అగ్గితో బుగ్గి

నవతెలంగాణ-జూలూరుపడు
భద్రాద్రిని అడవుల జిల్లాగా పిలుస్తారు. ఏటా వేసవిలో అటవీ ప్రాంతంలో అగ్గి రాజుకొని వన సంపద బుగ్గి పాలవుతోంది. అలాగే జీవ వైవిద్యానికి నెలవైన వన్యప్రాణులు, పశుపక్ష్యాదులు అంతరించిపోతున్నాయి. అందుకే వేసవి సమీపించగానే పరిసర గ్రామాలతో పాటు ఆ శాఖ అధికారులను ప్రమాదాల బెడద ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఫైర్‌లైన్స్‌ ఏర్పాటుతో పా టు అవసరమైన కార్యాచరణను జోన్‌లు, బీట్‌ల వారీగా ఇప్పటికే రూపొందించి అమలు చేస్తున్నారు.
మంటలు చెలరేగకుండా అడ్డుగీత..
ఒక చోట మంటలు తలెత్తితే అవి ఎండుటాకుల కారణంగా అడవి మొత్తం వ్యాపిస్తాయి. ఎండిన ఆకులు, కొమ్మలు, గడ్డిపోచలను ఒక వరుసలో పోగు చేస్తూ, మధ్యలో మట్టి తేలే వరకు కొన్నిమీటర్ల వెడల్పులో ఏర్పాటు చేసే దారులే ఫైర్‌లైన్స్‌. ఎక్కడైనా మంటలు వ్యాపించినా ఆ దారుల వరకే పరిమితం అవుతాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫైర్‌ బ్లోయర్స్‌, ఫైర్‌ రాకర్స్‌ (చెత్త వేరుచేసే యంత్రం), ఫైర్‌ బీటర్స్‌ (అగ్ని కీలల్ని కొట్టి అదుపు చేసే యంత్రం) వినియోగంపైన సిబ్బంది సమాయత్తం అయ్యారు. సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తతంగా చేపడుతున్నారు. మరో వైపు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థతో డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారు ఎప్పటికప్పుడు ప్రమాదాలను పసిగట్టి తెలంగాణ అటవీ శాఖకు పంపుతుంది. ఆ సమాచారం వెంటనే బీట్‌ అధికారులు, సర్పంచులు, కార్యదర్శులకు అందుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు, అశ్వారావుపేట, భద్రాచలం, ములకలపల్లి మండలాల్లో పలుచోట్ల అగ్గితో అడవి దగ్ధమయింది.
ప్రమాదాలకు కారణాలివే..
ఏటా సంభవిస్తున్న ప్రమాదాల్లో 90 శాతం మానవ నిర్లక్ష్యం, తప్పిదాలే కారణమని అటవీ శాఖ గుర్తించింది.
– సమీప పొలాల్లో పంట వ్యర్థాల కాల్చివేతతో మంటల వ్యాప్తి
– వనంలో బీడీలు, చుట్టలు తాగి పడేయడం
– వన దేవతల మొక్కులకు వచ్చిన వారు వంటల తర్వాత నిప్పు కణికలను ఆర్పేయకపోవడం
– రాళ్ల రాపిడితో మంటలు చెలరేగడం
– బీడీ ఆకు సేకరణ సమయంలో మంటలు పెట్టడం
– వేటగాళ్లు వన్యప్రాణుల వేట కోసం నిప్పు పెట్టడం
– రహదారుల వెంట వాహనదారులు భోజనాలు తయారు చేసుకున్నాక నిప్పు ఆర్పకుండా వెళ్లడం.
– ఫైర్‌లైన్‌ వరకే పరిమితమవుతున్న మంట

Spread the love