3.31 కోట్ల మంది ఓటర్లు

3.31 crore voters– రాష్ట్రంలో నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే
– ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయొచ్చు
– తొలి రోజు 48 నామినేషన్లు
– మహిళా ఓటర్లు పెరిగారు : సీఈవో వికాస్‌ రాజ్‌ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 3.31 కోట్ల మంది ఓటర్లున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్సున్న ఓటర్లు దాదాపు 10 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. అభ్యర్థులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు చేయొచ్చనీ, అయితే దాఖలు చేసిన ప్రింట్‌ కాపీనీ ఈ నెల 24వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలని తెలిపారు. నామినేషన్ల మొదటి రోజైన గురువారం రాష్ట్రవ్యాప్తంగా 48 నామినేషన్లు దాఖలైనట్టు చెప్పారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్‌ పత్రాలతో పాటు ఐదు ఫొటోలివ్వాలని ఈ సందర్భంగా తెలిపారు. అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో సంతకం చేయాలనీ, ప్రతి కాలమ్‌నూ నింపాలని చెప్పారు. ‘ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలి. ఫొటోల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్త వహించాలి. టోపీలు, కళ్లద్దాలు పెట్టుకొని ఫొటోలు దిగరాదు. కనీసం రెండు నెలల ముందు తీసుకున్న ఫొటోలను మాత్రమే అందజేయాలి. అభ్యర్థుల ముఖాలు స్పష్టంగా ఉండేలా జాగ్రత్త పడాలి’ అని వికాస్‌రాజ్‌ సూచించారు. లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్‌ కంటోన్మెట్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైం దని చెప్పారు. ఈనెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. నామినేషన్‌ ఫామ్‌, అఫిడవిట్‌లో అన్ని వివరాలను పూర్తి చేయాలని కోరారు. నామినేషన్‌ పేపర్ల దాఖలు సమయంలో ఒకసారి ఆర్వో ఆఫీస్‌లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
నామినేషన్‌ వేసే అభ్యర్థి డిపాజిట్‌ ఫీజు కింద రూ.25 వేలు చెల్లించాలన్నారు. షెడ్యూల్డ్‌ తరగతులు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ఫీజులో తగ్గింపు ఉంటుందని వెల్లడించారు. రాజకీయ పార్టీలు ఫామ్‌ ఏ, బీలను సీఈఓ ఆఫీస్‌, ఆర్వో ఆఫీస్‌లో ఇవ్వాలని సూచించారు. అభ్యర్థి కచ్చితంగా క్రిమినల్‌ హిస్టరీని పబ్లిష్‌ చేయాలని ఆదేశించారు. ప్రతి అభ్యర్థి నామినేషన్‌ వేసే ముందు రోజు కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఎన్నికల ఖర్చును దాంట్లో చూపించాల్సిందేనని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో ఓపెన్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్‌ను ఈ ఎన్నికల్లో ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా వికాస్‌ రాజ్‌ తెలిపారు. 19 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు ఒక నోడల్‌ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని వివరించారు. ప్రతీ ఈవీఎం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఎంపీ స్థానాల పరిధిల్లోని 51 అసెంబ్లీ స్థానాల్లో భారీగా నగదు ఖర్చు అయినట్టుగా గుర్తించామని అన్నారు. అందువల్ల పార్లమెంట్‌ ఎన్నికలపై గట్టి నిఘా పెట్టామని చెప్పారు. ఎన్నికల విధులకు 204 అంతర్రాష్ట్ర, 444 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 160 కేంద్ర సంస్థల బలగాలతో పాటు.. ఇప్పటికే 60 కంపెనీల బలగాలు తెలంగాణలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రతీ జిల్లాలో 16 మంది నోడల్‌ అధికారులు ఉన్నారని…2 లక్షలా 94 వేల మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు పలువురు అభ్యర్థులపై 2 వేల ఫిర్యాదులు వచ్చాయనీ, ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనకు సంబంధించి నాలుగు వేల ఫిర్యాదులు నమోదైనట్టు చెప్పారు. ఎండాకాలం వల్ల ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మెడికల్‌ టీమ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో 9,990 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించినట్టు తెలిపారు. ఈ దఫా నాగర్‌కర్నూల్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌తో పాటు కొంత మేరకు రంగారెడ్డి ఎంపీ స్థానాల పరిధిలో అదనపు పోలింగ్‌ స్టేషన్లకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించినట్టు తెలిపారు.
కేసీఆర్‌ గడువు కోరారు…
మాజీ సీఎం కేసీఆర్‌ ఉపయోగిస్తున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమాధానం చెప్పాలంటూ జారీ చేసిన నోటీసులపై ఆయన వారం రోజుల గడువు కోరారనీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆ విషయాన్ని పరిశీలిస్తున్నదని వికాస్‌రాజ్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌ ఎంపీ స్థానం పరిధిలో కొంత మంది అభ్యర్థుల వ్యాఖ్యలు, చర్యలతో పరిస్థితి సున్నితంగా మారకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించవద్దని రాజకీయ పార్టీలను కోరారు. ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆయన నామినేషన్‌ తిరస్కరిస్తారా?
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి నామినేషన్‌ తిరస్కరిస్తారా? అని అడిగిన మరో ప్రశ్నకు వికాస్‌ రాజ్‌ సమాధానమిస్తూ, అది చట్టపరిధిలోని అంశమనీ, నామినేషన్‌ దాఖలు సమయంలో ఆర్వోలు చట్టపరంగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈవీఎం, వీవీప్యాట్‌ల మధ్య తేడా లేదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం, వీవీప్యాట్‌ల సంఖ్య మధ్య ఎలాంటి తేడా రాలేదని సీఈవో తెలిపారు. అంతా సజావుగా జరిగిందని అన్నారు. గత మూడేండ్లుగా బోగస్‌ ఓట్ల ఏరివేత, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియ సత్ఫలితాలనిచ్చిందని వివరించారు.

Spread the love