బాధ్యతగా పనిచేసింది కేవీపీఎస్‌. ఈ సందర్భంగా ఉద్యమ ప్రస్థాన వేడుకలు నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. రాబోయే రోజుల్లో రాజ్యాంగం రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి లక్ష్యాల కోసం కెేవీపీఎస్‌ పోరాడుతుంది. సామాజిక ఉద్యమాల్లో సమరశీలంగా పనిచేస్తూ ప్రత్యామ్నాయ విధానాలు, దళితుల సమగ్రాభివృద్ధి, సాధికారత సాధన కోసం ముందుకు సాగుతుంది. కులవివక్ష లేని సమాజం కోసం కేవీపీఎస్‌ చేస్తున్న కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరుతున్నాము.
(అక్టోబర్‌ 01-07 వరకు కేవీపీఎస్‌ ఆవిర్భావ వారోత్సవాలు)
– స్కైలాబ్‌బాబు, సెల్‌:9177549646

 

Spread the love